స్థూల ఆర్థికాంశాలు కీలకం

Mon,September 9, 2019 12:22 AM

Macroeconomics is Crucial

-మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్న ఐఐపీ, ద్రవ్యోల్బణం
-మంగళవారం ఈక్విటీ మార్కెట్లకు సెలవు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశీయ స్థూల ఆర్థికాంశాలు ఈవారం స్టాక్ మార్కెట్లకు కీలకంకాబోతున్నాయి. ఈవారంలో విడుదలకానున్న పారిశ్రామిక వృద్ధిరేటు, ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూసివేసివుంచనుండటంతో ఈవారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరుగనున్నది. పారిశ్రామిక వృద్ధిరేటుతోపాటు తయారీ రంగ గణాంకాలు, ద్రవ్యోల్బణ సూచీల ఆధారంగా ఈక్విటీలు ట్రేడింగ్ కానున్నాయని ఎపిక్ రీసర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ తెలిపారు. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కొంత ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు మొగ్గుచూపడం స్టాక్ మార్కెట్లపై ఆశావాద పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదన్నారు. గురువారం ఐఐపీ, ద్రవ్యోల్బణం, తయారీ రంగ గణాంకాలు విడుదలకానున్నాయి. వాణిజ్య యుద్ధంపై అమెరికా-చైనా దేశాల మధ్య చర్చలు వచ్చే నెలలో జరుగనుండటం మార్కెట్లకు ఊరటనిచ్చే అంశమని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ఈ రంగ షేర్లు లైమ్‌లైట్‌లోకి రావచ్చునన్నారు. వాహన సంస్థలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు, జీఎస్టీ తగ్గింపుపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనున్నదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య లు మార్కెట్లకు ఊతమివ్వనున్నాయన్నారు. వీటితోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అంశాలని ఆయన పేర్కొన్నారు.

భారీగా నష్టపోయిన బ్లూచిప్ సంస్థలు

స్టాక్ మార్కెట్ల పతనంతో బ్లూచిప్ సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను భారీగా కోల్పోతున్నాయి. గడిచిన వారంలో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీలతోపాటు టాప్-10లోని ఆరు సంస్థలు నికరంగా రూ.87,973 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు తమ ఎం-క్యాప్‌ను కోల్పోగా..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐలు లాభపడ్డాయి.

సర్చార్జి ఎత్తివేసినప్పటికీ...కొనసాగుతున్న ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణ

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులపై విధించిన సర్చార్జిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధుల ఉపసంహరణ ఆగడం లేదు. ప్రస్తుత నెల తొలివారంలోనూ ఎఫ్‌పీఐలు దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.1,263 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. తాజాగా డిపాజిటరీ వద్ద ఉన్న నివేదిక ప్రకారం ఈ నెల 3 నుంచి 6 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.4,263.79 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ), ఇదే సమయంలో డెబిట్ మార్కెట్లలో రూ.3,000.86 కోట్ల నిధులను చొప్పించారు. నికరంగా రూ.1,262.93 కోట్లు ఉపసంహరించుకున్నట్లు అయింది. ఈ నెల 2న వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు పనిచేయలేవు. ఆగస్టులో 5,920.02 కోట్లను వెనక్కితీసుకున్న ఎఫ్‌పీఐలు..జూలైలోనూ రూ.2,985.88 కోట్లను తరలించుకుపోయారు. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటంతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఆందోళను పెంచిందని, దేశ వృద్ధిరేటు కూడా నిరాశావాదంగా ఉండటం మదుపరుల్లో ఆందోళనను మరింత పెంచిందని గ్రౌవ్ సీవోవో హర్ష జైన్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నాటి నుంచి ఇప్పటివరకు రూ.30 వేల కోట్ల పెట్టుబడులను విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్నారు.

187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles