కుంభమేళాతో కాసుల పంట

Mon,January 21, 2019 01:27 AM

Kumbh mela 2019 300 high tech tents are made in tent city prayagraj

-ఉత్తరప్రదేశ్‌కు రూ.1.2 లక్షల కోట్లదాకా ఆదాయం: సీఐఐ అంచనా
-త్రివేణి సంగమ పరిసరాల్లో ఆవిష్కృతమైన టెంట్ సిటీ

ప్రయాగ్‌రాజ్ (యూపీ), జనవరి 20: కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న కుంభమేళా.. ఉత్తరప్రదేశ్‌కు కాసుల వర్షాన్నే కురిపిస్తున్నది. అశేష భక్తజనంతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం పరిసరాలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు రంగాల్లో వేల కోట్ల రూపాయల లావాదేవీలను జరిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి ఉత్తరప్రదేశ్‌కు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం రావొచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ అంచనా వేస్తున్నది. మునుపెన్నడూ లేనివిధంగా యూపీ సర్కారు..ఈ ఆధ్యాత్మిక, మతపరమైన వేడుకకు ఘనమైన ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15న మొదలైన ఈ మెగా కుంభమేళా.. మార్చి 4దాకా జరుగనున్నది. దీంతో కుంభమేళా నిర్వహణకుగాను ఏకంగా రూ.4,200 కోట్లను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేటాయించింది. 2013తో పోల్చితే ఇది మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. కాగా, వివిధ రంగాల్లోని మొత్తం 6 లక్షలకుపైగా మందికి ఈ కుంభమేళాతో ఉపాధి దక్కిందన్న సీఐఐ.. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో ఒక్క ఆతిథ్య రంగంలోనే 2.50 లక్షల మందికి పని దొరికిందని పేర్కొన్నది. ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్‌ల్లో దాదాపు 1.50 లక్షల మందికి, పర్యాటక రంగంలో సుమారు 45 వేల మందికి ఉద్యోగాలు లభించాయని తమ నివేదికలో సీఐఐ వెల్లడించింది. ఎకో-టూరిజం, మెడికల్ టూరిజంలలోనూ 85,000 మందికి ఉపాధి దక్కినట్లు తెలుస్తున్నది. టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్లు, వాలంటీర్లతో కూడిన అసంఘటిత రంగంలో మరో 55,000 వరకు కొత్త ఉద్యోగాలు వచ్చాయంటున్నది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఏజెన్సీలకు, ప్రైవేట్ రంగ వ్యాపారులకు కాసుల పంటే పండుతున్నదని సీఐఐ అభిప్రాయపడింది.

కొలువుదీరిన టెంట్ సిటీ


కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాలు న్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ వద్ద 32 చదరపు కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కారు ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని నిర్మించింది. ఈ టెంట్ సిటీలో టాయిలెట్లు, హోటల్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. ఈ నగరంలో 4 వేలకుపైగా టెంట్లు, 40 వేలకుపైగా ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఇక 3,200 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన కుంభమేళా ప్రాంతంలో 250 కిలోమీటర్ల స్థాయిలో రోడ్లు, 22 బల్లకట్టు వంతెనలను ఏర్పాటు చేశారు. 9 రైల్వే స్టేషన్లను ఆధునీ కరించిన ప్రభుత్వం.. కొత్త ఎయిర్ పోర్టు టర్మినల్‌నే అలహాబాద్ లో నిర్మించడం విశేషం.

పొరుగు రాష్ర్టాలకూ పండుగే


ఉత్తరప్రదేశ్ పొరుగు రాష్ర్టాలకూ పండుగ వాతావరణం వచ్చింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలకూ పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్నది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు రద్దీ పెరుగగా, వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నట్లు సీఐఐ తాజా అధ్యయనం తేటతెల్లం చేస్తున్నది.
prayag-ganga

ఆతిథ్య రంగానికి జోష్


ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోగల త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న కుంభమేళాకు దేశం నలుమూలల నుంచేగాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచీ భక్తజనం పోటెత్తుతున్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, మారిషస్, జింబాబ్వే, శ్రీలంక తదితర దేశాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆతిథ్య రంగం ఒక్కసారిగా ఊపందుకున్నది. కుంభమేళా పరిసర ప్రాంతాల్లో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ రంగ సంస్థలు అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లనే చేశాయి. వారి విడిది కోసం తాత్కాలికంగా లగ్జరీ సదుపాయాలను కల్పించాయి. టెంట్లు వేసి సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన గదులకు ఒక్కరోజుకుగాను ప్రభుత్వం కనిష్ఠంగా రూ.2,500, గరిష్ఠంగా రూ.10,000 అద్దె వసూలు చేస్తున్నది. బెడ్, బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యాలను అందిస్తున్నది. ఇక ప్రైవేట్ రంగ సంస్థలైతే ఒక్క రాత్రికి ఏకంగా రూ.32,000 చార్జ్ చేస్తుండటం గమనార్హం. చలి తీవ్రత మధ్య ఎయిర్ కండీషనర్ రూమ్స్‌ను అందుబాటులో ఉంచాయి. 50 రోజులపాటు ఈ కుంభమేళా జరుగనుండటంతో విదేశాల నుంచి వచ్చినవారు ఇక్కడే ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో హోటల్ యజమానుల ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది.

2827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles