ఠారెత్తిస్తున్న పెట్రో ధరలు

Sun,September 9, 2018 12:23 AM

Petrol breaches Rs 80-mark in Delhi

-ఢిల్లీలో తొలిసారి రూ.80 దాటిన పెట్రోల్
- హైదరాబాద్‌లో లీటర్ ధర రూ.85.23
-రూ.78.87 పలుకుతున్న డీజిల్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. చుక్కల్లో చేరిన ఇంధన ధరలు సామాన్యుడికి ముచ్చెమటలు పోయిస్తుండగా, ద్రవ్యోల్బణ భయాలు దేశ ఆర్థిక వ్యవస్థను వెంటాడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర శనివారం రూ.80ని దాటింది. 39 పైసలు పెరిగి తొలిసారిగా రూ. 80.38ని తాకింది. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయిలో 44 పైసలు అందుకుని రూ.72.51ని చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 42 పైసలు ఎగబాకి రూ.85.23 పలుకగా, డీజిల్ ధర 48 పైసలు ఎగిసి రూ.78.87 వద్ద నిలిచింది. ముంబైలోనైతే లీటర్ పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా రూ.87.77గా నమోదైంది. డీజిల్ ధర రూ.76.98గా ఉన్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.71.73 వద్ద కదలాడుతున్న నేపథ్యంలో ముడి చమురు దిగుమతుల నష్టాలను భర్తీ చేసేందుకు చమురు సంస్థలు వరుస వడ్డింపులకు దిగుతున్నాయి. ఆగస్టు మధ్య నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ.3.24, డీజిల్‌పై రూ.3.74 చొప్పున బాదాయి. కాగా, ప్రస్తుతం లీటర్ డీజిల్‌పై రూ.15.33, పెట్రోల్‌పై రూ.19.48 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నది. దీనిపై ఆయా రాష్ర్టాలు మళ్లీ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వేస్తున్నాయి. నవంబర్ 2014 నుంచి జనవరి 2016 మధ్య డీజిల్‌పై రూ.13.47, పెట్రోల్‌పై రూ.11.77 మేరకు సుంకాన్ని కేంద్రం పెంచింది. తీవ్ర వ్యతిరేకతల నడుమ గతేడాది అక్టోబర్‌లో ఒక్కసారి లీటర్‌పై రూ.2 చొప్పున తగ్గించింది.

ఎన్నికలొస్తేనే తగ్గుతాయా?


రోజుకో రకంగా ఆగకుండా పెరుగుతున్న పెట్రో ధరలు ఎన్నికలొస్తేనే శాంతిస్తాయా?.. ఈ ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నది. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికలప్పుడు రోజులు, నెలల తరబడి ధరల జోలికి వెళ్లలేదు చమురు మార్కెటింగ్ సంస్థలు. ఆ మధ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ధరలు రెండు వారాలకుపైగా మారలేదు. ఏప్రిల్ 24 నుంచి మే 13 వరకు 20 రోజులపాటు యథాతథంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.74.63 గానే ఉన్నది. ఎన్నికలు ముగిశాయో? లేదో వరుసగా పెరిగింది. 17 రోజుల్లో సుమారు 4 రూపాయల మేర ఎగిసింది. గతేడాది జరిగిన పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్ ఎన్నికల సమయంలోనూ ఇలాగే జరిగింది. జనవరి 16 నుంచి మార్చి 31 దాకా ఇంధన ధరలు పెరుగనే లేదు. నాడు పెట్రోల్ ధర రూ.71.14గా ఉన్నది. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ర్టాలతోపాటు తెలంగాణకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. అప్పు డు ధరలు తప్పక స్థిరంగా ఉంటాయన్న విశ్వాసం సర్వత్రా వ్యక్తమవుతున్నది. దీంతో చమురు ధరల నిర్ణయాధికారం మా చేతుల్లో లేదంటున్న కేంద్ర ప్రభుత్వం మాటలు అబద్ధాలని ఈ పరిణామం చెప్పకనే చెబుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల కష్టాల కన్నా, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్య మా? అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కాగా, పెట్రో ధరల మోతను నిరసిస్తూ సోమవారం ప్రతిపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

4546
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles