ఐఐపీలో స్వల్ప రికవరీ


Wed,September 13, 2017 12:57 AM

-జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి 1.2 శాతం
-ఐదు నెలల గరిష్ఠ స్థాయికి ధరల సూచీ
-గతనెలలో 3.36శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
-వచ్చే సమీక్షలో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం

graph
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశీయ పారిశ్రామిక రంగం ఇంకా మందకొడిగానే సాగుతున్నది. జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 1.2 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే నెలకు 4.5 శాతంగా నమోదైన ఐఐపీతో పోలిస్తే భారీగా తగ్గింది. వస్తు తయారీ రంగ పనితీరు మందగించడం ఇందుకు కారణమైంది. జూన్ నెల ఐఐపీని -0.2 శాతానికి సవరించినట్లు మంగళవారం విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో కేంద్ర గణాంక శాఖ పేర్కొంది. మరోవైపు మార్కెట్లో ధరలు ఐదు నెలల గరిష్ఠానికి పుంజుకున్నాయి. గతనెలకు వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.36 శాతానికి ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదు నెలలో సూచీ 2.36 శాతంగా నమోదైంది. కూరగాయలు, పండ్ల ధరలు గణనీయంగా పెరుగడం ఇందుకు ప్రధాన కారణమైంది. రుణాత్మక స్థాయిలో ఉన్న ఆహార ధరల ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో 1.52 శాతానికి పెరిగింది. పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఇంకా నిరాశాజనకంగా ఉండటం, మరోవైపు ధరలు పుంజుకొన్న నేపథ్యంలో వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించాలని ఇండస్ట్రీ వర్గాలు ఆర్బీఐని డిమాండ్ చేశాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలకు (ఏప్రిల్-జూలై) పారిశ్రామికోత్పత్తి 1.7 శాతానికి పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలానికి ఐఐపీ 6.5 శాతంగా ఉంది. జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వృద్ధి 0.1 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదేనెలకు తయారీ రంగం 5.3 శాతం వృద్ధి నమోదు చేసుకోగలిగింది. ఐఐపీలో ఈ రంగానికి 77.6 శాతం వెయిటేజీ ఉంది. ప్రైవేట్ పెట్టుబడుల ట్రెండ్‌ను తెలిపే భారీ యంత్రాల రంగం వృద్ధి జూలైలో -1 శాతానికి క్షీణించింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ గ్రోత్‌రేటు కూడా -1.3 శాతానికి పతనమైంది. జూలైలో విద్యుత్ రంగం వృద్ధి మాత్రం వార్షిక ప్రాతిపదికన 2.1 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. మైనింగ్ సెక్టార్ వృద్ధి సైతం 0.9 శాతం నుంచి 4.8 శాతానికి చేరుకుంది.

మార్చి నెలలో 3.89 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ మళ్లీ దాదాపు అదే స్థాయికి చేరుకుంది. గతనెలలో పండ్ల ధరలు వార్షిక ప్రాతిపదికన 5.29 శాతం, కూరగాయల రేట్లు 6.16 శాతం ఎగబాకాయి. రెడీమేడ్ ఆహారం, స్నాక్స్ కూడా ప్రియమయ్యాయి. రవాణా, సమాచార సేవలు పెరుగడం కూడా రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకడానికి కారణమైంది. తృణధాన్యాలు, మాంసం, చేపలు, నూనెల ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి.

460

More News

VIRAL NEWS