పన్నుల భారం తగ్గాలి

Mon,June 10, 2019 02:44 AM

No corporate tax relief for large companies in the Union budget

-సామాన్యుడికి ఊరటనివ్వాలి.. రాబోయే బడ్జెట్‌పై నిపుణుల మాట
న్యూఢిల్లీ, జూన్ 9: బడ్జెట్‌లో కేంద్రం సామాన్యులకు పన్నుల భారం తగ్గించే నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వచ్చే నెల 5న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని కనీసం రూ.3 లక్షలకు పెంచాలని, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను రద్దు చేయాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. మ్యాట్ రద్దుతో వినియోగం పెరిగి సంస్థలకు లాభం చేకూరగలదని చెబుతున్నారు.

వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నది. దీనివల్ల చాలామంది వేతన జీవులకు గొప్ప ఊరట లభించగలదని అసోచామ్ చెబుతున్నది. అలాగే ప్రామాణిక కోత రూ.లక్షకు మించి ఉండకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సోమవారం నుంచి నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నం కానుండగా, ఉద్యోగులు, ఇతరత్రా సిబ్బంది.. బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 26 వరకు 17వ లోక్‌సభ తొలి సెషన్ జరుగనున్నది. ఇక వచ్చే నెల 4న ఆర్థిక సర్వే విడుదల కానున్నది.

11-23 మధ్య సంప్రదింపులు

ఈ నెల 11 నుంచి 23 వరకు సీతారామన్ ముందస్తు బడ్జెట్ సంప్రదింపులను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆర్థికవేత్తలు, పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సీఐఐ, ఫిక్కీలు బడ్జెట్ కోసం తమ విలువైన సలహాలు, సూచనలు ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందించారు. ఇదిలావుంటే ఈ నెల 20న జరిగే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం సందర్భంగా ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులూ బడ్జెట్ కోసం తగు సూచనలు చేసే వీలున్నది. సీతారామన్ బడ్జెట్ బృందంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్, ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌లున్నారు. ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ నేతృత్వంలోని ఈ అధికారిక బృందంలో వ్యయ కార్యదర్శి గిరీష్ చంద్ర ముర్ము, రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, దీపం కార్యదర్శి అటాను చక్రబర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు కూడా ఉన్నారు.

వ్యవసాయ సంఘాలతోనూ..

వ్యవసాయ సంఘాలతోనూ ముందస్తు బడ్జెట్ సంప్రదింపులను సీతారామన్ జరుపనున్నారు. వ్యవసాయ నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోనున్నారు. మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో కరువు పరిస్థితులు, రుతుపవనాల ఆలస్యం అంచనాల మధ్య మంగళవారం సీతారామన్ సమావేశం కానున్నారు. కాగా, దేశ తొలి పూర్తికాల మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా గత నెల సీతారామన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమె జరిపే తొలి ఆధికారిక సమావేశం ఇదే కానున్నది. వ్యవసాయ రంగం వృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాలతో ఈ బడ్జెట్‌లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చన్న దానిపై మంత్రి ఆరా తీసే అవకాశాలున్నాయి. చేపల పరిశ్రమ, పౌల్ట్రీ, పశు సంవర్ధక తదితర వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతంపైనా సీతారామన్ దృష్టి పెట్టారు.

బ్యాంకింగ్ సంస్కరణలు

బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం పక్కా ప్రణాళికనూ ఈ బడ్జెట్‌లో సీతారామన్ ఆవిష్కరించవచ్చునని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను రూ.5 లక్షల కోట్లకు చేర్చాలన్న మోదీ సర్కారు ఆశయ సాధనకు బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అవసరమని గుర్తుచేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి తెరతీసిన కేంద్రం.. మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)ల సమస్య నివారణకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. కాగా, దేశ జీడీపీ ఐదేండ్ల కనిష్ఠాన్ని తాకిన వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొన్నది. ఆమె ఈ బడ్జెట్‌ను జనాకర్షకంగా తీర్చిదిద్దుతారా? లేదంటే సంస్కరణలు, ఆర్థిక లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

2097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles