అమ్మో.. ఉద్దీపనల్లేవా!

Fri,August 23, 2019 12:28 AM

Nifty down 177 points

-భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
-సెన్సెక్స్ 587, నిఫ్టీ 177 పాయింట్లు పతనం
-మదుపరులను వెంటాడిన భయాలు

ముంబై, ఆగస్టు 22: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నా.. ఉద్దీపనలకు అవకాశం లేదన్న సంకేతాలు మదుపరులను భయపెట్టాయి. ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఉద్దీపన ప్యాకేజీ ఉండబోదన్న సూచనలు అంతర్గతంగా వస్తుండటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 587.44 పాయింట్లు లేదా 1.59 శాతం క్షీణించి 36,472.93 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 177.35 పాయింట్లు లేదా 1.62 శాతం పతనమై 10,741.35 వద్ద స్థిరపడింది. దీంతో వరుసగా మూడు రోజులు సూచీలు నష్టాలకే పరిమితమైనైట్లెంది. మందగమనం ఆవరించిన రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉద్దీపనలను అందివ్వబోదన్న సమాచారం మదుపరులను తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది. ప్రభుత్వ సొమ్మును ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు అందించడం అంత మంచిది కాదని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ గురువారం అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సైతం ఆర్థిక ఉద్దీపనల కంటే వడ్డీరేట్ల తగ్గింపు, ప్రైవేట్ రంగానికి రుణ లభ్యత పెంపు వంటి చర్యలు ఉత్తమమని అన్నారు. ఇది వెంటనే మార్కెట్లను ప్రభావితం చేసింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్ షేర్లలో పెట్టుబడులను మింగేసింది.

అసలు ఏమన్నారు?

సీఈఏ సుబ్రమణియన్, మాజీ ఆర్థిక కార్యదర్శి, ప్రస్తుత విద్యుత్ కార్యదర్శి అయిన గార్గ్ వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్దీపనలు దండుగ అన్న విధంగా ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్రమణియన్.. 1991 నుంచి మన ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మారిపోయింది. ఈ వ్యవస్థలో కొన్ని రంగాలు వెలుగులో ఉండటం, మరికొన్ని రంగాలు చీకటిలో మగ్గడం సర్వసాధారణం. నిజానికి పన్ను చెల్లింపులతో వచ్చే సొమ్మునే ప్రభుత్వం.. ఉద్దీపన ప్యాకేజీలుగా అందిస్తుంది. మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఇది సరితూగదు. పరిస్థితుల్ని మరింతగా దిగజార్చుతుంది అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న గార్గ్ సైతం ఉద్దీపనల కంటే వడ్డీరేట్ల తగ్గింపు, ఇతరత్రా మార్గాల్లో సాయం చేయడం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఉద్దీపనలకు వ్యతిరేకంగా వచ్చిన వీరి మాటలు మార్కెట్‌ను ముంచేశాయి. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గతేడాదితో పోల్చితే జీడీపీ గణాంకాలు తక్కువగా నమోదు కావచ్చన్న గార్గ్ అంచనా కూడా మార్కెట్ సరళిని ప్రభావితం చేసింది.

యెస్ బ్యాంక్ షేర్ విలవిల

లాభాల స్వీకరణకు మదుపరులు పెద్దపీట వేయడంతో పలు రంగాల షేర్లు భీకర నష్టాలను చవిచూశాయి. ఇందులో యెస్ బ్యాంక్ కూడా ఉన్నది. బ్యాంక్ షేర్ విలువ ఈ ఒక్కరోజే 13.91 శాతం మేర దిగజారింది. వేదాంత, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటర్స్ షేర్లూ 7.76 శాతం మేర పడిపోయాయి. ఓఎన్జీసీ, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల విలువా పతనమైంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక ఉద్దీపనలు ఉండవన్న వార్తలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం కూడా ప్రతికూలంగా మారింది అని బీఎన్పీ పరిబాస్‌కు చెందిన షేర్‌ఖాన్ సలహాదారు అధిపతి హేమంగ్ జానీ తాజా మార్కెట్ తీరును విశ్లేషించారు.

8 నెలల కనిష్ఠానికి రూపాయి

రూపాయి మారకం విలువ నానాటికీ దిగజారిపోతున్నది. డాలర్‌తో పోల్చితే గురువారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో రూపాయి 8 నెలలకుపైగా కనిష్ఠాన్ని తాకింది. 26 పైసలు క్షీణించి 71.81 వద్దకు చేరింది. నిరుడు డిసెంబర్ 14 తర్వాత ఇదే అత్యల్పం. చైనా కరెన్సీ యువాన్ విలువలో ఆకస్మిక పతనం కూడా ప్రపంచ కరెన్సీ మార్కెట్లను ప్రభావితం చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకానొక దశలో రూపాయి మారకం విలువ 71.97 స్థాయికి క్షీణించడం గమనార్హం. బుధవారం కూడా రూపాయి విలువ నష్టపోగా 71.55 వద్ద నిలిచిన విషయం తెలిసిందే. స్టాక్ మార్కెట్ల పతనం, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు రూపాయి విలువను మరింత దిగజార్చుతున్నాయని, దిగుమతిదారుల నుంచి డాలర్లకు వస్తున్న డిమాండ్ సైతం రూపాయి ఉసురు తీస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మిడ్, స్మాల్ క్యాప్ సూచీలకూ సెగ

బ్లూచిప్ సూచీ సెన్సెక్సే కాదు మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలూ నష్టాలకే పరిమితమయ్యాయి. 2.19 శాతం మేర క్షీణించాయి. కాగా, రంగాలవారీగా నిర్మాణ రంగ షేర్లు అత్యధికంగా 6.01 శాతం నష్టపోగా, మెటల్, ఫైనాన్స్, చమురు-గ్యాస్, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలూ లాభాలకు నోచుకోలేదు. అయితే రూపాయి పతనంతో ఐటీ రంగ షేర్లు 0.30 శాతం మేర పుంజుకున్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీలతోపాటు హెచ్‌యూఎల్ షేర్ల విలువ 1.57 శాతం పెరిగింది. ఇదిలావుంటే అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. చైనా, జపాన్ సూచీలు లాభపడితే, హాంకాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోని ప్రధాన సూచీలూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.

517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles