చిన్న కార్లు ప్రియం


Sat,May 20, 2017 12:17 AM

దిగిరానున్న లగ్జరీ కార్లు, హై ఎండ్ బైకుల ధరలు
న్యూఢిల్లీ, మే 19:వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమలుతో చిన్న కార్లు మరింత ప్రియం కానున్నాయి. ప్రస్తుత స్థాయితో పోలిస్తే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ) ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ద్విచక్ర వాహన దారులకు సైతం ధరాభారం నుంచి కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ప్యాసింజర్ కార్లన్నింటిపైనా 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. కార్ల కేటగిరీని బట్టి జీఎస్టీ రేటుకు అదనంగా విధించే సుంకం రేటు మాత్రం మారుతుంది.
Maruti-Suzuki
- నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడువు ఉండి, 1200 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ కార్లపై 28 శాతం జీఎస్టీ రేటుతోపాటు 1 శాతం సెస్సు వర్తిస్తుంది.
- అదే 1500 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన డీజిల్ స్మాల్ కార్లపై గరిష్ఠ జీఎస్టీ రేటుకు అదనంగా 3 శాతం సుంకం వర్తిస్తుంది. దీన్ని బట్టి చూస్తే, జీఎస్టీ హయాంలో చిన్న కార్లు కొనాలంటే అదనపు మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చని విశ్లేషకులంటున్నారు.
- మధ్యస్థాయి కార్లు, ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లపై గరిష్ఠ జీఎస్టీ రేటుతోపాటు 15 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎస్‌యూవీలపై పన్ను రేట్లు 41.5 శాతం నుంచి 44.5 శాతం స్థాయిలో ఉన్నాయి. ఇందుకుతోడు 27-30 శాతం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. అదే జీఎస్టీ హయాంలో మొత్తంగా 43 శాతం (28 శాతం పన్ను రేటు+15 శాతం సెస్సు) పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అంటే ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
- జీఎస్టీ హయాంలో 1500 సీసీ కంటే అధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ కార్లకూ 15 శాతం సెస్సు వర్తింపజేశారు. దీంతో హైబ్రిడ్ కార్లు కూడా ప్రియం కానున్నాయి.
- జీఎస్టీ అమలయ్యాక హై ఎండ్ బైకులపై పన్ను భారం ప్రస్తుత స్థాయి కంటే తగ్గొచ్చు. ఎందుకంటే, 350 కంటే అధిక సామర్థ్యం కలిగిన మోటార్ సైకిళ్లపై 28 శాతం జీఎస్టీ రేటుతోపాటు 3 శాతం సుంకం విధించనున్నారు. అంటే మొత్తం పన్ను రేటు 31 శాతం. ప్రస్తుతం ద్విచక్ర వాహన రంగం 13 రకాల పన్నులు చెల్లించాల్సి వస్తున్నదని, దాంతో మొత్తం పన్ను రేటు 28-35 శాతంగా ఉంది.
Macpcslide

మొబైళ్లు, కంప్యూటర్ల ధరలు పైకి


జీఎస్టీ హయాంలో గ్యాడ్జెట్లు ప్రియం కానున్నాయి. మొబైళ్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, డీటీహెచ్, ఇంటర్నెట్ సర్వీసుల ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో తయారవుతున్న ఫోన్లపై ప్రస్తుతం పన్ను 7.5-8 శాతం స్థాయిలో ఉంది. కానీ జీఎస్టీ అమలులోకి వచ్చాక 12 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం టీవీలు, ల్యాప్‌టాప్‌లపై 26.5 శాతం వరకు పన్ను చెల్లిస్తుండగా.. కంప్యూటర్లపై పన్ను 10.3 శాతంగా ఉంది. కానీ, జీఎస్టీ హయాంలో టీవీలు, కంప్యూటర్లకు సంబంధించిన కొన్ని విడిభాగాలు 18 శాతం శ్లాబులో, మరికొన్ని 28 శాతం పన్ను శ్లాబులో ఉన్నాయి. దీంతో ఈ మూడు రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం గేమింగ్ కన్సోల్స్, గేమ్స్‌పై 28.5 శాతం సుంకం వర్తిస్తుంది. జీఎస్టీ హయాంలోనూ వీటిని గరిష్ఠ పన్ను శ్లాబులో (28 శాతం) చేర్చారు. కాబట్టి ధరల్లో మార్పు ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.

వాహన డిమాండ్‌కు ఊతం: సియామ్


వాహనాలపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) స్వాగతించింది. కొత్త చట్టం హయాంలో పన్ను రేట్లు వాహన రంగంలో డిమాండ్ పెరుగుదలకు తోడ్పడనున్నాయని పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన రేట్లు ఆటో ఇండస్ట్రీ అంచనాలకు తగ్గట్లుగానే ఉన్నాయని, దాదాపు అన్ని విభాగాలకు చెందిన వాహనాలపై పన్ను భారం తగ్గిందని సియా మ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి అభిప్రాయపడ్డారు. అధిక పన్నుల భారం ఎదుర్కొంటున్న విభాగాలకు ఊరట కల్పించడం ద్వారా పన్నురేట్ల స్థిరీకరణను కొనసాగించగలగడంలో కేంద్రం సఫలమైందని దాసరి పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు భిన్న జీఎస్టీ రేట్లను నిర్ణయించడం ద్వారా మున్ముందు దేశంలో ఈ విభాగ వెహికిల్స్‌కు డిమాం డ్ పెరుగవచ్చన్నారు. హైబ్రి డ్ వాహనాలకు కూడా భిన్న జీఎస్టీ రేట్లను నిర్ణయిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ వాహనాలపై గరిష్ఠ పన్నురేటుతోపాటు 15 శాతం సుంకం వర్తించనుంది. లగ్జరీ వాహనాలకు సమానంగా హైబ్రిడ్ కార్లపై సుంకం విధించడం పర్యావరణ ప్రతికూల, తిరోగమన చర్య అని ఆటో ఇండస్ట్రీ తీవ్రం గా స్పందించింది. పర్యావరణరహిత వాహనాలను ప్రోత్సహించేందుకు అవరోధంగా మారనుందని పేర్కొంది. ఈ పరిణామాన్ని అంచనా వేయలేదన్న దాసరి.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరారు.
gst

ఎఫ్‌ఎంసీజీ రంగ వినిమయానికి సానుకూలం


జీఎస్టీ అమలుతో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) రంగ ఉత్పత్తుల వినిమయం మరింత పుంజుకోనుందని ఆ రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అయితే, గృహ సంబంధిత ఉత్పత్తులు, షాంపూలు మాత్రం కాస్త ప్రియం కానున్నాయని వారన్నారు. ఎందుకంటే, ఈ రెండు విభాగ ఉత్పత్తులను 28 శాతం పన్ను శ్లాబు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎఫ్‌ఎంసీజీ విభాగ ఉత్పత్తులపై నిర్ణయించిన జీఎస్టీ రేట్లను ఇండస్ట్రీ వర్గాలు స్వాగతించారు. జీఎస్టీ రేట్లు ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపబోవని మ్యారికో ఎండీ, సీఈవో సౌగతా గుప్తా అన్నారు. కొత్త చట్టం హయాంలో వస్తు వినిమయం మరింత పెరుగడంతోపాటు దీర్ఘకాలంపాటు నిలకడైన వృద్ధి సాధించేందుకు దోహదపడనుందన్నారు.

9 నెలలు పరిశీలన కాలంగా పరిగణించండి: సీఏఐటీ


జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేశాక మొదటి తొమ్మిది నెలలను పరిశీలన కాలంగా (ట్రయల్ పీరియడ్) పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) సూచించింది. ట్రయల్ పీరియడ్‌లో విధానపరమైన తప్పులు దొర్లిన పక్షంలో వ్యాపార సంస్థలపై దండనాత్మక చర్యలు మాత్రం చేపట్టవద్దని అసోసియేషన్ కోరింది. పలు వస్తు, సేవలపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లను మొత్తంగా చూస్తే సముచిత స్థాయిలోనే ఉన్నాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ పేర్కొన్నారు.

నిలకడ సాధించేందుకు 6 నెలలు పట్టొచ్చు: క్రిసిల్


జీఎస్టీ అమలయ్యాక కొత్త విధానాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకునేందుకు ఆరు నెలల సమయం పట్టొచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంటున్నది. జీఎస్టీ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేందుకు 1-3 ఏండ్ల సమయం పట్టొచ్చని అభిప్రాయపడింది.

ఆయుర్వేద ఉత్పత్తులపై అధిక పన్నా?: డాబర్


ఆయుర్వేద ఔషధాలు, ఉత్పత్తులపై 12 శాతం పన్ను విధించడంపై ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ డాబర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయుర్వేద ఇండస్ట్రీపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. సంప్రదాయక, ప్రత్యామ్నాయ ఔషధాలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి జీఎస్టీ రేట్లు భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. 132 ఏండ్ల చరిత్ర కలిగిన సంస్థ డాబర్.. 250కి పైగా హెర్బల్, ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తున్నది.
vinod-dasar

ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉండకపోవచ్చు: ఇక్రా


జీఎస్టీ రేట్లు ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటున్నది. కాబట్టి వచ్చేనెల 7న జరుగబోయే ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచే ప్రమాదమేమీ లేదని తాజాగా విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. జీఎస్టీ, రుతు పవనాల విషయంలో నెలకొన్న ఆందోళనలు సద్దుమణిగినప్పటికీ.. మరింత స్పష్టత వచ్చే వరకు వడ్డీరేట్లపై వైఖరిని తటస్థ స్థాయిలోనే కొనసాగించవచ్చని ఇక్రా అభిప్రాయపడింది.

ఆతిథ్య రంగంపై చావు దెబ్బ


పెద్ద నోట్ల రద్దు, జాతీయ రహదారుల వెంట మద్య నిషేధం వంటి నిర్ణయాల కారణంగా ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ఆతిథ్య రంగం పాలిట గరిష్ఠ స్థాయి జీఎస్టీ రేట్లు మరణ శాసనమేనని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. గరిష్ఠ స్థాయి వడ్డీరేట్ల కారణంగా పర్యాటక రంగంలో భారత్ వెనుకబడిపోతుందని, విదేశీ పర్యాటకులు మన దేశానికి వచ్చేందుకు అంతగా ఆసక్తి కనబర్చకపోవచ్చని వారన్నారు.

456

More News

VIRAL NEWS