పుంజుకున్న మార్కెట్ సెంటిమెంట్

Sat,November 17, 2018 12:43 AM

Nifty ends above 10,682.20 Sensex up 196.62 pts

వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రిలయన్స్, బజాజ్‌ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ వంటి బ్లూచిప్ లార్జ్‌క్యాప్ షేర్లలో వచ్చిన ర్యాలీతో పాటు రూపాయి మారకం విలువ బలపడుతుండడంతో మార్కెట్ సెంటిమెంట్ పుంజుకుంది.యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం కూడా కలిసొచ్చింది. సెన్సెక్స్ 196.62 పాయింట్ల లాభంతో 35,45716వద్ద ముగిసింది. నిఫ్టీ 65.50 పాయింట్ల లాభంతో 10,682.20 వద్ద క్లోజ్ అయింది. దీంతో వరుసగా మూడో వారం కూడా లాభాలతోనే ముగిసింది. ఈవారంలో సెన్సెక్స్ 298.61 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడింది. మార్కెట్ ఒడిదుడుకులతో ట్రేడ్ అయినప్పటికీ గత మూడు రోజుల లాభాలతోనే ట్రేడ్ అవుతుండడం, ఎఫ్‌ఐఐలు కొనుగోళ్లు జరుపుతుండడంతో ట్రేడర్లు తాజా పొజీషన్లను తీసుకోవడానికి ఆసక్తి చూపారు. టెలికం షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. ప్రధాన సూచీలు లాభాల్లో ముగుస్తున్నప్పటికీ గత రెండు రోజులుగా మార్కెట్‌లో నష్టపోతున్న షేర్ల సంఖ్యే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.

శుక్రవారం 1039 షేర్లు నష్టాల్లో ముగిస్తే కేవలం 741 షేర్లు లాభాల్లో ముగిసాయి. 9 షేర్లు మాత్రమే కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేస్తే 45 షేర్లు 52 వారాల కనీస స్థాయిని నమోదు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ గరిష్టంగా. 2.03 శాతం మేర లాభపడింది. కాగా ఫార్మా, ఐటీ ఇండెక్స్‌లు దాదాపు ఒక శాతం లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ 0.46 శాతం, మీడియా 0.48 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.35 శాతం లాభాలతో ముగిశాయి. కాగా, మెటల్ ఇండెక్స్ మాత్రం 1.56శాతం నష్టపోయింది. మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 0.35 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీలోని భారతీ ఎయిర్ టెల్ 9.10 శాతం లాభంతో ముగిసింది. ఐషర్ మోటార్స్ 3.55 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.36 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.06 శాతం, రిలయన్స్ 2.57 శాతం లాభాలతో ముగిశాయి. కాగా, యెస్ బ్యాంక్ సీఈవో సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఓపీ భట్ రాజీనామా చేయడంతో బ్యాంక్ షేరు ధర 6.49 శాతం మేర నష్టపోయింది. ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ 4.95 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.64 శాతం, హెచ్‌పీసీఎల్ 2.61 శాతం, టాటాస్టీల్ 2.50 శాతం చొప్పున నష్టపోయాయి.

జెట్‌ఎయిర్‌వేస్ హవా

టాటా గ్రూపు టేకోవర్ వార్తలు జోరందుకున్న నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ షేరు వరుస లాభాలతో దూసుకుపోతున్నది. గత మూడు రోజుల్లో దాదాపు రూ. 90 లాభపడింది. శుక్రవారం ఈషేరు ఎన్‌ఎస్‌ఈలో 6.26 శాతం మేర లాభపడి రూ.341 వద్ద ముగిసింది. ఒక దశంలో రూ. 366.95 గరిష్ట స్థాయిని కూడా తాకింది. అయితే జెట్ ఎయిర్ వేస్‌ను టేకోవర్ చేసే ప్రతిపాదన ఏదీ లేదని మార్కెట్ ముగిసిన తర్వాత టాటా సన్స్ ప్రకటించింది.

524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles