మహీంద్రా లాభాల్లో నిస్తేజం

Sat,February 9, 2019 12:22 AM

Mahindra And Mahindra Q3 standalone PAT down 11.44Percent

-క్యూ3లో 11 శాతం తగ్గిన ప్రాఫిట్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలానికి సంస్థ రూ.1,076.81 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,215.89 కోట్ల లాభంతో పోలిస్తే 11.44 శాతం క్షీణత కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.11,676.05 కోట్ల నుంచి రూ.13,411. 29 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 1,33,508 యూనిట్ల వాహనాల విక్రయాలు జరిపింది. గతేడాది ఇదే కాలానికి విక్రయించిన 1,21,786 యూనిట్లతో పోలిస్తే పది శాతం పెరిగింది. గడిచిన త్రైమాసికంలో పండుగ సీజన్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో నిస్తేజం నెలకొన్నదని, ఇండస్ట్రీ వర్గాల అంచనాలకు కూడా చేరుకోలేక పోయిందని, ముఖ్యంగా పట్టణాల్లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రూపాయితోపోలిస్తే డాలర్ మరింత బలపడటం, చమురు ధరలు, స్టాక్ మార్కెట్ల పనితీరు నిరుత్సాహంగా ఉండటంతో దేశ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చిత పరిస్థితులకు కారణమైందని, దీంతో ఆటోమొబైల్ రంగంపై సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని పేర్కొంది. అలాగే ట్రాక్టర్ల విక్రయాలు 13 శాతం పెరిగి 87,036 యూనిట్లకు చేరుకోగా.. 12,363 యూనిట్ల వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో కంపెనీ షేరు ధర భారీగా పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 2.64 శాతం తగ్గి రూ.683 వద్ద ముగిసింది.

626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles