మౌలికాన్ని మరువద్దు

Wed,June 12, 2019 01:34 AM

Nirmala Sitharaman to hold Pre Budget consultation meeting with industry and trade associations

-పెట్టుబడులకు ఊతమివ్వండి
-బడ్జెట్‌ పై సీతారామన్‌కు పరిశ్రమ వర్గాల సూచన

న్యూఢిల్లీ, జూన్ 11: రాబోయే బడ్జెట్‌లో మౌలిక రంగానికి పెద్దపీట వేయాలని, పెట్టుబడులు పెరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పరిశ్రమ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వచ్చే నెల 5న లోక్‌సభలో సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరిశ్రమ వర్గాలతో మంగళవారం ఇక్కడ మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐఐ, అసోచామ్, ఫిక్కీల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. కార్పొరేట్ పన్నును తగ్గించాలని, కనీస ప్రత్యామ్నాయ పన్నును రద్దు చేయాలని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 10 శాతానికి కుదించాలని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ సూచించారు. దీంతో 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి పన్ను విధానాలను సరళీకృతం చేస్తూనే ఉన్నామని, నిబంధనలను హేతుబద్ధీకరిస్తున్నామని మంత్రి వివరించారు. సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లోనూ చాలా మెరుగయ్యామన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇదిలావుంటే అసోచామ్ అధ్యక్షుడు బీకే గోయెంకా.. అన్ని కొత్త పెట్టుబడులకు తొలి ఏడాది 100 శాతం ప్రోత్సాహకాలను ఇవ్వాలని సూచించారు. అలాగే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను మరింత సరళతరం చేయాలని, 8, 16 శాతం శ్లాబులకే పరిమితం చేయాలని సలహా ఇచ్చారు. ఇక ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమని మౌలిక రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరుపాలన్నారు. రోడ్లు, రహదారులు, సబ్-అర్బన్ మెట్రోలు, విమానాశ్రయాల రంగాల్లో కొన్ని భారీ ప్రాజెక్టులనైనా ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెంచేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.

వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి


వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, రైతుల ఆదాయాన్ని పెంచాలని ఆ రంగ నిపుణులు డిమాండ్ చేశారు. ఈ రంగం పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆర్థిక మంత్రి సీతారామన్‌కు వారు సూచించారు. రైతులకు మార్కెట్ అనుమతులను కల్పించాలని కోరారు. వ్యవసాయ రంగ సమస్యలు, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలనలే ప్రధాన ఎజెండాగా వచ్చే బడ్జెట్‌ను మంత్రి తీర్చిదిద్దుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైతుల కష్టాలు తీరేలా బడ్జెట్ ప్రకటనలుంటాయన్న విశ్వాసాన్ని వ్యవసాయ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహించాలని, పశు సంపద, చేపల పెంపకం, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని భారత్ కర్షక్ సమాజ్ వంటి రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles