9,900 ఎగువకు నిఫ్టీ


Tue,July 18, 2017 12:31 AM

సరికొత్త ఆల్‌టైం గరిష్ఠానికి సూచీలు
nse
ఈ వారం తొలి సెషన్‌లో స్టాక్ సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో నిఫ్టీ తొలిసారిగా 9,900 మైలురాయిని దాటింది. గతవారంలో 32 వేల మార్క్‌ను అధిగమించిన సెన్సెక్స్ తాజాగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలపై సానుకూలతతోపాటు చైనా రెండో త్రైమాసిక వృద్ధిరేటు అంచనాలను మించి 6.9 శాతానికి చేరుకోవడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను నెమ్మదిగానే పెంచవచ్చన్న విశ్లేషణలు దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. ఇందుకుతోడు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం సాధారణ స్థాయి కంటే అధికంగా ఉండటం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మెరుగుపర్చింది. ఎక్సేంజ్‌లలో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 54.03 పాయింట్లు బలపడి 32,074.78 వద్దకు, నిఫ్టీ 29.60 పాయింట్లు లాభపడి 9,915.95 వద్ద స్థిరపడ్డాయి.

సెన్సెక్స్ 30 సూచీలో విప్రో షేర్లు అత్యధికంగా 3.12 శాతం లాభపడగా.. ఇన్ఫోసిస్ 1.37 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ కూడా మెరుగైన లాభాలను చవిచూశాయి. మొదటి త్రైమాసిక లాభంలో 25.53 శాతం వృద్ధిని కనబర్చిన జూబ్లియంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లు ఏకంగా 9.31 శాతం పుంజుకున్నాయి. రంగాలవారీగా చూస్తే.. బీఎస్‌ఈలోని రియల్టీ సూచీ 1.28 శాతం ఎగబాకగా.. మెటల్, ఐటీ, టెక్నాలజీ సూచీలు సైతం లాభాలబాటలో పయనించాయి.

169
Tags

More News

VIRAL NEWS