రియల్టీకి జీఎస్టీ జోష్

Sat,February 9, 2019 12:28 AM

Ministers recommended tax reduction

-పన్ను రేట్ల తగ్గింపునకు మంత్రుల బృందం సిఫార్సు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: నిర్మాణంలో ఉన్న నివాస గృహాలు, సముదాయాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ నాయకత్వంలో ఏర్పాటైన రాష్ర్టాల మంత్రుల బృందం కోరుతున్నది. ప్రస్తుతం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)తో 12 శాతంగా ఉన్న జీఎస్టీని ఐటీసీ లేకుండా 5 శాతానికి దించాలని సిఫార్సు చేస్తున్నది. జీఎస్టీ విధానంలో నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల పరిష్కార నిమిత్తం పన్ను రేట్ల పరిశీలనకుగాను గత నెలలో ఈ బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఈ మంత్రుల బృందం తొలిసారిగా సమావేశమైంది. ఈ సందర్భంగా చౌక గృహాలపైనా జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించడానికి బృందం మద్దతు పలికింది. వారం రోజుల్లో ఈ మంత్రుల బృందం సిఫార్సులు తుదిరూపు దాల్చుతాయంటున్న సంబంధిత అధికారులు.. రాబోయే జీఎస్టీ మండలి సమావేశంలో వీటిపై ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలోని జీఎస్టీ మండలి.. గత నెల 10న ఈ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయగా, ఏడుగురు సభ్యులుగల ఈ బృందంలో పటేల్‌తోపాటు మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా రాష్ర్టాల ఆర్థిక మంత్రులున్నారు.

అమ్మకాలు పెరుగుతాయ్: క్రెడాయ్


మంత్రుల బృందం సిఫార్సులు అమల్లోకి వస్తే.. నిర్మాణ రంగంలో అమ్మకాలు పెరుగుతాయని రియల్టర్ల సంఘం క్రెడాయ్ ఆనందం వ్యక్తం చేసింది. జీఎస్టీ మండలి ఈ సిఫార్సులపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేసింది. జీఎస్టీ రేట్లు తగ్గితే కొనుగోలుదారులు ముందుకు వస్తారని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు జక్సే షా విశ్వాసం వ్యక్తం చేశారు. అధిక జీఎస్టీ కారణంగా ఇప్పుడు కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారన్న ఆయన పన్నుల భారం తగ్గితే పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏడాదిన్నర తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నిర్ణయం ప్రయోజనాన్ని బ్యాంకులన్నీ ఖాతాదారులకు అందించాలని రియల్టర్లు కోరుతున్నారు.

1345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles