చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట

Fri,January 11, 2019 12:40 PM

-జీఎస్టీ మినహాయింపు పరిమితి రెట్టింపు
-వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల నుంచి 40 లక్షలకు పెంపు
-32వ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 10: చిన్న వ్యాపారులకు గొప్ప ఊరట లభించింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు పరిమితిని కేంద్రం రెట్టింపు చేసింది. ప్రస్తుతం రూ.20 లక్షల వార్షిక టర్నోవర్ వరకు జీఎస్టీ నమోదు నుంచి మినహాయింపున్నది. దీన్ని రూ.40 లక్షలకు పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో గురువారం ఇక్కడ జరిగిన జీఎస్టీ మండలి 32వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటితేగానీ జీఎస్టీ చెల్లింపులు ఉండవన్నమాట. కాగా, కొండ ప్రాంత, ఈశాన్య రాష్ర్టాలకు ఈ పరిమితి ఇప్పుడు రూ.10 లక్షలుగా ఉంటే.. దాన్ని రూ.20 లక్షలకు పెంచారు. ఇక్కడ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లింపులు జరుపాల్సిందే. ఇకపోతే జీఎస్టీ కంపోజిషన్ స్కీం కింద టర్నోవర్ ఆధారంగా చిన్న వర్తకులు, వ్యాపారులు చెల్లిస్తున్న 1 శాతం పన్ను రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్ దాటినవారికే వర్తిస్తుందని సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ జైట్లీ తెలిపారు.

ప్రస్తుతం ఈ పన్ను వార్షిక టర్నోవర్ కోటి రూపాయలు దాటితే పడుతున్నది. ఏప్రిల్ 1 నుంచి మార్పు వర్తిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. రూ.50 లక్షలదాకా వార్షిక టర్నోవర్ ఉన్న సేవలు లేదా, వస్తు, సేవల కల్పనదారులు, సరఫరాదారులూ కంపోజిషన్ స్కీంను ఉపయోగించుకోవడానికి అర్హులని చెప్పారు. కంపోజిషన్ స్కీం కింద సేవల కోసం పన్ను రేటు 6 శాతంగా ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయాలు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు ఊతమివ్వగలవని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మండలి తాజా నిర్ణయాలు సరళతర జీఎస్టీ, ప్రజాహిత జీఎస్టీకి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు ఊతం: పరిశ్రమ

జీఎస్టీ మండలి తీసుకున్న తాజా నిర్ణయాలు చిన్న వ్యాపారులకు గొప్ప ప్రయోజనాల్ని చేకూర్చేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సీఐఐ, అసోచామ్, కేపీఎంజీ ఇండియాతోపాటు డెలాయిట్ ఇండియా, ఈవై ఇండియా వంటి ఏజెన్సీలూ హర్షం వెలిబుచ్చాయి. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు ఈ నిర్ణయాలు గొప్ప ఊరటను ఇవ్వగలవని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. పన్ను భారం తగ్గడం వల్ల వ్యాపారాభివృద్ధికి ఆస్కారముంటుందన్నారు. ఈ నిర్ణయాల వల్ల లక్షలాది చిన్న, మధ్యతరహా సంస్థలకు లబ్ధి చేకూరగలదని అసోచామ్ పేర్కొన్నది. కంపోజిషన్ స్కీంపై నిర్ణయాలనూ స్వాగతిస్తున్నట్లు తెలియజేశాయి.

రూ.8,200 కోట్ల ఆదాయం దూరం

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మండలి తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాకు భారీగా ఆదాయం దూరం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చిన్న వ్యాపారులకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు జీఎస్టీ మినహాయింపునిస్తున్న నేపథ్యంలో రూ.5,200 కోట్ల రాబడి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే కంపోజిషన్ స్కీం కింద తీసుకున్న నిర్ణయాలతో దాదాపు మరో రూ.3,000 కోట్ల ఆదాయం ప్రభావితం కావచ్చని అంటున్నారు. ఇప్పటికే జీఎస్టీ నెలసరి వసూళ్లు పడిపోతున్న వేళ.. గత నెల జరిగిన మండలి చివరి సమావేశంలోనూ తీసుకున్న నిర్ణయాలు సర్కారీ ఆదాయాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. జీఎస్టీ గరిష్ఠ శ్లాబైన 28 శాతం నుంచి చాలా వస్తు, సేవలను దిగువ శ్లాబుల్లోకి మార్చగా, 18, 12 శాతాల నుంచీ కొన్నింటిని తొలగించారు. మరికొన్నింటిపై పన్నును తొలగించగా, మొత్తం నాటి నిర్ణయాలతో రూ.5,500 కోట్ల ఆదాయం ఖజానాకు దూరమైంది.

త్రైమాసిక చెల్లింపులు, వార్షిక రిటర్నులు

2017, జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ కింద ప్రస్తుతం 1.17 కోట్లకుపైగా వ్యాపారులు నమోదై ఉన్నారు. ఇందులో 18 లక్షలకుపైగా వ్యాపారులు కంపోజిషన్ స్కీంను ఎంచుకున్నారు. రెగ్యులర్ ట్యాక్స్‌పేయర్లు నెలవారీగా పన్నులు చెల్లించాల్సి ఉండగా, కంపోజిషన్ స్కీంలో ఉన్నవారు మూడు నెలలకోసారి చెల్లించాల్సి ఉంటుంది. అయితే రిటర్నులను ఏడాదికోసారి దాఖలు చేయాల్సి ఉంటుంది. కంపోజిషన్ స్కీం కింద వర్తకులు, తయారీదారులు రాయితీలో 1 శాతం పన్నును చెల్లిస్తే.. రెస్టారెంట్లు మాత్రం 5 శాతం జీఎస్టీని చెల్లించాలి.

కేరళకు ప్రోత్సాహం

ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన కేరళకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం దక్కింది. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత తుపాను బీభత్సానికి గతేడాది కేరళ అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రాష్ర్టానికి జీఎస్టీ మండలి ప్రత్యేక అనుమతినిచ్చింది. రెండేండ్ల వరకు రాష్ట్రంలో వస్తు, సేవల అమ్మకాలపై 1 శాతం విపత్తు సెస్సు విధించుకోవచ్చని చెప్పింది. దీనివల్ల వచ్చే నిధులతో భీకర వరదల ధాటికి భారీగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టాలని సూచించింది.

రాష్ర్టాలతో సంప్రదించకుండానే..

రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే జీఎస్టీ మండలి సమావేశాల్లో ఎజెండా ఖరారవుతున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం సరికాదంటూ ఆందోళన వెలిబుచ్చారు. కాగా, తాము రూ.50 లక్షల వరకు టర్నోవర్ ఉన్న సంస్థలకు జీఎస్టీ మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఐజీఎస్టీ కింద ఇవ్వాల్సిన రూ.7,000 కోట్ల చెల్లింపుల సమస్యను పరిష్కరించాలని కూడా సూచించామన్నారు. మరోవైపు జీఎస్టీ అమలు నేపథ్యంలో రెవిన్యూ పడిపోతున్నదని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆందోళన వెలిబుచ్చారు.

జీఎస్టీని మరింత తగ్గించాలి

జీఎస్టీని మరింత తగ్గించాలని బీజేపీయేతర, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం సైతం జీఎస్టీని సరళతరం చేసే దిశగానే అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలనూ ఇవ్వగా, గత జీఎస్టీ మండలి సమావేశంలో అందుకు అనుగుణంగా నిర్ణయాలూ వచ్చిన సంగతి విదితమే. జీఎస్టీ వసూళ్లు తగ్గి ద్రవ్యలోటు లక్ష్యాలు దెబ్బతింటున్నప్పటికీ మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కేంద్రం పన్ను భారాన్ని పెద్ద ఎత్తున తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిర్మాణ రంగానికి నిరాశే

హైదరాబాద్: నిర్మాణ రంగంపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గిస్తారనే ఊహాగానాల మధ్య సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ నిరాశనే మిగిల్చింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సానుకూల నిర్ణయం ఉంటుందన్న ఆశలు ఆవిరయ్యాయి. రియల్ ఎస్టేట్ సమస్యలపై తాజా సమావేశంలో భిన్నమైన అభిప్రాయాలు నెలకొనడంతో కూలంకషంగా చర్చించడానికి ఏడుగురు సభ్యుల మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చే ప్రతిపాదనలపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జైట్లీ తెలిపారు. దీంతో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందేలా ప్రతిపాదనలు ఉంటాయన్న ఆశాభావాన్ని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు జక్సేషా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటు గృహాలపై 8 శాతం జీఎస్టీని వసూలు చేస్తుండగా, ఇతర గృహాలపై 12 శాతం వడ్డిస్తున్నారు.

3858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles