ఒడిదుడుకుల్లో సూచీలు!

Mon,July 22, 2019 03:18 AM

 Losers in NSE And BSE Stock Market

-డెరివేటివ్, రూపాయి, ఇంధన ధరలు కీలకం
-కార్పొరేట్ల ఫలితాలు కూడా..

న్యూఢిల్లీ, జూలై 21: గతవారంలో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఈవారంలోనూ మరింత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలైన హెచ్‌యూఎల్, మారుతి సుజుకీ, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లు విడుదల చేయనున్న ఆర్థిక ఫలితాలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని, వీటికితోడు డెరివేటివ్ కాంట్రాక్టు గడువు కూడా ఈ వారంలోనే ముగియనుండటం మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. గతవారంలో కార్పొరేట్ నిరుత్సాహక ఫలితాలు, పన్నులకు సంబంధించిన సమస్యలు, వినిమయం మందకొడి పరిస్థితులు ట్రేడింగ్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో గత శుక్రవారం ఒకేరోజు 560 పాయింట్లు పడిపోయి ప్రస్తుత సంవత్సరంలో రెండో అతిపెద్ద పతనం చెందింది.

పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో విదేశీ పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆందోళన మొత్తం మార్కెట్లపై ప్రభావం పడింది. దీంతో గతవారంలో ఏకంగా రూ.7 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తరలించుకుపోవడం దేశీయ మదుపరుల్లో ఆందోళనను పెంచింది. గతవారం చివర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకుమించి నమోదు చేసుకోవడం సోమవారం ట్రేడింగ్ సరళిని డిసైడ్ చేయనున్నదని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. వీటితోపాటు దేశీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా మార్కెట్లకు ప్రభావితం చేసే అంశాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 6.8 శాతం ఎగబాకి రూ.10,104 కోట్లుగా నమోదైంది. చమురు మార్జిన్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, రిటైల్, టెలికం రంగాలు ఇచ్చిన దన్నుతో విశ్లేషకుల అంచనాలకుమించి ఫలితాలను నమోదు చేసుకున్నది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం కూడా 18.04 శాతం అధికమై రూ.5,676.06 కోట్లకు చేరుకున్నది.

ఈక్విటీ మార్కెట్లు మరికొన్ని రోజులు దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలున్నాయని, జూలై 30-31న అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశం, ఇప్పుడిప్పుడే వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తుండటం, ఆటో, బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండటం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో అరుణ్ తుక్రల్ తెలిపారు. ఈవారంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్, కొటక్ మహీం ద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటర్స్, బజాజ్ ఆటో, మారుతిలు ఫలితాలను ప్రకటించబోతున్నాయి. కార్పొరేట్లు ఆశించిన స్థాయిలో ఫలితాలు ప్రకటిస్తే మార్కెట్లు దూసుకుపోనున్నాయని, లేకపోతే పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. గతవారంలో సెన్సెక్స్ 399.22 పాయింట్లు పతనం చెంది 38,337.01 వద్ద ముగిసింది. శుక్రవారం ఒక్కరోజే 560.45 పాయింట్లు దిగజారింది. వీటితోపాటు చమురు ధరల శ్రేణి, రూపాయి కదలికలు, పెట్టుబడుల సరళి కూడా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

బ్లూ-చిప్ సంస్థలకు నిరాశే..

గతవారం బ్లూ-చిప్ సంస్థలకు నిరాశే మిగిల్చింది. టాప్-10 సంస్థల్లో ఆరింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.62,147.70 కోట్లు కోల్పోయాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌లు అత్యధికంగా నష్టపోయాయి. వీటితోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు నష్టపోగా, కేవలం హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లు మాత్రం తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను పెంచుకున్నాయి. గత వారంలో ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ.20,031 కోట్లు తగ్గి రూ. 7,91,750.71 కోట్లకు జారుకోగా, టీసీఎస్ ఎం-క్యాప్ రూ.11,632.40 కోట్లు తగ్గి రూ.7,79,351.54 కోట్లకు పడిపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.10,928 కోట్లు కోల్పో గా, ఐటీసీ రూ.8,035.26 కోట్లు, ఎస్బీఐ రూ.6,738.08 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.4,782.42 కోట్లు తగ్గాయి. కానీ ఇన్ఫోసిస్ అత్యధికంగా రూ.25,125.99 కోట్లు పెరిగి రూ.3,37,418.53 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ రూ.8,152.05 కోట్లు పెరుగగా, కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ.2,990.49 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.2,489.52 కోట్లు చొప్పున బలపడ్డాయి.

ఎఫ్‌పీఐల పెట్టుబడులకు బ్రేక్

జూలైలో ఈక్విటీల నుంచి రూ.7,712 కోట్లు వెనక్కి
USD-INR
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనను మరింత పెంచింది. వరుసగా ఐదు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ..ప్రస్తుత నెలలో భారీగా తరలించుకుపోయారు. సంపన్న వర్గాలపై అధిక పన్ను విధించడం, విదేశీ పెట్టుబడులకు ఎలాంటి రాయితీలు ఇచ్చే అవకాశాలు లేవని మంత్రి స్పష్టం చేయడంతో ఎఫ్‌పీఐల్లో ఆందోళన మరింత పెరిగింది. దీంతో ప్రస్తుత నెల 1 నుంచి 19 వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.7,712.12 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో డెబటి మార్కెట్లలో రూ.9,371.12 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం. నికరంగా ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు రూ.1,659 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు అయింది.

బడ్జెట్‌లో సంపన్న వర్గాలపై పన్ను ప్రతిపాదన విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచిందని, దీంతో వారు పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి మొగ్గుచూపారని మార్నింగ్‌స్టార్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. వీటికితోడు కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు, దేశ జీడీపీ మందగించడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఏడీబీ వృద్ధి అంచనాల్లో కోత విధించడం తదితర అంశాలు కూడా పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి కారణాలని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఎఫ్‌పీఐలు పెద్దగా చొరవ చూపించినట్లు అనిపించడం లేదని చెప్పారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా తమవంతు పాత్ర పోషించాయి.

223
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles