పెట్రోల్, డీజిల్ కన్నా విమాన ఇంధనమే చౌక

Fri,October 12, 2018 12:52 AM

Jet fuel is now cheaper than petrol and diesel

-ఏటీఎఫ్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
-లీటర్ పెట్రోల్ రూ.82.36
-లీటర్ ఏటీఎఫ్ రూ.72.60

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: విమాన ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని మూడు శాతం మేర తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వీటి ధరలు 2.6 శాతం మేర తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ కంటే చౌకగా విమాన ఇంధనం లభిస్తున్నది. ఢిల్లీలో కిలోలీటర్(వెయ్యి లీటర్లు) ధర రూ.1,962 లేదా 2.6 శాతం తగ్గడంతో రూ.72,605కి చేరుకున్నది. అంటే సగటున లీటర్ ధర రూ.72.6గా నమోదైంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్, డీజిల్ కంటే ఇదే తక్కువ ధర కావడం విశేషం. అలాగే ముంబైలో విమాన ఇంధనం ధర రూ.74,177 నుంచి రూ.72,225కి తగ్గింది. మార్చి 2014 తర్వాత ఇంతటి స్థాయిలో ధరలు తగ్గడం ఇదే తొలిసారి. జెట్‌ఫ్యూయల్ ధరలు నాలుగేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో విమానయాన పరిశ్రమను ఆదుకోవాలనే ఉద్దేశంతో బుధవారం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై నుంచి ధరలు 9.5 శాతం పెరుగగా, గతేడాది జూలై నుంచి మాత్రం 58.6 శాతం ఎగబాకాయి.

మళ్లీ తగ్గించాలని అడుగం

పెట్రో ధరలపై రాయితీని ఇవ్వాలని మరోసారి చమురు మార్కెటింగ్ సంస్థల్ని అడుగబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిల్లో కదలాడుతుండటంతో ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.1.50 చొప్పున తగ్గించిన కేంద్రం.. చమురు కంపెనీలు రూపాయి చొప్పున రాయితీ ఇచ్చేలా ఒప్పించిన విషయం తెలిసిందే. ఫలితంగా వాహనదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం మధ్య ఎగబాకుతున్న ఇంధన ధరలు.. ఈ సంతోషాన్ని ఆవిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి ధరలు తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థల్ని అడుగబోమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. గత తగ్గింపుతో కేంద్రానికి రూ.10 వేల కోట్లు, చమురు సంస్థలకు మరో రూ.10 వేల కోట్లకుపైగా రాబడి దూరమైనది తెలిసిందే.

aviation_fuel

మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం హైదరాబాద్‌లో లీటర్‌కు 10 పైసలు, 30 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోల్ రూ.87.31 వద్ద, డీజిల్ రూ.81.17 వద్దకు చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు 10 పైసలు ఎగిసి రూ.82.36గా, డీజిల్ 27 పైసలు ఎగబాకి రూ.74.62గా నమోదయ్యాయి. ముంబైలో పెట్రోల్ ధర 9 పైసలు అందుకుని రూ.87.82 గా, డీజిల్ 29 పైసలు పుంజుకుని రూ.78.22గా ఉన్నాయి.

2314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles