పేటీఎం దూకుడు

Tue,February 12, 2019 01:59 AM

-యూపీఐ లావాదేవీల్లో ముందంజ
-గూగుల్‌పే, ఫోన్‌పేలకూ డిమాండ్
-భీమ్‌కు తగ్గుతున్న ఆదరణ

బెంగళూరు, ఫిబ్రవరి 11: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల్లో పేటీఎం దూసుకుపోతున్నది. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేటీఎంకు భలే డిమాండ్ రాగా, ఆన్‌లైన్ క్రయవిక్రయాల్లో చిరు వ్యాపారులకూ అత్యంత చేరువైంది. ఈ క్రమంలోనే గత నెలలో యూపీఐ లావాదేవీల్లో పేటీఎం హవా కొనసాగింది. పేటీఎం తర్వాత అత్యధికులు గూగుల్ పే, ఫోన్‌పేలను వాడుతున్నట్లు తేలింది. జనవరిలో పేటీఎం ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 22.1 కోట్లకుపైగా ఉందని తెలుస్తుండగా, గూగుల్ పే, ఫోన్‌పే అప్లికేషన్ల (యాప్‌లు) ద్వారా సుమారు 22 కోట్ల చొప్పున లావాదేవీలు జరిగాయని సమాచారం. కాగా, జనవరిలో అన్ని మార్గాల్లో రూ.30,000 కోట్ల విలువైన 22.5 కోట్ల లావాదేవీలు జరిగాయని ఎకనామిక్ టైమ్స్‌కు ఫోన్‌పే తెలియజేసింది. అయితే గూగుల్ పే, పేటీఎంలు మాత్రం ఈ లావాదేవీల గణాంకాలను తెలియజేయలేదు. మరోవైపు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపిన తాజా వివరాల ప్రకారం మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్య ఈ జనవరిలో దాదాపు 67.2 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్‌లో 62 కోట్లుగా ఉన్నట్లు ఎన్‌పీసీఐ చెబుతున్నది. యూపీఐ లావాదేవీల సగటు విలువ దాదాపు రూ.1,600లుగా ఉంటే, పేటీఎం లావాదేవీల సగటు రూ.1,907, ఫోన్‌పే రూ.1,300, గూగుల్ పే సుమారు రూ.1,200లుగా ఉన్నది.

పీటూపీ లావాదేవీల్లోనూ..


పీర్-టూ-పీర్ (పీటూపీ) లావాదేవీల్లోనూ ప్రైవేట్ రంగ యాప్‌ల పెత్తనం కొనసాగుతున్నది. బ్యాంకింగేతర సంస్థల అప్లికేషన్ల ద్వారానే పీటూపీ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయని ఓ సీనియర్ బ్యాంకర్ చెప్పారు. అయితే యూపీఐ లావాదేవీలతో పోల్చితే పీటూపీ లావాదేవీలు తక్కువన్నారు. సులభమైన మార్గాల్లో ప్రైవేట్ అప్లికేషన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయని, తమ విస్తరణార్థం బోనస్ పాయింట్లు, క్యాష్ పాయింట్ల ప్రోత్సాహకాలను కల్పిస్తున్నాయని చెప్పారు. దీంతో సదరు అప్లికేషన్ల ద్వారానే లావాదేవీలకు అంతా ఇష్టపడుతున్నారని వివరించారు.

తగ్గుతున్న భీమ్ వాడకం


దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో దీనికి కాస్త ఆదరణ కనిపించినా.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వంటి ప్రైవేట్ రంగ బ్యాంకింగేతర యాప్‌ల జోరుకు ఇప్పుడు తట్టుకోలేక పోతున్నది. జనవరిలో భీమ్ యాప్‌పై జరిగిన లావాదేవీల సంఖ్య 1.4 కోట్లుగా ఉందని ఎన్‌పీసీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు నెల డిసెంబర్‌లో 1.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. అయితే విలువ ఆధారంగా సగటు లావాదేవీ ఎక్కువగా ఉన్నది మాత్రం భీమ్ యాప్‌పైనేనని, ఈ విషయంలో భీమ్ ముందుందని, ప్రైవేట్ రంగ సంస్థలిస్తున్న ప్రోత్సాహకాలను కాదంటూ వినియోగదారులు భీమ్‌కు మొగ్గు చూపుతున్నారని ఎన్‌పీసీఐ వివరాల ద్వారా తెలుస్తున్నది. జనవరిలో భీమ్ యాప్‌పై జరిగిన లావాదేవీల సగటు విలువ రూ.4,436గా ఉన్నది.

2193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles