బీమా.. రూ.లక్ష వరకే

Wed,December 4, 2019 12:53 AM

-పెంపుపై మాకు సమాచారం లేదు
-బ్యాంక్ డిపాజిట్లపై స్పష్టం చేసిన డీఐసీజీసీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: బ్యాంక్ డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని పెంచడంపై మాకు ఎలాంటి సమాచారం లేదని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) స్పష్టం చేసింది. ప్రస్తుతం డిపాజిట్లపై అందుబాటులో ఉన్న బీమా రూ.లక్ష వరకేనని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా పీటీఐ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానమిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుబంధ సంస్థే డీఐసీజీసీ. అన్ని వాణిజ్య, విదేశీ, స్థానిక, ప్రాంతీయ బ్యాంక్ డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా సదుపాయాన్ని కల్పిస్తుంది. బ్యాంకులు ఏ కారణంగానైనా డిపాజిటర్ల సొమ్మును చెల్లించలేనిపక్షంలో ఖాతాదారులకు ఈ బీమాను అందిస్తుంది. ఈ బీమా కోసం ఖాతాదారులు ఎలాంటి సొమ్మునూ చెల్లించనక్కర్లేదు. అయితే ఖాతాల్లో ఎంత మొత్తమైనా ఉన్నప్పటికీ దానికి రూ.లక్షకు మించి బీమాను డీఐసీజీసీ అందివ్వడం లేదు. కానీ పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) కుంభకోణం నేపథ్యంలో ఈ బీమాను పెంచాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం సైతం ఇందుకు సానుకూలంగానే ఉండగా, గత నెల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు సంకేతాలను ఇచ్చారు. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంక్ డిపాజిట్లపై ఉన్న రూ.లక్ష బీమాను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. పీఎంసీ వ్యవహారం నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘాలు కూడా వ్యక్తిగత డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీమాను పెంచే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఆర్టీఐ ద్వారా వచ్చిన ప్రశ్నకు డీఐసీజీసీ అలాంటివేమీ లేవని తేల్చి చెప్పింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రూ. 95,700 కోట్లకుపైగా మోసాలను ప్రకటించాయి. ఆర్బీఐ లెక్కలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో బీమాను పెంచాలన్న డిమాం డ్లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

రెండు నెలల్లో రూ.4.9 లక్షల కోట్లు

పండుగ సీజన్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు భారీగా రుణాలను మంజూరు చేశాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఏకంగా రూ.4.91 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వినిమయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి భారీ స్థాయిలో రుణాలు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచనమేరకు బ్యాంకులు విరివిగా రుణాలను ఇచ్చాయి. మంత్రి సూచనల మేరకు దేశవ్యాప్తంగా 374 జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహించాయి కూడా. ముఖ్యంగా నిధులు లేక సతమతమవుతున్న ఎంఎస్‌ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్లు, రిటైల్, వ్యవసాయ రంగాలకు అధిక స్థాయిలో కేటాయించడం విశేషం. అక్టోబర్‌లో రూ.2.52 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసిన ప్రభుత్వ బ్యాంకులు..ఆ మరుసటి నెలలో రూ.2.39 లక్షల కోట్లు ఇచ్చాయి. వీటిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.72,985 కోట్ల రుణాలు ఇచ్చిన బ్యాంకులు..కార్పొరేట్ సంస్థలకు రూ.2.2 లక్షల కోట్లు ఇచ్చాయి. అలాగే నాన్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రూ.45,153 కోట్లు అందించాయి. వీటితోపాటు బ్యాంకులు రూ.27,225 కోట్ల గృహ రుణాలు, రూ. 11,088 కోట్ల వాహన రుణాలు, రూ.1,111 కోట్ల విద్యా రుణాలు మంజూరు చేశాయి. గత రెండు నెలల్లో రైతులకు రూ.78,374 కోట్ల నిధులను రుణాల రూపంలో అందచేశాయి బ్యాంకులు.

రూ.50 వేల కోట్లు కావాలి

2020-21 నాటికి భారతీయ బ్యాంకులకు అదనంగా రూ.50 వేల కోట్లు (7 బిలియన్ డాలర్లు) అవసరమని ఫిచ్ రేటింగ్స్ మంగళవారం అంచనా వేసింది. రుణాల వృద్ధికి, మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)ల సమస్య సర్దుబాటుకు ఈ నిధులు కావాల్సిందేనని అభిప్రాయపడింది. ఆర్థిక మందగమనంతో రుణాల వసూళ్లు నెమ్మదించాయని, దీనివల్ల ఎన్‌పీఏలు పెరుగుతున్నాయన్నది. ఈ క్రమంలోనే ఆసియా-పసిఫిక్ ఎమర్జింగ్ మార్కెట్ బ్యాంక్స్-2020 ఔట్‌లుక్‌లో దేశీయ బ్యాంకులకు నెగటివ్ రేటింగ్‌ను ఇచ్చింది.

373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles