వృద్ధికి విఘాతమే: డీబీఎస్

Fri,November 9, 2018 12:39 AM

NBFCs may prove to be a drag on economic growth

ముంబై, నవంబర్ 8: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) నెలకొన్న గడ్డు పరిస్థితులు.. దేశ ఆర్థిక వ్యవస్థకే ఎసరు పెట్టే వీలుందని సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంక్ ఆర్థికవేత్త రాధికా రావు హెచ్చరించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం దేశీయ ఎన్‌బీఎఫ్‌సీల రంగాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థలు.. చెల్లింపుల్లో వరుసగా విఫలమైన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్థిక సాయం మందగించగా, ఫలితంగా నిర్మాణ, మౌలిక తదితర కీలక రంగాలు నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఈ రంగాలకు రుణాలు పడిపోయి ద్రవ్యలభ్యత క్షీణించింది. దీంతో ఈ పరిణామం దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని రావు అభిప్రాయపడ్డారు. అయితే బ్యాంకుల రుణ వృద్ధికి ఇది కలిసొచ్చేదిగా అభివర్ణించిన రాధికా రావు.. ఎన్‌బీఎఫ్‌సీల మార్కెట్ షేర్ పడిపోయి బ్యాంకుల వాటా పెరుగవచ్చన్నారు.

కాగా, ఇప్పటికే బ్యాంకులను, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త రుణాల జారీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన నిబంధనల్ని అమల్లోకి తెచ్చిన సంగతీ విదితమే. సూక్ష్మరుణ, గృహ, ఆటో, గ్రామీణ రంగాల రుణాలకు ఎన్‌బీఎఫ్‌సీలే ప్రధాన ఆధారం కావడంతో వీటికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు లేకపోతే ఇబ్బందేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రూ.95 వేల కోట్లు అవసరం

50 అగ్రశ్రేణి ఎన్‌బీఎఫ్‌సీలు ఈ నెలలో రూ.95,000 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉందని క్రిసిల్ తెలిపింది. కాలపరిమితి తీరిన కమర్షియల్ పేపర్స్ చెల్లింపులే రూ.70,000 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చెల్లింపులు సజావుగా జరుగాలంటే బ్యాంకుల నుంచి మరింత రుణ సాయం అనివార్యమని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ అభిప్రాయపడ్డారు.

205
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS