ఆర్థిక ఫలితాలతో దిశానిర్దేశం

Mon,July 17, 2017 03:28 AM

June Quarter Earnings To Steer Markets Say Experts

పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నికలపైనా దృష్టి
LiveMint
రిలయన్స్ ఇండస్ట్రీ, విప్రో వంటి దిగ్గజాలతోపాటు ఇతర సంస్థలు విడుదల చేయనున్న మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈవారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి. బజాజ్ ఆటో, ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్, క్రిసిల్, అశోక్ లేలాండ్, జూబ్లియంట్ ఫుడ్, ఆర్‌బీఎల్ బ్యాంక్ కూడా ఈవారంలోనే ఫలితాలు వెల్లడించనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నికలు, రుతుపవనాల పురోగతిపైనా ట్రేడర్లు దృష్టిసారించనున్నారు. వీటితోపాటు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ట్రెండ్‌ను కూడా గమనించాల్సి ఉంటుంది. గతవారంలో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం, ఎగుమతుల గణాంకాలను విడుదల చేసింది.

ఈవారంలో మార్కెట్లను ప్రభావితం చేసే స్థూల ఆర్థికాంశాలేమీ లేవు గనుక మార్కెట్లు ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలు, త్రైమాసిక ఫలితాలపైనే దృష్టిసారించనున్నాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో ఊగిసలాటలు పెరుగవచ్చని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ అభిప్రాయపడ్డారు. ఒకవైపేమో పారిశ్రామికోత్పత్తి భారీగా క్షీణించడం, మరోవైపేమో ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి జారుకొన్న నేపథ్యంలో ఆర్‌బీఐ వచ్చే సమీక్షలో వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు పెరిగాయి.

మున్ముందు సెషన్లలోనూ ఈ అంశం మార్కెట్లకు సానుకూలంగా పరిణమించవచ్చని కొటక్ మ్యూచువల్ ఫండ్ సీఐవో హర్ష ఉపాధ్యాయ అన్నారు.
గతవారంలో వరుసగా నాలుగు సెషన్లపాటు లాభాలబాటలో కొనసాగిన మార్కెట్లో వారాంతం సెషన్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. అయినప్పటికీ వారం మొత్తంగా చూసుకుంటే సెన్సెక్స్ 660.12 పాయింట్లు (2.10 శాతం), నిఫ్టీ 220.55 పాయింట్లు (2.28 శాతం) పెరిగాయి. వారాంతంలో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 32,020 వద్ద, నిఫ్టీ 9,886 స్థాయిల వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లోని టాప్ టెన్ కంపెనీల్లో తొమ్మిదింటి మార్కెట్ విలువ రూ.67,754 కోట్ల మేర పెరిగింది. మార్కెట్ టెక్నికల్స్ విషయానికొస్తే.. మదుపర్లు జాగ్రత్తగా ఉండాలని, ఈ ఒకటి రెండు వారాల్లో సూచీలు దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ రిపోర్టు పేర్కొంది. ఒకవేళ సూచీలు మరింత ఎగబాకితే.. నిఫ్టీ 10వేల సమీపానికి చేరుకోవచ్చని, కానీ ఆ స్థాయిలో ట్రేడర్లు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడవచ్చని నివేదికలో తెలిపింది. మున్ముం దు సెషన్లలో మార్కెట్లు లాభాల్లో కొనసాగినపక్షంలో నిఫ్టీకి 9,970 వద్ద గట్టి నిరోధం ఏర్పడవచ్చని, ఆ స్థాయి గనుక దాటితే పదివేల మైలురాయిని తాకవచ్చని విజయ్ సింఘానియా అంటున్నారు. మార్కెట్లు ఒత్తిడికి లోనైన పక్షంలో సూచీకి 9,820 వద్ద మద్దతు లభించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

ఆరు నెలల్లో ఐపీవోకి 50 ఎస్‌ఎంఈలు

ఈ ఏడాది గడిచిన ఆరు నెలల్లో 50 చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ) పబ్లిక్ ఆఫరింగ్‌కు (ఐపీవో) వచ్చాయి. తద్వారా ఆ సంస్థలు ప్రైమరీ మార్కెట్ నుంచి రూ.660 కోట్ల నిధులు సేకరించగలిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఐపీవోల ద్వారా ఎస్‌ఎంఈల నిధుల సేకరణ మూడింతలకు పైగా పెరిగింది. జనవరి-జూన్ 2016 మధ్యకాలంలో 27 ఎస్‌ఎంఈలు పబ్లిక్ ఇష్యూలో వాటా విక్రయం ద్వారా రూ.211 కోట్లు సేకరించగలిగాయి. గత ఏడాది మొత్తానికి 66 సంస్థలు రూ.540 కోట్లు సమీకరించాయి.

మార్కెట్లోకి మరో11వేల కోట్ల విదేశీ పెట్టుబడులు

ఈనెల మొదటి అర్ధభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి మరో రూ.11,000 కోట్ల పెట్టుబడులు చొప్పించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీఎస్టీ అమలులోకి రావడం విదేశీ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచింది. డిపాజిటరీల వద్దనున్న సమాచారం ప్రకారం.. జూలై 3 నుంచి 14 తేదీల్లో ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో నికరంగా రూ.498 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బాండ్ మార్కెట్లో రూ.10,405 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. దాంతో మొత్తం పెట్టుబడుల విలువ రూ.10,903 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి రూ.1.6 లక్షల కోట్లు చొప్పించారు.

254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles