స్టాక్ మార్కెట్లకు కర్ణాటక షాక్

Wed,May 16, 2018 12:27 AM

Karnataka shock for stock markets

-ఆరంభ లాభాలు ఆవిరి
-ఫలితాల సరళి ఆధారంగా నష్టాల్లోకి

karnataka
ముంబై, మే 15: దేశీయ స్టాక్ మార్కెట్లకు కన్నడిగులు షాకిచ్చారు. మంగళవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈక్విటీ ట్రేడింగ్‌పై ప్రస్ఫుటంగా కనిపించింది. ఉదయం బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందన్న అంచనాల మధ్య భారీ లాభాల్లో కదలాడిన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ మారుతున్న ఫలితాల సరళి ఆధారంగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో ఆరంభ లాభాలు కాస్తా ఆవిరైపోయాయి. మెజారిటీకి కొద్ది దూరంలో బీజేపీ ఆగిపోగా, కాంగ్రెస్, జేడీఎస్‌ల చేతికి అధికారం వెళ్లే సంకేతాలు రావడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ట్రేడింగ్ మొదట్లో ఒకానొక దశలో సెన్సెక్స్ 436 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్లు ఎగిశాయి. అయితే కన్నడనాట ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండట్లేదన్న వార్తలు వస్తున్నకొద్దీ.. ఈ లాభాలు తగ్గుతూపోయాయి. చివరకు 12.77 పాయింట్ల నష్టంతో 35,543.94 వద్ద సెన్సెక్స్, 4.75 పాయింట్లు కోల్పోయి 10,801.85 వద్ద నిఫ్టీ స్థిరపడాల్సి వచ్చింది. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తదితర పరిణామాలూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రియల్టీ, పీఎస్‌యూ, ఇన్‌ఫ్రా, ఆటో, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, పవర్, బ్యాంకింగ్ రంగాల షేర్లు 1.90 శాతం నుంచి 0.11 శాతం మేర నష్టపోయాయి. ముఖ్యంగా ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో అలహాబాద్ బ్యాంక్ షేర్లు దాదాపు 9 శాతం పడిపోయాయి.

68కి రూపాయి విలువ

రూపాయి విలువ 68 మార్కును దాటింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణత కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం 56 పైసలు దిగజారిన దేశీయ కరెన్సీ.. 16 నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఒకానొక దశలోనైతే 68.15 వద్దకు నష్టపోయిన రూపాయి.. చివరకు 68.07 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్లకు డిమాండ్ పెరుగడంతో రూపాయి విలువ అంతకంతకూ తగ్గిపోతున్న విషయం తెలిసిందే.

659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS