పోటెత్తిన పెట్టుబడులు

Tue,March 13, 2018 03:19 AM

Market returns will be interplay of profit growth PE ratio Rana B Gupta

దేశీయ స్టాక్ మార్కెట్లలో గ్లోబల్ ర్యాలీ
సెన్సెక్స్ 611, నిఫ్టీ 195 పాయింట్ల వృద్ధి

sensex.jpg
ముంబై, మార్చి 12: అంతర్జాతీయ పరిణామాలు కలిసొచ్చాయి. మదుపరులు పెట్టుబడులతో కదం తొక్కారు. బుల్ రంకేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట పండింది. సోమవారం భారతీయ ఈక్విటీ మార్కెట్లలో కనిపించిన పరిణామ క్రమమిది. ప్రపంచ మార్కెట్‌లో తొలగిన వాణిజ్య యుద్ధ భయాలు.. రెండేండ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఒక్కరోజే సూచీలను పుంజుకునేలా చేశాయి. సెన్సెక్స్ 610.55 పాయింట్లు ఎగబాకి 33,917.94 వద్ద ముగియగా, 2016 మార్చి 1 (777.35 పాయింట్లు) తర్వాత ఈ స్థాయిలో లాభాలు రావడం ఇదే తొలిసారి. ఇక నిఫ్టీ సైతం 194.55 పాయింట్లు ఎగిసి 10,421.40 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభం నుంచి సూచీలు లాభాల్లోనే కదలాడగా, ఒకానొక దశలోనైతే సెన్సెక్స్ 33,962.48 పాయింట్లు, నిఫ్టీ 10,433.65 పాయింట్ల స్థాయిని చేరుకున్నాయి.

ఇక ఆటో, మెటల్, చమురు, గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగాల షేర్లకు పెద్ద ఎత్తున మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా విదేశీ మదుపరులు అమితాసక్తిని ప్రదర్శించడంతో ఆటో షేర్లు 7.77 శాతం, మెటల్ షేర్లు 4.43 శాతం మేర లాభాలను అందుకున్నాయి. స్పెక్ట్రమ్ అవసరాల కోసం చెల్లింపులు, రుణాల రీఫైనాన్స్‌కు రూ.16,500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలుపడంతో భారతీ ఎయిర్‌టెల్ షేర్ విలువ 4.68 శాతం పుంజుకున్నది. మూడీస్ ఇన్వెస్టర్స్ సరీస్ ఎన్‌టీపీసీకి బీఏఏ2 రేటింగ్‌ను ఇవ్వడంతో ఆ సంస్థ షేర్ విలువా 4.33 శాతం పెరిగింది. ఇక ఇటీవలి వస్తు, సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్) సమావేశంలో సిగరెట్లపై సెస్సును యథాతథంగానే ఉంచడంతో ఐటీసీ షేర్ల విలువ కూడా 4.09 శాతం పెరిగింది. బీఎస్‌ఈ మిడ్-క్యాప్ సూచీ 0.76 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.56 శాతం మేర లాభపడ్డాయి.

లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు

సోమవారం అంతర్జాతీయంగానూ స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలను అందుకున్నాయి. ఆసియా మార్కెట్లలో కీలక సూచీలైన హాంకాంగ్ 1.93 శాతం, జపాన్ 1.65 శాతం, సింగపూర్ 0.97 శాతం, చైనా 0.59 శాతం చొప్పున పెరిగాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన జర్మనీ 0.52 శాతం, ఫ్రాన్స్ 0.14 శాతం, లండన్ 0.04 శాతం మేర వృద్ధి చెందాయి.

7 శాతం నష్టపోయిన ఆంధ్రా బ్యాంక్ షేర్

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ షేర్ విలువ సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు 7 శాతం పడిపోయింది. రూ.5,000 కోట్ల మోసం కేసులో ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనూప్ ప్రకాశ్ గార్గ్‌పై ఉన్న ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఒక్కసారిగా బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. ఒకానొక దశలో బీఎస్‌ఈలో 15.45 శాతం మేర దిగజారి రూ.32.55 వద్దకు క్షీణించిన ఆంధ్రా బ్యాంక్ షేర్ విలువ.. మార్కెట్ ముగిసే సమయానికి 6.88 శాతం నష్టంతో రూ.35.85 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 6.74 శాతం పతనంతో రూ.35.95 వద్ద నిలిచింది. ఫలితంగా బ్యాంక్ మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.231 కోట్లు నష్టపోయి రూ.3,128.99 కోట్లకు తగ్గింది. ఐడీబీఐ బ్యాంక్ (8.49 శాతం), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (3.04 శాతం), బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.51 శాతం), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.22 శాతం), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (0.94 శాతం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.12 శాతం) షేర్లూ పడిపోయాయి. కాగా, గుజరాత్‌కు చెందిన ఔషధ రంగ సంస్థ స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమేయమున్న ఈ మోసం కేసులో ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కూటమికి రూ.5,000 కోట్లు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

పారిస్, లండన్ ఎక్సేంజీలకు ఇన్ఫీ గుడ్‌బై

యూరోనెక్స్ పారిస్, యూరోనెక్స్ లండన్ ఎక్సేంజీల నుంచి ఇన్ఫోసిస్ స్వచ్ఛందంగా వైదొలిగింది. వీటిలోని తమ అమెరికన్ డిపాజిటరీ షేర్స్ (ఏడీఎస్) డీలిస్టింగ్‌ను సోమవారం ప్రకటించింది. తమ షేర్ల ట్రేడింగ్ నిరాశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొనసాగుతామని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.

రూ.1.78 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్న నేపథ్యంలో మదుపరుల సంపద ఈ ఒక్కరోజే లక్షలాది కోట్ల రూపాయలు ఎగిసింది. బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ.1.78 లక్షల కోట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 611 పాయింట్లు పుంజుకున్న క్రమంలో రూ.1,78,393.67 కోట్లు పెరిగి రూ.1,44,52,009 కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 28 షేర్లు లాభాల్లోనే ముగియగా, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో లాభపడ్డాయి.

1097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles