నాలుగేండ్లలో ఖనిజ ఉత్పత్తి రెట్టింపు

Thu,December 7, 2017 12:23 AM

NMDC to expand presence in gold diamond tungsten mines

nmdc
6.7 కోట్ల టన్నులకు చేరుకోనున్న ఎన్‌ఎండీసీ ప్రొడక్షన్
హైదరాబాద్, డిసెంబర్ 6: జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ఉత్పతి వేగాన్ని పెంచింది. 2022 నాటికి 6.7 కోట్ల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలనుకుంటున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బైజేంద్ర కుమార్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదైన 3.4 కోట్ల టన్నులతో పోలిస్తే రెండింతలు పెరుగనున్నదన్న మాట. ఇందుకోసం పలు రాష్ర్టాల్లో ఉన్న గనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఇప్పటికే సంస్థ ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో గనులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంస్థను ప్రారంభించి 60 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3,196 కోట్ల మేర పెట్టుబడి పెట్టిన సంస్థ.. ఈ ఏడాది రూ.3,500 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.6 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.

పసిడి, డైమండ్, టంగ్‌స్టన్ గనులపై ప్రత్యేక దృష్టి

నవరత్న హోదా కలిగిన ఎన్‌ఎండీసీ..భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉన్న బంగారం, డైమండ్, టంగ్‌స్టన్ గనులపై ప్రత్యేక దృష్టి సారించింది. మధ్యప్రదేశ్‌లో ఉన్న పన్నా బంగారు గనులను మరింత విస్తరించాలనుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన..ఆస్ట్రేలియాలో ఉన్న లెగసీ మైనింగ్‌లో అత్యధిక వాటాను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వియత్నాంలో ఉన్న టంగ్‌స్టన్ గనుల్లో వాటాను కొనుగోలు చేయడానికి అక్కడి మసానా రిసోర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మసాన్ 6 వేల టన్నుల అమోనియంను ఉత్పత్తి చేస్తున్నది.

8న ప్రత్యేక ఉత్సవాలు

సంస్థను ప్రారంభించి 60 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఈ నెల 8న హైదరాబాద్‌లో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్న ఈ ఉత్సవాలకు కేంద్ర మంత్రులు చౌదరీ బిరేందర్ సింగ్, విష్ణు డియో, వైఎస్ చౌదరీలతోపాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమన్ సింగ్‌లు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరవనున్నారు.

243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles