ప్చ్.. చింతిస్తున్నా!


Tue,July 18, 2017 12:29 AM

2014లో ఇన్ఫోసిస్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవడంపై నారాయణమూర్తి
narayna-murthy న్యూఢిల్లీ, జూలై 17: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ చైర్మన్ పదవి నుంచి దిగిపోయినందుకు ఇప్పుడు చింతిస్తున్నా అని సీఎన్‌బీసీ టీవీ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సంస్థకు చెందిన ఇతర సహ వ్యవస్థాపకుల మాట విని చైర్మన్ పదవిలో కొనసాగి ఉండాల్సిందని ఎట్టకేలకు తన మనసులో మాటను బయటపెట్టారు. అయితే బెంగళూరులోని సంస్థ ప్రాంగణానికి గతంలో మాదిరిగా రోజూ వెళ్లలేకపోతున్నానన్న వెలితిమాత్రం లేదన్నారు. ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్‌కు (పాలన ప్రమాణాలు) సంబంధించి సీఈవో విశాల్ సిక్కా సారథ్యంలోని ప్రస్తుత మేనేజ్‌మెంట్‌కు, ప్రమోటర్లకు మధ్య గత కొంతకాలంగా అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. ఇన్ఫోసిస్‌లో సిక్కా, సీవోవో ప్రవీణ్ రావు, ఇతర ఉన్నతాధికారులకు భారీ ప్యాకేజీలు చెల్లించడంతోపాటు మాజీ ఉద్యోగులకు పరిహార ప్యాకేజీల చెల్లింపుల విషయంలో బోర్డు నిర్ణయాలను ఇప్పటికే పలు సందర్భాల్లో మూర్తి తప్పుబట్టారు.

మూర్తికి సంస్థ మాజీ సీఎఫ్‌వోలు మోహన్‌దాస్ పాయ్, బాల కూడా మద్దతు పలికారు. ఈ విషయంపై సిక్కాతోపాటు ఇన్ఫోసిస్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శేషసాయి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కూడా. అయినప్పటికీ వీరి మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతున్నాయనడానికి మూర్తి తాజా వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా మీ జీవితంలో పశ్చాత్తాప పడిన సందర్భాలేమైనా ఉన్నాయా అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మూర్తి సమాధానమిస్తూ.. 2014లో ఇన్ఫోసిస్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలనుకున్నప్పుడు నాతోపాటు సంస్థను స్థాపించినవారందరూ నన్ను వారించారు. మరికొన్నేండ్లు పదవిలో కొనసాగాలాని సలహా ఇచ్చారు. సాధారణంగానే నేను చాలా భావోద్వేగ వ్యక్తిని. చాలావరకు నా నిర్ణయాలు ఆదర్శానుసారంగా తీసుకున్నవే. కానీ ఈ విషయంలో మాత్రం వారి మాట వినాల్సింది అని అన్నారు.

223

More News

VIRAL NEWS