కొత్త విధానం సరైనదే

Thu,February 7, 2019 12:39 AM

Mohandas Pai backs new FDI norms for e commerce

ఈ-కామర్స్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలపై పాయ్
ముంబై, ఫిబ్రవరి 6: దేశీయ ఈ-కామర్స్ విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలు సరైనవేనని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ఈ నిబంధనలపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పాయ్ మాత్రం సమర్థించారు. ఈ-కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో స్థానిక వ్యాపారాన్ని తొక్కేస్తున్నాయన్నారు. అంతర్జాతీయ గుత్తాధిపత్యాన్ని భారత్ కోరుకోవడం లేదన్న ఆయన అలాంటి ధోరణికి ఇలాంటి నిర్ణయాలు సబబేనని వ్యాఖ్యానించారు. ఇక్కడ జరుగుతున్న టైకాన్ 2019 సదస్సులో బుధవారం పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. అయితే ఇదే కార్యక్రమానికి హాజరైన పలువురు న్యాయవాదులు, వివిధ రంగాల నిపుణులు, ఆయా సంస్థల ప్రతినిధులు ఆన్‌లైన్ మార్కెట్‌లో ఈ కొత్త ఎఫ్‌డీఐ నిబంధనలపట్ల భిన్నంగా స్పందించారు. ఈ నెల 1 నుంచి ఈ-కామర్స్ కొత్త పాలసీని కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

సమర్థించుకున్న సర్కారు..

నూతన ఎఫ్‌డీఐ నిబంధనలను మోదీ సర్కారు సమర్థించుకున్నది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు హైబ్రిడ్ మార్కెట్లను నిర్వహిస్తున్నాయని ధ్వజమెత్తింది. ప్రస్తుత ఎఫ్‌డీఐ నియమాలను ఈ రెండు సంస్థలు మీరడం వల్లే కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురావాల్సి వచ్చిందని చెప్పింది. తయారీదారుల నుంచి పెద్ద మొత్తంలో స్మార్ట్‌ఫోన్లు తదితర ఉత్పత్తులను నేరుగా తీసుకుని, భారీ డిస్కౌంట్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయని, వీటిని ఓవైపు వివిధ సంస్థలకు, మరోవైపు కస్టమర్లకు విక్రయిస్తున్నాయని, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, వడ్డీలేని నెలసరి చెల్లింపుల పథకాలతో సంప్రదాయ మార్కెట్‌కు విఘాతం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక భారీ నష్టాలే..

కొత్త ఈ-కామర్స్ పాలసీ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఇక భారీ నష్టాలేనని మోర్గాన్ స్టాన్లీ పేర్కొన్నది. అమ్మకాలు పడిపోయి ఆదాయం క్షీణించి నష్టాలు పెరుగడం ఖాయమన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

మళ్లీ మంచి రోజులొస్తాయేమో..

ఈ-కామర్స్ ఎఫ్‌డీఐ పాలసీలో వచ్చిన నూతన మార్పుల మధ్య కూడా భవిష్యత్తుపై ఆశావాహ దృక్పథాన్ని వాల్‌మార్ట్ వ్యక్తం చేస్తున్నది. దేశీయ ఆన్‌లైన్ మార్కెటీర్ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లతో వాల్‌మార్ట్ గతేడాది కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త పాలసీతో ఈ-కామర్స్ వ్యాపార స్వరూపమే మారిపోగా, మునుపటి భారీ డిస్కౌంట్లు, బల్క్ సేల్స్‌కు తెరపడింది. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌కు వాల్‌మార్ట్ గుడ్‌బై చెప్పడమే మంచిదన్న మోర్గాన్ స్టాన్లీ వ్యాఖ్యలపై స్పందిస్తూ మున్ముందు పరిస్థితులు బాగుండొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

1002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles