రూ.30వేల కోట్ల అమ్మకాలు

Thu,October 12, 2017 12:30 AM

Online sales may surpass Rs 30,000 crore in festive month ASSOCHAM

ఈసారి దీపావళి ఆన్‌లైన్ షాపింగ్‌పై అసోచామ్ అంచనా
మొబైల్, ఎలక్ట్రానిక్, గృహోపకరణాలదే హవా

online-shoping
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఈ-కామర్స్ మార్కెట్‌లో దీపావళి కాంతులు విరజిమ్మనున్నాయి. ఇప్పటికే మొదలైన ఈ పండుగ సీజన్ అమ్మకాల్లో ఈసారి ఆన్‌లైన్ షాపింగ్ వాటా రూ. 30,000 కోట్ల పైమాటేనని అంచనా. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, దుస్తులు, గృహోపకరణాల అమ్మకాలు ఈసారి ఆన్‌లైన్ వేదికగా అధికంగా ఉండొచ్చని పారిశ్రామిక, వ్యాపార సంఘం అసోచామ్ చెబుతోంది. నానాటికీ పెరుగుతున్న హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగం.. ఆన్‌లైన్ షాపింగ్ కస్టమర్లను పెంచుకుంటూ పోతున్నది. కేవలం మహా నగరాల్లోనేగాకుండా ద్వితీయ, తృతీయ స్థాయి పట్టణాలకూ ఆన్‌లైన్ షాపింగ్ విస్తరించింది. గ్రామాల్లోనూ స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమవడం ఈ-కామర్స్ పరిశ్రమకు కలిసొస్తున్నది అని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా 10 నగరాల్లో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ ఎంత? ఉంటుందనే అంచనాకు అసోచామ్ వచ్చింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, ఛండీగఢ్, పుణె, డెహ్రాడూన్ తదితర నగరాల్లో ఈ సర్వేను నిర్వహించింది. తయారీ, నిర్మాణ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, రిటైల్, హాస్పిటాలిటీ తదితర రంగాలకు చెందిన 350 నిపుణులు, అధికారులు, ఉద్యోగుల అభిప్రాయాలను ఈ సందర్భంగా సేకరించింది.
online

ఇక ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నవారిలో 65 శాతం పురుషులు, 35 శాతం మహిళలు ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తేలింది. వీరిలో 18-25 ఏండ్లవారు 35 శాతం ఉండగా, 26 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్కులు 55 శాతం, 36-45 ఏండ్లవారు 8 శాతం, 45-60 ఏండ్లున్నవారు 2 శాతం ఉన్నారని అసోచామ్ పేర్కొంది. మరోవైపు ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ అమ్మకాలు ఎక్కువగా ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి నమోదు కావచ్చంది. గురుగ్రామ్, నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్, జైపూర్, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ ఆన్‌లైన్ అమ్మకాలు జోరుగా సాగే అవకాశాలున్నట్లు తెలిపింది. నిరుడుతో పోల్చితే ఈసారి 60-65 శాతం ఎక్కువగా కొనుగోళ్లకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఇదిలావుంటే ఆన్‌లైన్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల విషయానికొస్తే.. మొబైల్ ఫోన్స్ విక్రయాలు అత్యధికంగా 78 శాతం ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ (72 శాతం), కన్స్యూమర్ డ్యూరబుల్స్ (69 శాతం), గిఫ్ట్ ఆర్టికల్స్ (58 శాతం), యాక్సెసరీస్ (56 శాతం), దుస్తులు (49 శాతం), గృహోపకరణాలు (45 శాతం) అధికంగా అమ్ముడుపోతున్నాయని అసోచామ్ సర్వే స్పష్టం చేసింది. క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో సంప్రదాయ మార్కెట్‌లో షాపింగ్ అంటే వృథా సమయమేనన్న భావన నేటి తరంలో కనిపిస్తున్నది. అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌తో అరచేతిలోకి మార్కెట్‌నంతా తెచ్చుకుంటున్న నెటిజన్లు.. కావల్సినవాటిని ఇట్టే పొందుతున్నారు.

282

More News

VIRAL NEWS

Featured Articles