ఆ వివరాల్ని చెప్పం!

Thu,May 16, 2019 02:20 AM

MEA refuses to divulge details on Vijay Mallya Nirav Modi extraditions

-మాల్యా, నీరవ్ అప్పగింతపై విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ, మే 15: ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీల అప్పగింత సమాచారాన్ని పంచుకోలేమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వివరాలను బహీర్గతం చేస్తే మాల్యా, నీరవ్‌ల విచారణ, అప్పగింత ప్రక్రియకు విఘాతం ఏర్పడవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ పిటీషన్‌కు బదులిస్తూ భారత్‌కు మాల్యా, నీరవ్‌ల అప్పగింత కోసం బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిటన్ అధికార వర్గాల కనుసన్నల్లోనే వారున్నారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 (1) (హెచ్) కింద ఇంతకుమించి సమాచారాన్ని మేమివ్వలేం అని పీటీఐ జర్నలిస్టు దాఖలు చేసిన పిటీషన్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా రుణాలు ఎగవేసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో బెయిల్‌పై తిరుగుతున్న విషయం తెలిసిందే.

మూడేండ్ల క్రితం లండన్‌కు పారిపోయిన మాల్యాపై మోసం, మనీ లాండరింగ్ కేసులు నమోదైన సంగతీ విదితమే. లండన్ వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ మాల్యాను భారత్‌కు అప్పగించడానికి అంగీకరించింది కూడా. అయితే దీనిపై బ్రిటన్ హైకోర్టులో మాల్యా అప్పీలు చేసుకోవడంతో జూలై 2న ఆ విచారణ జరుగనున్నది. ఇక వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ.14,000 కోట్లదాకా ముంచి పారిపోయాడు. ఈ కేసులో ఆయన మేనమామ, రత్నాల వ్యాపారి మెహుల్ చోక్సీ కూడా ప్రధాన నిందితుడే. నీరవ్ కూడా లండన్‌లో పట్టుబడగా, ప్రస్తుతం అప్పగింత విచారణను ఎదుర్కొంటున్నది తెలిసిందే. ఈ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ,ఈడీ విచారిస్తున్నాయి.132 అప్పగింత విజ్ఞప్తులుభారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన మోసగాళ్ల అప్పగింతకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మరో ఆర్టీఐ పిటీషన్‌కు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గడిచిన నాలుగేండ్లలో ఆయా దేశాల్లోని భారత ఆర్థిక నేరగాళ్ల అప్పగింత కోసం 132 విజ్ఞప్తులను చేసినట్లు వివరించింది. అయితే ఈ వివరాలను కూడా బహీర్గతం చేయలేమని ప్రకటించింది.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles