కొత్త సంస్థలకు కలిసొచ్చింది

Mon,October 7, 2019 12:11 AM

-ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన
-మెజారిటీ కంపెనీలకు లాభాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నా.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు వచ్చిన కొత్త సంస్థలకు మాత్రం లాభాలే దక్కాయి. 2019లో మొత్తం 11 సంస్థలు ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాయి. ఇందులో 8 సంస్థల షేర్ల విలువ.. ఆరంభంతో పోల్చితే 95 శాతం వరకు పెరిగింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం, దెబ్బతిన్న మదుపరుల సెంటిమెంట్.. మార్కెట్ ఒడిదుడుకులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఐపీవోలకు డిమాండ్ బాగానే ఉందని, ఆ నమ్మకాన్ని నిరూపించేలా 70 శాతం సంస్థలు ప్రతికూల వాతావరణంలోనూ లాభాల్లో పరుగులు పెడుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కాగా, ఈ ఏడాది జూలైలో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఇండియామార్ట్ ఇంటర్‌మెష్ లిమిటెడ్ షేర్ విలువ అత్యధికంగా 95 శాతం పుంజుకున్నది.

ఆ తర్వాత నియోజెన్ కెమికల్స్ షేర్ విలువ 76 శాతం పెరిగింది. అఫ్లే (ఇండియా) లిమిటెడ్ (49 శాతం), మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ (40 శాతం), పాలిక్యాబ్ ఇండియా (24 శాతం), రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (21 శాతం), చాలెట్ హోటల్స్ (12 శాతం), స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ (7 శాతం) షేర్లూ లాభపడ్డాయి. అయితే ఎంఎస్‌టీసీ (24 శాతం), స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ (23 శాతం), జెల్మోక్ డిజైన్ అండ్ టెక్ (4.5 శాతం) షేర్ విలువలు దిగజారాయి. ఇక ఐఆర్‌సీటీసీ, విశ్వరాజ్ షుగర్ ఇండస్ట్రీస్ ఐపీవోలు గురు, శుక్రవారాల్లోనే ముగిశాయి. దీంతో మొత్తం ఈ ఏడాది 13 సంస్థలు ఐపీవోలకు రాగా, రూ.11వేల కోట్ల నిధులను సమీకరించాయి. నిరుడు 24 సంస్థలు రూ.30,959 కోట్ల నిధులను దక్కించుకున్నాయి.

265
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles