కొనసాగనున్న ర్యాలీ!

Mon,May 27, 2019 12:27 AM

Modis new government formation GDP data likely to drive market this week

- కార్పొరేట్ల ఫలితాలు, జీడీపీ గణాంకాలు కీలకం
- ఈ వారం స్టాక్ మార్కెట్ల తీరుపై విశ్లేషకుల అంచనా


ముంబై, మే 26: ఈవారంలోనూ స్టాక్ మార్కెట్లు మరో నూతన శిఖరాగ్రానికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్‌కు స్పష్టమైన మెజార్టీ రావడం, మరోవైపు జీడీపీ గణాంకాలు, డెరివేటివ్ కాంట్రాక్టు గడువు కూడా ఈ వారంలోనే ముగియనుండటంతో మదుపరులు కొనుగోళ్లవైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా నెలకొన్ని పరిస్థితులు కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. గతవారంలో రికార్డు స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారంలోనూ జోరు తప్పదని యెస్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ తెలిపారు. ఎన్‌డీఏ సర్కార్‌కు అత్యధిక మెజార్టీ రావడంతో రానున్న ఐదేండ్లలో సంస్కరణలకు పెద్దపీట వేసే అవకాశాలుండటం మార్కెట్లకు కలిసిరానున్న అంశమని ఆయన పేర్కొన్నారు. 542 పార్లమెంట్ స్థానాలకుగాను బీజేపీ పార్టీ 300కి పైగా స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. వచ్చే నెల మొదట్లో రిజర్వు బ్యాంక్ ప్రకటించనున్న పాలసీ నిర్ణయాలు, నూతన ప్రభు త్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ వరకు మదుపరులు వేచి చూసే దోరణిలో ఉండాలని సామ్‌కో సెక్యూరిటీస్ ఫౌండర్, సీఈవో జిమీ ట్ మోదీ సూచించారు.

గడిచిన వారంలో సెన్సెక్స్ 1,503 పాయింట్లు పెరిగి 39,434.72 వద్ద ముగిసింది. ఈవారంలోనే భెల్, గెయిల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, పీఎన్‌బీ, స్పైస్‌జెట్, ఇమామీ, సన్‌ఫార్మా, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తోపాటు పలు కార్పొరేట్ సంస్థలు తమ గత త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. మరోవైపు అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలిక, అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు, వర్షాభావ పరిస్థితులు, పెట్టుబడుల ట్రెండ్ కూడా మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అలాగే మందకొడి వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ, విమానయాన రంగంపై నూతన ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిచ్చే అంశం కూడా మార్కెట్ల సరళిని మార్చే అంశాల్లో ఒక్కటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 31న గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం, మొత్తం ఏడాదికిగాను భారత వృద్ధిరేటు గణాంకాలను కేంద్రం విడుదల చేయబోతున్నది. వీటితోపాటు ద్రవ్యలోటు, కీలక రంగాల గణాంకాలు కూడాఈ వారంలోనే విడుదలవుతున్నాయి.

రూ.1.42 లక్షల కోట్లు పైకి

గడిచిన వారంలో టాప్-10కు చెందిన ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1.42 లక్షల కోట్ల మేర పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 45,069.66 కోట్లు ఎగబాకగా, ఎస్‌బీఐ రూ.31,816 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 26,586.43 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 23,024 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ.10,157.84 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.2,911.52 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.2,902.17 కోట్ల చొప్పున పెరిగింది. కానీ, టీసీఎస్ రూ.17,523.60 కోట్లు నష్టపోగా, ఐటీసీ రూ.13,791 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.6,269.42 కోట్లు తగ్గాయి.

రూ.6 లక్షల కోట్లు పెరిగిన సంపద

గడిచిన వారంలో మదుపరులు భారీగా లాభపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావడంతో గత వారంలో మదుపరుల సంపద రూ.6.10 లక్షల కోట్లకు మేర పెరిగింది. ముఖ్యంగా ఫలితాలు విడుదలైన గురువారం ఒక్కరోజే రూ.2.50 లక్షల కోట్లు లాభపడ్డారు. ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా ఫలితాలు రావడం కార్పొరేట్ వర్గాలకు భారీగా లాభం చేకూర్చింది. ముఖ్యంగా 52 స్టాకులు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకడం విశేషం.

రూ.4,375 కోట్లు వెనక్కి

- పెట్టుబడుల ఉపసంహరణలో ఎఫ్‌పీఐలు


దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లోలకి భారీగా నిధులు కుమ్మరించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ నెలలో ఉపసంహరణకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు రూ.4,375 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. ఏప్రిల్‌లో రూ.16,093 కోట్లు పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరి నెలలో రూ.11,182 కోట్లను దేశీయ క్యాపిటల్ మార్కెట్ల(ఈక్విటీ, డెబిట్ మార్కెట్లు) నుంచి ఉపసంహరించుకున్నట్లు తాజాగా డిపాజిటరీస్ నివేదికలో వెల్లడైంది. ఈ నెల 2 నుంచి 24 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.2,048 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్న ఎఫ్‌పీఐలు.. డెబిట్ మార్కెట్ల నుంచి రూ.2,309.86 కోట్లను ఉపసంహరించుకున్నారు.

అయినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు(గత గురువారం) ఎఫ్‌పీఐలు భారీగా నిధులను కుమ్మరించారని మ్యూచువల్ ఫండ్స్ రీసర్చ్ ఫండ్స్ ఇండియా హెడ్ విద్యా బాలా తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ నెల 23న ఎఫ్‌పీఐలు రూ.1,352.20 కోట్ల పెట్టుబడులు పెట్టారు. రెండోసారి అధికారంలోకి రావడంతో ఎఫ్‌పీఐలు ఆచితూచి అడుగులు వేస్తున్నారని, బ్యాంక్‌లకు మూలధన నిధుల కేటాయింపులో గత సర్కార్ విఫలమైందన్న అభిప్రాయం వారిలోనెలకొన్నదని, మరోవైపు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి వడ్డీల రూపంలో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదని బాలా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో ఎఫ్‌పీఐలు ఇకముందు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు.

695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles