జెట్‌కు గోయల్ గుడ్‌బై

Tue,March 26, 2019 01:01 AM

Naresh Goyal, his wife Anita Goyal to exit Jet Airways

-బోర్డు నుంచి భార్యతోసహా బయటకు
-ఎతిహాద్ నామినీ డైరెక్టర్ కూడా
-బ్యాంకర్ల చేతికి కంపెనీ పగ్గాలు
-తక్షణ సాయంగా రూ.1,500 కోట్లు

ముంబై/న్యూఢిల్లీ, మార్చి 25: అప్పులిచ్చిన బ్యాంకులు పంతాన్ని నెగ్గించుకున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ నరేశ్ గోయల్ తప్పుకున్నారు. ఆయన భార్య అనితా గోయల్ కూడా దిగిపోయారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ చైర్మన్ పదవికీ నరేశ్ గోయల్ గుడ్‌బై చెప్పేశారు. సోమవారం ముం బైలో జరిగిన జెట్ ఎయిర్‌వేస్ బోర్డు సమావేశం బ్యాంకర్ల సారథ్యానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే బ్యాంకుల సిఫార్సు లకూ అంగీక రించింది. దీంతో గోయల్ దంప తులు బయట కు పోవాల్సి వచ్చింది. స్టాక్ ఎక్సేంజ్‌లకు సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బోర్డులో ఎతిహాద్ ఎయిర్‌వేస్ పీజేఎస్‌సీల నామినీ డైరెక్టర్‌గా ఉన్న కెవిన్ నైట్ కూడా తన హోదాకు రాజీనామా చేశారు. జెట్ ఎయిర్‌వేస్‌లో గల్ఫ్‌కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. 26 ఏండ్లకుపైగా విమానయాన సేవల్ని అందిస్తున్న జెట్ ఎయిర్‌వేస్ భవితవ్యంపై గతకొద్ది వారాలుగా అనిశ్చితి వాతావరణం, రకరకాల ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడకు మెజారిటీ వాటా ఉన్న బ్యాంకుల నిర్ణయం మేరకు గోయల్ దంపతులు, కెవిన్ బోర్డు నుంచి బయటకు వచ్చేశారు.

రిజల్యూషన్ ప్లాన్‌కు ఆమోదం

రూ.8,000 కోట్లకుపైగా రుణ భారాన్ని మో స్తున్న జెట్ ఎయిర్‌వేస్‌లో రుణాలిచ్చిన బ్యాంకులకు 50.5 శాతం వాటా ఉన్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాం కింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కూటమి ఓ రిజల్యూషన్ ప్లాన్‌ను తీసుకురాగా.. సోమవారం సంస్థ బోర్డు దానికి ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్‌లో భాగంగానే నరేశ్ గోయల్, అనితా గోయల్, కెవిన్ నైట్‌లు జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి తప్పుకోవాల్సి రాగా, తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లను బ్యాంకులు ఇస్తున్నాయి. అంతేగాక బోర్డులోకి తమ తరఫున ఇద్దరు నామినీ డైరెక్టర్లనూ బ్యాంకులు ప్రవేశపెట్టనున్నాయి. కాగా, సంస్థ నిర్వహణ, రోజువారి కార్యకలాపాల పర్యవేక్షణ, ఆదాయ వ్యవహారాల బాధ్యతల కోసం ఓ మధ్యంతర నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని బోర్డు సభ్యులు ఈ సందర్భంగా నిర్ణయించారు.

మే 31కల్లా బయ్యర్లు రావచ్చు: ఎస్‌బీఐ

జెట్ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటా బ్యాంకులకు ఉన్న నేపథ్యంలో, ఆ బ్యాంకులకు ఎస్‌బీఐ నేతృత్వం వహిస్తున్న క్రమంలో సంస్థలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం రెండు నెలల్లో ఓ కొలిక్కి రాగలదన్న విశ్వాసాన్ని ఎస్‌బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్ వ్యక్తం చేశారు. మే 31కల్లా తమకున్న వాటాను కొనేవారు లేదా పెట్టుబడిదారు వస్తారన్న ధీమాను వెలిబుచ్చారు. జెట్ ఎయిర్‌వేస్‌లోని గోయల్‌తోసహా ప్రస్తుత భాగస్వాములు, ఆసక్తి ఉన్న ఇతర సంస్థలు వాటాల కొనుగోలుకు సంప్రదించవచ్చని సో మవారం సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ సూచించారు. రిజల్యూషన్ ప్లాన్‌లో భాగంగా వాటాల విక్రయం ప్రక్రియ మే ఆఖరు నాటికి ముగిసిపోతుందన్న ఆశాభావాన్నీ ఆయన కనబరిచారు. జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడే చివరి ప్రయత్నంలో భాగంగా మెజారిటీ వాటాను టేకోవర్ చేయడానికి బ్యాంకులు అంగీకరించిన విషయం తెలిసిందే. రుణాలను ఈక్విటీల్లోకి మార్చడంతో జెట్ ఎయిర్‌వేస్‌లో 11.4 కోట్ల షేర్లు బ్యాంకులకు దక్కాయి. ఈ క్రమంలోనే ఎస్‌బీఐకి 51 శాతం వాటా రాగా, నరేశ్ గోయల్ వాటా 50 శాతం నుంచి 25 శాతానికి, ఎతిహాద్ ఎయిర్‌వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి పడిపోయాయి.

ఇదో దుర్దినం: స్పైస్‌జెట్

జెట్ ఎయిర్‌వేస్ పరిణామాలపై మరో దేశీయ ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ స్పందించింది. సంస్థ బోర్డు నుంచి గోయల్ దంపతులు వెళ్లిపోవటం బాధాకరమన్న స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్.. దీన్ని భారతీయ విమానయాన రంగానికే దుర్దినంగా అభివర్ణించారు. జెట్ ఎయిర్‌వేస్ వ్యవహారం దేశీయ విమానయాన రంగంలో నెలకొన్న నిర్మాణాత్మక సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయన్న ఆయన దీనికి సత్వర పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలోనే విధానకర్తలకు జెట్ అంశాన్ని ఓ మేల్కొలుపుగా పేర్కొన్నారు.

16 శాతం ఎగిసిన షేర్ విలువ

జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి గోయల్ దంపతులు తప్పుకోవటంతో ఆ సంస్థ షేర్ విలువ సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఏకంగా 15.5 శాతం పుంజుకున్నది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో 12.69 శాతం వృద్ధితో రూ.254.50 వద్ద ముగిసిన షేర్ విలువ.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో 15.46 శాతం ఎగిసి రూ.261 వద్ద స్థిరపడింది.

బ్యాంకర్ల నిర్ణయం సరైనది: అరుణ్ జైట్లీ

జెట్ ఎయిర్‌వేస్ వ్యవహారంలో బ్యాంకులు చక్కని నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆనందం వ్యక్తం చేశారు. ఇటు సంస్థాగత ప్రయోజనాలకు, అటు ప్రజా ప్రయోజనాలకు బ్యాంకులు పెద్దపీట వేశాయని కొనియాడారు. కాగా, జెట్ ఎయిర్‌వేస్, దాని రుణదాతల మధ్య జరిగిన సంప్రదింపులు సత్ఫలితాలనిచ్చాయని కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ కూడా అభిప్రాయపడ్డారు. దివాలా ప్రక్రియ కంటే ఇది ఎంతో చక్కని పరిష్కారమని ఆయన అభివర్ణించారు. జాతీయ, అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్న జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రస్తుతం 80కిపైగా విమానాలు నిలిచిపోయాయి. వచ్చే నెలాఖరుదాకా కనీసం 14 అంతర్జాతీయ మార్గాల్లో సేవలుండవని జెట్ ప్రకటించింది కూడా. ఇంజినీర్లు, పైలెట్లకు జీతాలను ఇవ్వలేకపోతున్న సంస్థ.. విమానాలను ఎయిర్‌పోర్టులకే పరిమితం చేస్తున్నది. మూడు నెలల జీతాలు బకాయిపడగా, వాటిని ఈ నెలఖారుకల్లా ఇవ్వకపోతే సమ్మె చేస్తామని పైలెట్లు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజా రిజల్యూషన్ ప్లాన్‌తో సమస్య చక్కబడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

సంస్థ బతకాలనే తప్పుకున్నా: గోయల్

జెట్ ఎయిర్‌వేస్ ప్రయోజనాల కోసం, అందులో పనిచేస్తున్న 22,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాల బాగు కోసమే తాను సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నానని నరేశ్ గోయల్ స్పష్టం చేశారు. వారి కోసం నేనేమీ పెద్ద త్యాగం చేయలేదన్న ఆయన సంస్థే నా కుటుంబమని జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులనుద్దేశించి రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. 1992 ఏప్రిల్‌లో జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గోయల్.. నా వెనుక నా కుటుంబం ఉన్నది. నా ఈ నిర్ణయానికి మీరూ తోడుగా ఉంటారని ఆశిస్తున్నా. మీ అందర్నీ చాలా మిస్సవుతున్నా అంటూ తన ఆవేదనను పంచుకున్నారు. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైందన్నారు.

788
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles