రెరాతో రయ్.. రయ్..

Fri,August 10, 2018 12:47 AM

New Real Estate Act Rara

-పుంజుకున్న నిర్మాణ వేగం
-ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తున్న బిల్డర్లు
-ఈ జనవరి-జూన్‌లో కస్టమర్లకు 1.93 లక్షల యూనిట్ల అప్పగింత
న్యూఢిల్లీ, ఆగస్టు 9: నూతన రియల్ ఎస్టేట్ చట్టం రెరా అమలు నేపథ్యంలో నిర్మాణ వేగం పుంజుకున్నది. వీలైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తిచేసి కస్టమర్లకు ఇవ్వాలనే దిశగా డెవలపర్లు పరుగులు పెడుతున్నారు. గతేడాది మే నెల నుంచి రెరా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో రియల్టర్ల నుంచి గృహ కొనుగోలుదారులకు ఇండ్ల అప్పగింతలు ఎక్కువైపోయాయి. రియల్టీ పోర్టల్ ప్రాప్ టైగర్ వివరాల ప్రకారం ఈ జనవరి-జూన్ మధ్య 1.93 లక్షలకుపైగా యూనిట్ల డెలివరీ జరిగిపోయింది. గతేడాది జనవరి-జూన్‌లో 1,44,654 యూనిట్ల డెలివరీ జరిగితే, ఈసారి 1,93,061 యూనిట్ల డెలివరీ జరిగిందని స్పష్టం చేసింది.

9 నగరాల జోరు
ఇండ్ల అప్పగింతలో హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, కోల్‌కతా, ముంబై, నోయిడా, పుణె నగరాలు టాప్‌లో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వేసహా నొయిడా పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాల వేగం జోరందుకున్నది. నవీ ముంబై, థానేసహా ముంబై పరిధి, భీమండి, ధరుహెర, సోహ్నా మార్కెట్లుసహా గురుగ్రామ్ పరిధుల్లో కూడా ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యాయని ప్రాపర్టీ టైగర్ ఈ సందర్భంగా వెల్లడించింది. అయితే చెన్నై, పుణె జోన్లు వెనుకబడ్డాయి. నిరుడుతో చూస్తే నొయిడాలో 10,510 యూనిట్ల నుంచి 28,510 యూనిట్లకు పెరుగగా, ముంబైలో 24,169 యూనిట్ల నుంచి 44,663 యూనిట్లకు ఎగిశాయి. ఈసారి అహ్మదాబాద్‌లో 13,380 యూనిట్లకుపైగా, బెంగళూరులో 28,279 యూనిట్లు, గురుగ్రామ్‌లో 24,677 యూనిట్లు, హైదరాబాద్‌లో 11,887 యూనిట్లు, కోల్‌కతాలో 8,314 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నైలో మాత్రం గతంతో పోల్చితే 28 శాతం క్షీణించి 15,485 యూనిట్ల నుంచి 11,122 యూనిట్లకు దిగజారాయి. పుణెలో కూడా 8 శాతం పడిపోయి 24,200 యూనిట్ల నుంచి 22,229 యూనిట్లకు వచ్చాయి

కొత్త ఊపు
ఒప్పందాల ప్రకారం వచ్చే ఏడాది ముగింపునకల్లా ఇంకా దాదాపు 8.6 లక్షల యూనిట్లను కస్టమర్లకు డెవలపర్లు అప్పగించాల్సి ఉన్నదని ప్రాపర్టీ టైగర్ తెలియజేసింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి రావడంతో జరిమానాలను తప్పించుకోవడానికి కొత్త ప్రాజెక్టుల కంటే ఇప్పటికే మొదలైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడంపైనే డెవలపర్లు దృష్టి పెట్టారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కస్టమర్లకు ఇండ్లు, ఫ్లాట్ల అప్పగింతలు పెరిగిపోయాయి. ఇది నిజంగా శుభపరిణామం. నిర్మాణ రంగానికి కలిసొచ్చే అంశం అని ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అంకుర్ ధవన్ అన్నారు. ఇదే జోష్ ఈ ఏడాది ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లో, వచ్చే ఏడాది కూడా ఉంటుందనే ఆశాభావాన్ని అంకుర్ ధవన్ వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఆఖరుకల్లా 8,59,437 యూనిట్లను ఇచ్చేలా డెవలపర్లు-కస్టమర్ల మధ్య డీల్ కుదిరినట్లు చెప్పారు.

రూ.24,011 కోట్ల పెట్టుబడులు
ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య దేశీయ నిర్మాణ రంగంలోకి దాదాపు రూ.24,011 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పారిశ్రామిక సంఘం సీఐఐ, ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక తెలిపింది. రెరాతో రియల్టీపై విశ్వాసం పెరిగిందన్నది. ఐటీ పార్కులు, వాణిజ్యపరమైన విభాగాలు పెట్టుబడులను అమితంగా ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నది. ఇందులోకి సుమారు రూ.13,151 కోట్లు వచ్చాయని, రిటైల్ రంగంలోకి రూ.1,898 కోట్లు వచ్చాయన్నది. ఇక నిరుడుతో పోల్చితే ఈ ఏడాది ప్రథమార్ధంలో గృహ కొనుగోళ్లు కూడా 25 శాతం పెరిగాయని సదరు నివేదిక స్పష్టం చేసింది. కంపెనీల లీజింగ్ కార్యకలాపాలు కూడా పెరిగాయన్నది.

666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS