పోలీసుల సీనియార్టీపై ఉమ్మడి అఫిడవిట్!

Sat,November 9, 2019 12:55 AM

-అధికారుల విభజనపై తాత్కాలిక కేటాయింపులకే ఫైనల్
-రాష్ట్రం పరిధిలోనే పదోన్నతులు ఇవ్వాలని యోచన
-కేంద్రం ఎస్సెల్పీ వేయకుండా రెండు రాష్ట్రాలు నిర్ణయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పోలీస్ అధికారుల విభజన పంచాయితీపై కేంద్రం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ) వేస్తామని చెప్పడంతో అప్రమత్తమైన రెండురాష్ట్రాలు ఒక్కమాట మీదకు వచ్చాయి. పోలీస్ అధికారుల సీనియార్టీ, విభజనపై తాత్కాలిక కేటాయింపులనే ఫైనల్‌చేసుకొని దాని ఆధారంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సీనియార్టీని నిర్ణయించి పదోన్నతులు ఇవ్వడం మంచిదని భావిస్తున్నాయి. ఈ మేరకు అధికారుల సీనియార్టీ, విభజన అంశాలపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 16 కేసుల్లో ఉమ్మడిగా అఫిడవిట్ సమర్పించి పంచాయితీకి ముగింపు పలకాలని నిర్ణయించాయి.

ఇదేవిషయాన్ని రెండురాష్ట్రాలు కేంద్రానికి తెలియజేయనున్నాయి.ఉమ్మడి రాష్ట్రానికి చెందిన నాన్‌కేడర్ పోలీస్ అధికారులైన డీఎస్పీ (సివిల్), అడిషనల్ ఎస్పీ (సివిల్), ఎస్పీ కేటాయింపులు రాష్ట్ర విభజన సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన జరిగాయి. సీనియార్టీల నిర్ణయం జరుగలేదు. అయితే 2017లో తాత్కాలిక జాబితా రూపొందించిన తర్వాత దీనిపై 16 కేసులు పడ్డాయి. ఇప్పటికీ వీటివిచారణ జరుగుతుండగా.. కేసులు తేలేవరకు పదోన్నతులు ఇవ్వవద్దని తెలంగాణ చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తమ అభ్యంతరాలను రికార్డు చేసింది. అయితే, ఆ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోని ఏపీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలకు ముందు సీనియార్టీ లిస్ట్‌ను రూపొందించుకొని 37 మందికి పదోన్నతులు ఇచ్చింది.

కేంద్రం ఎస్సెల్పీ ఫైల్‌చేస్తే

ఏపీ ఇచ్చిన పదోన్నతులపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తన అభ్యంతరాలను తెలియజేసింది. తాత్కాలిక కేటాయింపులు, సీనియార్టీ లిస్ట్‌పై ఈ ప్రభావం పడుతుందని వివరించింది. ఇటీవల హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తాత్కాలిక జాబితా, పదోన్నతులు, కేటాయింపుల ప్రభావం ఎంత? అనేది పరిశీలించాలని కేంద్రహోంశాఖ కార్యదర్శి.. డీఓపీటీని ఆదేశించారు. దీంతోపాటు, రెండురాష్ట్రాల పోలీస్‌శాఖల విభజన, కేటాయంపులపై ఐపీఎస్ అధికారులతో ఏర్పాటుచేసిన కమిటీ కూడా ఉనికి కోల్పోవడంతో ఈ సమస్యకు పరిష్కారంగా సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ ఫైల్‌చేసే విషయాన్ని పరిశీలించాలని కూడా సూచించింది.

కేంద్రం నిర్ణయంతో రెండురాష్ట్రాల అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఒక్కసారి ఎస్సెల్పీ వేస్తే ఈ సమస్య పరిష్కారానికి ఎంతకాలం పడుతుందోనని భావించిన వారు కామన్‌కౌంటర్ అఫిడవిట్ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 2017లో రూపొందించిన తాత్కాలిక జాబితానే తుది జాబితాగా ప్రకటించాలని కోరనున్నారు. అది ఖరారయితే తెలంగాణ, ఏపీలో పనిచేస్తున్న అధికారులకు ఎవరికివారు ప్రత్యేకంగా సీనియార్టీ జాబితాను రూపొందించుకొని పదోన్నతులు ఇచ్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం వస్తుందని రెండురాష్ట్రాలు నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles