హైదరాబాద్‌లో ప్రత్యేక కార్పొరేట్ శాఖ

Sun,June 9, 2019 12:09 AM

Padmaja Chunduru assumes charge as MD and CEO of Indian Bank

-ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో పద్మజ
హైదరాబాద్, జూన్ 8: హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ కార్పొరేట్ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి పద్మజ చుండూరు తెలిపారు. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ హైదరాబాద్ జోన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ క్లయింట్ సమావేశం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పద్మజ పాల్గొన్నట్లు శనివారం ఓ ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ తెలియజేసింది. పారిశ్రామిక వర్గాలకు మరింతగా మద్దతిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసిన ఆమె త్వరలోనే ఓ ఎక్స్‌క్లూజివ్ కార్పొరేట్ శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.

బ్యాంక్ వృద్ధికి సహకరిస్తున్న కార్పొరేట్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మౌలిక రంగ ప్రాజెక్టులకు దన్నుగా నిలుస్తూ తెలంగాణ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములం కావడం గర్వంగా ఉందన్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో బ్యాంక్ ప్రదర్శన బాగుందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే 16 శాతం వృద్ధితో రూ.4.30 లక్షల కోట్ల అంతర్జాతీయ వ్యాపారం చేశామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 7.37 శాతం నుంచి 7.11 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) 3.81 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గాయన్నది. 2018-19లో బ్యాంక్ నికర లాభం రూ.321 కోట్లుగా ఉన్నది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ మేనేజర్ ఆర్ మనోహర్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ సీ భారతీ, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles