పెట్రోల్‌ను జీఎస్టీలో చేర్చండి


Mon,September 18, 2017 12:42 AM

-ఇంధనం విషయంలోనూ పన్నుల ఏకీకరణ అవసరం
-ఆర్థిక శాఖకు చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివేదన
gst
హైదరాబాద్, సెప్టెంబర్ 17: వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఆర్థిక శాఖను, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పెట్రో ఉత్పత్తుల విషయంలోనూ పన్నుల ఏకీకరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై రెండు రకాల పన్నులు విధించడం జరుగుతున్నది. ఒకటి కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ సుంకం కాగా.. రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మరొకటి. అందుకే పెట్రోలియం ఇండస్ట్రీ కూడా పన్నుల ఏకీకరణను కోరుకుంటున్నది అని ప్రధాన్ అన్నారు.

జూన్ 16 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీగా సవరిస్తున్నారు. కొత్త విధానంలో మొదటి పదిహేను రోజులు వాహనదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. జూలై నుంచి రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన రెండున్నర నెలల్లో లీటరు పెట్రోల్ రేటు రూ.8 మేర పెరిగి రూ.80కి చేరువవుతున్నది. కొత్త ధరల సవరణ విధానాన్ని ప్రధాన్ సమర్థించుకొచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు అనుగుణంగానే దేశీయంగానూ రేట్ల సవరణ జరుగుతున్నదని అన్నారు. పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో 42 శాతం వాటా రాష్ర్టాలకే లభిస్తున్నదన్నారు. దీనికి తోడు రాష్ర్టాలు విడిగా పెట్రోల్‌పై పన్ను విధిస్తున్నాయి. అంటే, పెట్రో ఉత్పత్తులపై పన్నుల వడ్డింపు ద్వారా అధిక ఆదాయం సమకూరుతున్నది రాష్ర్టాలకేనని ప్రధాన్ పేర్కొన్నారు.

కాంపోజిషన్ స్కీం పునఃప్రారంభం

న్యూఢిల్లీ: రూ.75 లక్షల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారుల కోసం రూపొందించిన కాంపోజిషన్ స్కీంను పునఃప్రారంభించినట్లు జీఎస్టీ నెట్‌వర్క్ తెలిపింది. ఈ పథకంలో చేరేందుకు సెప్టెంబర్ 30వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ పథకంలో చేరడం ద్వారా వ్యాపారులకు పన్ను నిబంధనల పాటింపు సులభతరం కానుంది. పైగా మూడు నెలలకోసారి రిటర్నులు సమర్పిస్తే సరిపోతుంది. గతంలో ఈ పథకాన్ని ఆగస్టు 16 వరకు అందుబాటులో ఉంచారు. కానీ, జీఎస్టీఎన్‌లో రిజిస్టర్ చేసుకున్న 85 లక్షల మంది వ్యాపారుల్లో 10.86 లక్షల మంది మాత్రమే కాంపోజిషన్ స్కీంను ఎంచుకున్నారు. పాత పన్నుల విధానం నుంచి జీఎస్టీ విధానంలోకి బదిలీ అయినవారితోపాటు కొత్తగా జీఎస్టీఎన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నవారు సైతం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఈసారి కాంపోజిషన్ స్కీంను ఎంచుకున్నవారికి అక్టోబర్ 1 నుంచి పథకం అమలులోకి వస్తుంది. అంటే, సెప్టెంబర్ 30 వరకు సాధారణ జీఎస్టీ చెల్లింపుదారుగానే పరిగణించడం జరుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ 30 వరకు ఏ నెలకానెల రిటర్నులు విడివిడిగా ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది.

273

More News

VIRAL NEWS