జీఎమ్మార్‌కు ఊరట

Mon,May 27, 2019 12:20 AM

No taxes payable by GMR on Male airport contract compensation says Maldives

- కాంట్రాక్టు నష్టపరిహారంపై పన్నులు చెల్లించనక్కర్లేదన్న మాల్దీవుల ప్రభుత్వం

హైదరాబాద్, మే 26: దేశీయ మౌలిక రంగ దిగ్గజాల్లో ఒకటైన జీఎమ్మార్ గ్రూపునకు గొప్ప ఊరట లభించింది. మాలే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్ నష్టపరిహారంపై తాము డిమాండ్ చేసిన పన్నులను అక్కడి ప్రభుత్వం వదులుకున్నది. ఈ పన్నులు, జరిమానాల కోసం జీఎమ్మార్‌పై ఒత్తిడి తీసుకురావద్దని మాల్దీవుల సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆ పన్నులు చెల్లించాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మాల్దీవుల అటార్నీ జనరల్స్ కార్యాలయం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. మాలేలోని ఇబ్రహిం నాసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విస్తరణ, ఆధునికీకరణ, నిర్వహణ, కార్యకలాపాల నిమిత్తం 2010 జూన్ 28న మాల్దీవుల ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్ (ఎంఏసీఎల్)తో, అక్కడి ఆర్థిక, కోశాగార మంత్రిత్వ శాఖలతో జీఎమ్మార్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నది. 25 ఏండ్లకుగాను ఈ ఒప్పందం కుదరగా, 2012 నవంబర్‌లో దీన్ని ఎంఏసీఎల్ అనూహ్యంగా రద్దు చేసింది.

దీంతో జీఎమ్మార్ గ్రూప్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. సింగపూర్‌లోని ఈ ట్రిబ్యునల్ జీఎమ్మార్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. 270 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఎంఏసీఎల్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2017-18కిగాను ట్యాక్స్ ఆడిట్ రిపోర్టులను జారీ చేసిన మాల్దీవుల ఇన్‌లాండ్ రెవిన్యూ అథారిటీ.. సదరు నష్టపరిహారంపై ఆదాయం పన్ను విధించిం ది. అంతేగాక చెల్లింపుల జాప్యంపై జరిమానాలనూ వేస్తూ వచ్చింది. ఈ మొత్తం 20.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.137 కోట్లు) చేరింది. మరోవైపు తాజా నిర్ణయాన్ని జీఎమ్మార్ అధికార ప్రతినిధి స్వాగతించారు. ఆదివారం పీటీఐకి పంపిన ఓ ఈ-మెయిల్‌లో నష్టపరిహారంపై ఎలాంటి పన్నులు చెల్లించనక్కర్లేదన్న జీఎమ్మార్ వాదనతోనే చివరకు మాల్దీవుల ప్రభుత్వం ఏకీభవించడం హర్షణీయం అన్నారు.

1031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles