రెండింతలైన పారిశ్రామికోత్పత్తి


Tue,March 13, 2018 03:03 AM

జనవరిలో 7.5 శాతంగా నమోదు

PTI.jpg
న్యూఢిల్లీ, మార్చి 12: పారిశ్రామిక రంగం పరుగుపెట్టింది. ఈ ఏడాది తొలి నెలలో ఏకంగా 7.5 శాతంగా నమోదైంది. తయారీ రంగం నుంచి వచ్చిన సానుకూల అంశాలతోపాటు కన్జ్యూమర్, క్యాపిటల్ గూడ్స్ విభాగాల నుంచి ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదుచేసుకోవడంతో 2017 జనవరిలో నమోదైన 3.5 శాతంతో పోలిస్తే రెండురెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గతేడాది చివరి నెలలో ఇది 7.1 శాతంగా ఉన్నది. పారిశ్రామిక వృద్ధిలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం 8.7 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కలిసొచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 2.5 శాతంగా ఉండేది. పెట్టుబడులకు కేంద్రబిందువైన క్యాపిటల్ గూడ్స్ విభాగం జెట్‌స్పీడ్ వేగంతో దూసుకుపోయింది.

అంతక్రితం ఏడాది ఇదే నెలలో 0.6 శాతంగా ఉన్న క్యాపిటల్ గూడ్స్..ఈ ఏడాది జనవరికిగాను ఇది 14.6 శాతానికి చేరుకున్నది. కన్జ్యూమర్ గూడ్స్ విభాగం 8 శాతం వృద్ధిని కనబరుచగా, నాన్-డ్యూరబుల్ గూడ్స్ రంగం 10.5 శాతంగా నమోదయ్యాయి. కానీ గనుల రంగం నిరాశపరిచింది. ఏడాది క్రితం 8.6 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న గనులు.. జనవరిలో 0.1 శాతానికి జారుకున్నాయి. ప్రాథమిక వస్తువులు 5.8 శాతం, మధ్యంతర వస్తువులు 4.9 శాతం, మౌలికం/నిర్మాణ రంగ పరికరాల్లో వృద్ధి 6.8 శాతంగా నమోదైందని నివేదిక వెల్లడించింది. 23 రంగాల్లో 16 వృద్ధిని నమోదు చేసుకోగా, ఏడు నిరాశాజనక పనితీరు కనబరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో ఐఐపీ రేటు 4.1 శాతంగా నమోదైంది.

283

More News

VIRAL NEWS