-మున్ముందు మరిన్ని తెస్తాం
-కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
-పెట్టుబడులు పెట్టాలని విదేశీ సంస్థలకు పిలుపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆశిస్తున్న కేంద్రం.. మున్ముందు మరిన్ని ఆకర్షణీయమైన సంస్కరణలు ఉంటాయని సంకేతాలిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తమ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలను వివరిస్తూ.. ఇంకా ఈ తరహా ఎన్నో నిర్ణయాలుంటాయని చెప్పారు. మంగళవారం ఇక్కడ ఇండియా-స్వీడన్ బిజినెస్ సదస్సులో మాట్లాడుతూ కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఆయా రంగాలకు ఉద్దీపనల్ని గుర్తుచేశారు. ముఖ్యంగా గడిచిన 28 ఏండ్లలో అతిపెద్ద పన్ను తగ్గింపుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతను అభివర్ణించారు. ఆరేండ్ల కనిష్ఠానికి దిగజారిన దేశ జీడీపీని బలోపేతం చేయడానికి కార్పొరేట్ పన్నును 10 శాతం తగ్గించామని చెప్పుకొచ్చారు. బ్యాంకింగ్, మైనింగ్ లేదా బీమా ఏ రంగమైనా కావచ్చు.. మరిన్ని సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తున్నామన్న ఆమె.. దేశీయంగా ఏర్పాటైన విదేశీ సంస్థల సమస్యలను తీర్చేందుకూ ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు.
ఇన్ఫ్రాలో గొప్ప అవకాశాలు
మౌలిక రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఈ సందర్భంగా స్వీడన్ సంస్థలకు మంత్రి సూచించారు. మౌలిక రంగ అభివృద్ధి ప్రాజెక్టుల్లో రాబోయే ఐదేండ్లలో దాదాపు రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు భారత్ ప్రణాళికల్ని రచిస్తున్నదని వివరించారు. ఇప్పటికే ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామన్న మంత్రి.. ఈ నెల 15కల్లా 10 భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో కూడిన ఓ జాబితాను అది సిద్ధం చేయనుందని ప్రకటించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో సెప్టెంబర్లో ఈ టాస్క్ఫోర్స్ను కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. 2019-20 నుంచి 2024-25 మధ్య రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇన్ఫ్రా ప్లాన్ను సిద్ధం చేయడమే ఈ టాస్క్ఫోర్స్ లక్ష్యం. రూ.100 కోట్లకుపైగా పెట్టుబడి వ్యయం కలిగిన గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులపైనా టాస్క్ఫోర్స్ దృష్టి సారించే అవకాశాలున్నాయి.