తెలంగాణలో మేఘా గ్యాస్

Thu,November 14, 2019 01:21 AM

-13 జిల్లాలకు అందనున్న సరఫరా
- కొత్త వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా అడుగులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్ఠాత్మక ప్రణాళికతో తమ హైడ్రో కార్బన్ విభాగం విస్తరణకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ రకాల వినియోగదారులకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)ను మేఘా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా గ్యాస్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంపై సంస్థ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 జిల్లాల్లో గ్యాస్‌ను విక్రయించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందుకోసం పెట్రోలియం అండ్ సహజ వాయువు నియంత్రణ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) ఆమోదాన్ని కూడా పొందింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తుముకూరు, బెల్గాం జిల్లాల్లో ఇప్పటికే మేఘా గ్యాస్ పేరుతో వినియోగదారులకు గ్యాస్‌ను సంస్థ సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ సబర్బన్ ఏరియాలుసహా తెలంగాణలోని 13 జిల్లాలకూ గ్యాస్ సరఫరా కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది.

h25 వేల కిలోమీటర్ల పైప్‌లైన్

ఎంఈఐఎల్ ఇప్పటికే 1,200 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను నిర్మించింది. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక వ్యాప్తంగా దాదాపు 5 వేల కిలోమీటర్ల లైన్‌ను ఏర్పాటు చేయా లని యోచిస్తున్నది. గ్యాస్ సరఫరా ప్రధానంగా రెండు విధాలుగా జరుగుతుందని, పైప్‌లైన్ ద్వారా పీఎన్‌జీ వినియోగదారులకు అందితే, లారీ, రైలు ట్యాంకర్ల ద్వారా సీఎన్‌జీ రవాణా అవుతుందని మేఘా ఉపాధ్యక్షుడు పీ రాజేశ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే పీఎన్‌జీ సరఫరా కోసం పైప్‌లైన్‌ను విస్తరిస్తున్నామని చెప్పారు.

వ్యూహాత్మకంగా అడుగులు

రెండు తెలుగు రాష్ర్టాల్లో గ్యాస్ గ్రిడ్ నెట్‌వర్క్స్ అభివృద్ధి కోసం మేఘా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నాగాయలంక, పశ్చిమ పెనుగొండ ప్రాంతాల్లో ఓఎన్జీసీ నుంచి సముద్రతీర గ్యాస్ క్షేత్రాలను సాధించుకున్నది. ఈ క్షేత్రాల నుంచి రోజుకు సుమారు 1.30 లక్షల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్‌సీఎం) గ్యాస్‌ను తరలించనున్నారు. దీనికి తగ్గట్లుగానే అమెరికా నుంచి భారీ ఎత్తున సాంకేతికతనూ మేఘా దిగుమతి చేసుకున్నది. మెకానికల్ రిఫ్రిజిరేషన్ యూనిట్ల ఏర్పాటుతోపాటు కంప్రెషర్లు, ఇతర మెకానికల్ ప్యాకేజీలను సమకూర్చుకున్నది. నాగాయలంక క్షేత్రం నుంచి ఇప్పటికే కృష్ణా జిల్లా పీఎన్‌జీ వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతున్నదని రాజేశ్ రెడ్డి చెప్పారు. ఇక గెయిల్ ద్వారా కూడా వివిధ రకాలుగా రోజుకు 40 వేల ఎస్‌సీఎం సహజ వాయువును మేఘా అందుకుంటున్నది.

జోరుగా సీఎన్‌జీ స్టేషన్లు

కృష్ణా జిల్లాలో 9 సీఎన్‌జీ స్టేషన్లను తెరిచిన మేఘా.. మరో 3 నెలల్లో అదనంగా ఇంకో 5 స్టేషన్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నది. ఈ 9 స్టేషన్ల ద్వారా నెలకు 4.50 లక్షల ఎస్‌సీఎం గ్యాస్ విక్రయాలు జరుగుతున్నాయి. త్వరలో వచ్చే 5 స్టేషన్లు.. 3 లక్షల ఎస్‌సీఎం గ్యాస్ అమ్మకాలే లక్ష్యంగా రానున్నాయి. ప్రస్తుతం మేఘా గ్యాస్‌కు 13 వేలకుపైగా నమోదిత గృహ వినియోగదారులున్నారు. ఈ నెలాఖరుకల్లా మరో 2 వేలు పెరుగవవచ్చని అంచనా. ఇక వాణిజ్య గ్యాస్ విక్రయాలు నెలకు 60 వేల ఎస్‌సీఎం మార్కును దాటేశాయి. ఇంకో 10 వాణిజ్య కనెక్షన్లు రావచ్చని భావిస్తున్న మేఘా.. కుదిరితే లక్ష ఎస్‌సీఎం సామర్థ్యానికి చేరుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది.

కర్ణాటకలోనూ దూకుడే

కర్ణాటకలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి పీఎన్‌జీకి విశేషమైన డిమాండ్ కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇక్కడి తుముకూరు, బెల్గాం జిల్లాల్లో మేఘా గ్యాస్ సేవలు నడుస్తున్నాయి. తుముకూరులో 12,500లకుపైగా గృహ వినియోగదారులుండగా, వచ్చే నెల మరో 4 వేల కనెక్షన్లు పెరుగవచ్చన్న అంచనాలున్నాయి. వాణిజ్యపరంగా డిమాండ్ నెలకు 1.40 లక్షల ఎస్‌సీఎం దాటింది. త్వరలోనే రెండింతలయ్యే వీలుందని మేఘా ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. ఇక బెల్గాం జిల్లాలో సంస్థకు నమోదిత కస్టమర్లు 15 వేలపైనే. ఇందులో పీఎన్‌జీ గృహ వినియోగదారులు 2,500లకుపైగా ఉంటారు. వాణిజ్య గ్యాస్ అమ్మకాలు నెలకు 2.10 లక్షల ఎస్‌సీఎంగా ఉన్నది. త్వరలోనే 3 లక్షల మార్కును చేరుకుంటామని మేఘా చెబుతున్నది. ఈ రెండు జిల్లాల్లో 4 సీఎన్‌జీ స్టేషన్లకు సంస్థ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. పరిశ్రమల్లో సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ఇస్తున్నట్లు మేఘా తెలియజేసింది. కాగా, కువైట్, జోర్డాన్, బంగ్లాదేశ్, సింగపూర్ దేశాల్లో రిఫైనరీ ప్రాజెక్టులను మేఘా చేపట్టిన సంగతి విదితమే. అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో, గ్యాస్ ఆధారిత విద్యుత్, కంప్రెషర్ ప్లాంట్లలో, రా ప్రాసెసింగ్ యూనిట్లలో తన శక్తి సామర్థ్యాలను చాటుతున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినది ఈ సంస్థే.

కొత్తగా ఏయే జిల్లాలకు..

తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మేఘా గ్యాస్ అందుబాటులోకి రానున్నది. దీంతో ఈ జిల్లాల్లో పనులు ప్రారంభించనున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు. మరో మూడు నెలల్లో ఈ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. వీలైనంత త్వరగా గ్యాస్ సరఫరాను ప్రారంభించాలన్న లక్ష్యంతో మేఘా కదులుతున్నది.

757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles