దేశంలో సరిపడా చక్కెర నిల్వలు

Sun,August 13, 2017 12:03 AM

No plans for duty-free sugar imports Ram Vilas Paswan

సుంకం రహిత దిగుమతి ఆలోచన లేదు: పాశ్వాన్

paswan
న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలో సరిపడ నిల్వలు ఉండటంతో సుంకం రహిత చక్కెర దిగుమతి ఆలోచనేది కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టంచేశారు. సరఫరా మెరుగ్గావుండటంతోపాటు నిలకడంగా ధరలు ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 2017 సీజన్‌కుగాను చక్కెర ఉత్పత్తిని తొందరగా ప్రారంభించాలని మిల్లర్లపై కేంద్రం ఒత్తిడి తీసుకురానున్నది. ప్రస్తుతం నిలకడగా ఉన్న ధరలు వచ్చే పండుగ సీజన్‌లో ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న చక్కెరకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో గత నెలలో దిగుమతి సుంకాన్ని 50 శాతం మేర పెంచింది. దేశీయ అవసరాలకు సరిపడ చక్కెర నిల్వలు ఉన్నాయని, ఇప్పటికే 5 లక్షల టన్నుల చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకున్నామని, మరోసారి ఈ ఆలోచన లేదని మంత్రి వెల్లడించారు.

2016-17 సీజన్(అక్టోబర్-సెప్టెంబర్ మధ్యకాలంలో) దేశవ్యాప్తంగా 2.79 కోట్ల టన్నుల చక్కెర సరఫరా అయిందన్నారు. నూతన చక్కెర వచ్చే వరకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రస్తుత సంవత్సరంలో దేశీయంగా డిమాండ్‌కు అనుగుణంగా 4.2 మిలియన్ టన్నుల అందుబాటులో ఉండనున్నదని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో నెలకు సరాసరిగా 2-2.5 మిలియన్ టన్నుల చక్కెరను వాడుతున్నారు. అంతక్రితం ఏడాది ఉత్పత్తైన 2.51 కోట్ల టన్నులతో పోలిస్తే గడిచిన సంవత్సరంలో 2.04 కోట్ల టన్నులకు తగ్గనున్నదని ప్రాథమిక అంచనా.

గోధుమల దిగుమతిపై సుంకం పెంచే అవకాశం లేదు..

ఇప్పట్లో గోధుమల దిగుమతిపై సుంకం పెంచే ఆలోచనేది ప్రభుత్వం వద్ద లేదని పాశ్వాన్ స్పష్టంచేశారు. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న గోధుమలపై 10 శాతం సుంకాన్ని విధిస్తున్నారు. 2016-17 పంట సంవత్సరం(జూలై-జూన్) మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 9.74 కోట్ల టన్నుల గోధుమలు ఉత్పత్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న గోధుమలకు అడ్డుకట్ట వేయడానికి మార్చి 28న 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది.

అంతకుముందు నాలుగు నెలలపాటు సుంకం లేకుండా 55 లక్షల టన్నుల గోధుమలు దిగుమతి చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వద్ద 3.08 కోట్ల టన్నుల స్టాక్ నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సరాసరి కిలో ధర రూ.18-20 మధ్యలో కొనసాగుతున్నది.

170

More News

VIRAL NEWS

Featured Articles