జావా బైకులొచ్చేశాయి..

Fri,November 16, 2018 12:10 AM

Mahindra revives classic Jawa brand with 3 new motorcycles

-మార్కెట్లోకి విడుదల చేసిన మహీంద్రా
-ప్రారంభ ధర రూ.1.5 లక్షలు
-ముంబై నుంచి రంగు ప్రవీణ్ కుమార్

మళ్లీ దేశీయ రోడ్లపై జావా బైకులు దూసుకుపోనున్నాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన క్లాసిక్ లెజెండ్స్..ఈ ప్రీమియం ఐకానిక్ జావా మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు రకాల్లో లభించనున్న ఈ బైకులు గరిష్ఠంగా రూ.1.89 లక్షలకు లభించనున్నాయి. వీటిలో జావా మోడల్ రూ.1.55 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..జావా-ఫార్టీ టూ విలువ రూ.1.64 లక్షలు, జావా-పెరాక్ మోడల్ రూ.1.89 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంకు సంబంధించినవి. 293 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకుల్లో సింగిల్ సిలిండర్, డబుల్ ఒవర్‌హెడ్ ఇంజిన్ ఉన్నాయి. ఈ సందర్భంగా మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. ఒకప్పటి లెజెండరీ బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నాను..సాహసోపేత, అందమైన బైకు రైడ్‌కు జావా ప్రతీకగా నిలుస్తుందన్నారు. 22 ఏండ్ల క్రితం నిలిచిపోయిన అమ్మకాలను పున:ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని, తద్వారా ద్విచక్ర వాహన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ బైకులు కీలకంగా మారనున్నాయని చెప్పారు.

ఇన్ని బైకులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోలేదని, అలాగని మాస్ సెగ్మెంట్‌పై కూడా దృష్టి సారించలేదని ఆయన పేర్కొన్నారు. వీటితో దేశీయ మార్కెట్‌తోపాటు ఎగుమతులపై కూడా దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రీమియం బైకులకు మార్కెట్ పెరుగుతున్న తరుణంలో జావాను తిరిగి తీసుకురావడం సంతోషంగా ఉందని క్లాసిక్ లెజెండ్స్ సీఈవో ఆశిష్ జోషి తెలిపారు. మారుతున్న వినియోగదారుల అభిరుచిలకు తగ్గట్టుగా ఈ బైకులను తీర్చిదిద్దినట్లు, తద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరింత సులవవుతుందన్నారు. ముందస్తు బుకింగ్‌లను గురువారం ప్రారంభించిన సంస్థ వచ్చే నెల 7 నుంచి కొనుగోలుదారులకు బైకులను అందించనున్నది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద మహీంద్రాకు ఉన్న ప్లాంట్లోనే ఏడాదికి 5 లక్షల బైకులను ఉత్పత్తి చేస్తున్నది.

ఈవీలపై మహీంద్రా దృష్టి

2020 నాటికి వెయ్యి కోట్లు పెట్టుబడి
Mahindra
విద్యుత్‌తో నడిచే వాహనాలపై మహీంద్రా గ్రూపు ప్రత్యేక దృష్టి సారించింది. 2020 నాటికి రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేయోచనలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ యున్నది. సరికొత్త ట్రియో, ట్రియో యారి వాహనాలను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ పవన్ గోయెంకా మాట్లాడుతూ..విద్యుత్‌తో నడిచే వాహనాలకు పెద్దపీట వేస్తున్నట్లు, దీంట్లోభాగంగా వచ్చే రెండేండ్లలో వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకుముందు ఆయన రూ.100 కోట్ల పెట్టుబడితో బెంగళూరులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ టెక్నాలజీ తయారీ హబ్‌ను ప్రారంభించారు. ఈవీలకోసం ఇప్పటికే రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడం జరిగిందని, మరో రెండేండ్లలో మిగతా రూ.500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఈ నూతన యూనిట్ అందుబాటులోకి రావడంతో ఈవీల తయారీ సామర్థ్యం 25 వేల యూనిట్లకు చేరుకోనున్నది. ఈవీల వాడకం భారీగా పెరిగితే భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆయన..ఎంతమేర తగ్గేదానిపై స్పందించడానికి నిరాకరించారు. గురువారం విడుదల చేసిన ఈవీ ఆటో ప్రారంభ ధర రూ.1.36 లక్షలుగా నిర్ణయించింది.

మోదీ సర్కార్‌పై గోయెంకా ప్రశంసలు: మోదీ సర్కార్‌పై గోయెంకా ప్రశంసల జళ్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు పెద్దపీట వేస్తుండటం, ముఖ్యంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ), మేక్ ఇన్ ఇండియా వంటి విప్లవాత్మక నిర్ణయాలు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియాతో తయారీ రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు, పన్నుల చట్టాన్ని పూర్తిగా మార్చివేసిన జీఎస్టీతో సులభంగా వ్యాపారం చేయడానికి వీలు పడిందన్నారు.

2611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS