వెంటాడిన ద్రవ్యోల్బణం

Thu,December 7, 2017 12:47 AM

Liquidity is and will remain comfortable RBI

-నిరాశపరిచిన ఆర్బీఐ ద్రవ్యసమీక్ష
-కీలక వడ్డీరేట్లు యథాతథం
-6.7 శాతం వద్దే వృద్ధిరేటు అంచనా
liquidity
ముంబై, డిసెంబర్ 6:ఊహించినట్లుగానే ద్రవ్యోల్బణం ఆందోళనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్షను ప్రభావితం చేశాయి. కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఈసారి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను ఆర్బీఐ ముగించింది. రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను 6 శాతం వద్దే, రివర్స్ రెపో రేటు (ఆర్బీఐకి ఇచ్చిన రుణాలపై వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీరేటు)ను 5.75 శాతం వద్దే ఉంచింది. ఆరుగురు సభ్యులున్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)లో రవీంద్ర హెచ్ దోలాకియా మాత్రమే పావు శాతం వడ్డీరేట్ల కోతకు మద్దతు పలుకగా, మిగతా వారంతా కూడా దానికి విభేదించారు. ఫలితంగా గృహ, ఆటో రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తాయన్న ఆశలు ఆవిరయ్యాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 6.5 శాతంగా ఉంచినట్లు ఆర్బీఐ ఈ సందర్భంగా తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో ద్రవ్యోల్బణం అంచనాను 4.2-4.6 శాతం నుంచి 4.3-4.7 శాతానికి పెంచిన ఆర్బీఐ.. వృద్ధిరేటు అంచనాను మాత్రం యథాతథంగా 6.7 శాతంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతానికి జీడీపీ పుంజుకున్న విషయం తెలిసిందే.

అయినప్పటికీ ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజులు సమావేశమైన ఎంపీసీ మాత్రం ఈసారి జీడీపీ అంచనాల్ని సవరించకపోవడం గమనార్హం. కాగా, ద్రవ్యోల్బణంపై కమిటీ మాట్లాడుతూ..వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మధ్యంతర లక్ష్యాన్ని సాధించడానికి కఠిన నిర్ణయాలు తప్పట్లేదు. ఆహార, ఇంధన ధరలు, ఇంటి అద్దెలు పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం చేసిన సిఫార్సుల్లో హౌసింగ్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ)ను పెంచడం, వచ్చే ఏడాది వరకు ఉత్పత్తి పరిమితంగానే ఉండాలన్న ఒపెక్ దేశాల నిర్ణయం.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెంపునకు దారి తీస్తుండటం వంటివి ద్రవ్యోల్బణం లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి అన్నది. ఇక బ్యాంకులకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయంపై పటేల్ స్పందిస్తూ..ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరిన్ని సంస్కరణలకు ఇది దోహదపడనుందన్నారు. మరోవైపు ఏఏఏ- రేటింగ్ కార్పోరేట్ కంపెనీల ఫారెక్స్ లోన్ల రీఫైనాన్స్‌కు దేశీయ బ్యాంకుల విదేశీ శాఖలకు ఆర్బీఐ అనుమతినివ్వడం పట్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రైవేట్ రంగ పెట్టుబడులకు ఊతమిస్తుందని, మొండి బకాయిల బెడదను తగ్గిస్తుందని ఎస్‌బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ అభిప్రాయపడ్డారు.
digital

డిజిటల్ లావాదేవీలకు ఊతం

నగదేతర (డిజిటల్) లావాదేవీలకు ఊతమిచ్చేలా డెబిట్ కార్డు లావాదేవీలపై చార్జీలను హేతుబద్దీకరించింది ఆర్బీఐ. చిరు వ్యాపారులు సైతం నగదుకు బదులుగా కొనుగోలుదారుల నుంచి డెబిట్ కార్డు చెల్లింపులను స్వీకరించేలా వ్యాపారి రాయితీ రేటు (ఎండీఆర్)ను సవరించింది. రూ.20 లక్షల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారులు ఆన్‌లైన్ లావాదేవీలు లేదా పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్ల ద్వారా డెబిట్ కార్డులపై జరిపే ఒక్కో లావాదేవీకి రూ.200 పరిమితి వరకు 0.40 శాతంగా ఎండీఆర్ చార్జీని నిర్ణయించింది. రూ.20 లక్షలు మించి వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులకు రూ.1,000 వరకు ఎండీఆర్ చార్జీని 0.90 శాతంగా ప్రకటించింది. జనవరి 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తొలినాళ్లలో నగదు కొరత కారణంగా పుంజుకున్న డిజిటల్ లావాదేవీలు.. తిరిగి కరెన్సీ చలామణి పెరుగడంతో నానాటికీ తగ్గిపోతున్న విషయం తెలిసిందే.
fiscal

ఆర్థిక లక్ష్యాలపై జాగ్రత్త

కొన్ని రాష్ర్టాలు వ్యవసాయ రుణాలను రద్దు చేస్తుండటం, పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్), ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుండటం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో గరిష్ఠ స్థాయి శ్లాబులనుంచి వివిధ రకాల వస్తువులను దిగువ స్థాయి శ్లాబుల్లోకి చేర్చుతుండటం వంటివి ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయని, ఇది ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. ముఖ్యంగా జీఎస్టీ వసూళ్లు పడిపోతున్నాయని, ఈ క్రమంలో ప్రభుత్వ ఆదాయం తగ్గడం, వ్యయం పెరిగిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యపరమైన లక్ష్యాల సాధనకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని కేంద్రానికి సూచించింది.

ముఖ్యాంశాలు

-రెపో రేటు 6 శాతమే
-రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా కొనసాగింపు
-మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 6.25%
-క్యూ-3లో 4.3 శాతానికి, క్యూ-4లో 4.7 శాతానికి పెరిగిన ద్రవ్యల్బోణ అంచనా.
-ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7% వృద్ధిరేటు అంచనా యథాతథం
-ఫిబ్రవరి 6,7న ద్రవ్య పరపతి తదుపరి సమావేశం

పారిశ్రామిక రంగం అసంతృప్తి

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం నిరాశ కలిగించింది. వృద్ధిరేటుకు దోహదపడేలా ఆర్బీఐ నిర్ణయాలుంటాయని ఆశించాం. వడ్డీరేట్లను తగ్గిస్తే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఉండేది
- సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ
ఆర్బీఐ ద్రవ్యసమీక్షను ద్రవ్యోల్బణం ప్రభావితం చేసింది. జీడీపీ మరింత పెరుగడానికి ఉన్న అవకాశాలు చేజారాయి. పెట్టుబడుల వ్యయం తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది
- అసోచామ్ అధ్యక్షుడు సందీప్ జజోడియా
ఎగుమతిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల్లో ఆర్బీఐ మమేకం కావాల్సి ఉంది. వడ్డీరేట్లను తగ్గిస్తే మరింత ద్రవ్యలభ్యత ఉండేది
- ఈఈపీసీ ఇండియా చైర్మన్ టీఎస్ భాసిన్
వడ్డీరేట్లు తగ్గితే నిర్మాణ రంగంలో కొనుగోళ్లకు అవకాశాలు పెరిగేవి. గృహ రుణాలపై నెలసరి వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం తగ్గేది
- క్రెడాయ్ ఉపాధ్యక్షుడు మనోజ్ గౌర్

535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS