ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ కన్నుమూత

Sun,May 12, 2019 12:08 AM

ITC chairman YC Deveshwar passes away

- క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం.. ప్రముఖుల సంతాపం


పేరు: యోగేశ్ చందర్ దేవేశ్వర్ (72)
జననం: 4 ఫిబ్రవరి 1947 లాహోర్ (పాకిస్తాన్)
మరణం: 11 మే 2019 గురుగ్రామ్-ఢిల్లీ
చదువు: మెకానికల్ ఇంజినీరింగ్ (ఐఐటీ ఢిల్లీ)
అవార్డులు: పద్మ భూషణ్


న్యూఢిల్లీ, మే 11: బహుళ వ్యాపార దిగ్గజం ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ కన్నుమూశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు సంతాపం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ ప్రముఖులూ తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న దేవేశ్వర్.. శనివారం ఉదయం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 72 ఏండ్ల దేవేశ్వర్‌కు భార్య, ఓ కుమారుడు, కూమార్తె ఉన్నారు. ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ మృతిపట్ల మేము మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం అని ఐటీసీ ఎండీ సంజీవ్ పూరీ ఓ ప్రకటనలో తెలిపారు. దేవేశ్వర్ కృషి.. ఐటీసీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిందని, అన్ని రంగాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలని ఎప్పుడూ ఆకాంక్షించేవారని అన్నారు.

అంచెలంచెలుగా ఎదుగుతూ..

1968లో ఐటీసీలోకి వచ్చిన దేవేశ్వర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. 1984 ఏప్రిల్ 11న సంస్థ బోర్డులోకి డైరెక్టర్‌గా ప్రవేశించిన ఆయన 1996 జనవరి 1న సీఈవో, చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2017దాకా 21 ఏండ్లపాటు ఇదే హోదాలో ఉండి దేశంలోనే ఓ కార్పొరేట్ సంస్థకు ఎక్కువకాలం సీఈవో, చైర్మన్‌గా పనిచేసిన ఘనతను సాధించారు. 2017 ఫిబ్రవరి 5 నుంచి చైర్మన్, సీఈవో బాధ్యతల్ని ఐటీసీ విభజించగా, నాటి నుంచి దేవేశ్వర్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు. సంజీవ్ పూరీ నాయకత్వంలోని ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్‌కు దిశా-నిర్దేశం చేశారు.

విస్తరణలో మేటి

కేవలం పొగాకు వ్యాపార సంస్థగా ఉన్న ఐటీసీని.. ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్య, ఐటీ, పేపర్, ప్యాకేజింగ్, వ్యవసాయ ఉత్పత్తులు తదితర రంగాల్లోకి విస్తరించిన ఘనత దేవేశ్వర్‌దే. ఈ క్రమంలోనే నేడు ఐటీసీ 60 లక్షలకుపైగా మందికి ఉపాధిని అందించగలుగుతున్నది. దేవేశ్వర్ ఐటీసీ పగ్గాలు అందుకున్న సమయంలో సంస్థ ఆదాయం రూ.5,200 కోట్లలోపే. స్థూల లాభం రూ.452 కోట్లే. అలాంటి ఐటీసీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.44,329.77 కోట్ల ఆదాయాన్ని అందుకున్నది. నికర లాభం కూడా రూ.11,223.25 కోట్లుగా నమోదైంది.

ఎన్నెన్నో పదవులు

సమర్థులను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నది దేవేశ్వర్‌ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఐఐటీ-ఢిల్లీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో విద్యనభ్యసించిన దేవేశ్వర్.. తన జీవితంలో ఎన్నెన్నో పదవులను అలంకరించారు. 1991-94 మధ్య ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డులో డైరెక్టర్‌గా, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ సభ్యుడిగా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్పీల్డ్ ఎకనామిక్ రిసెర్చ్ పాలక మండలి సభ్యుడిగా సేవలందించారు. అంతేగాక బ్రిటన్-ఇండియా సీఈవోల ఫోరం, అమెరికా-ఇండియా సీఈవోల ఫోరంలలో సభ్యుడిగా కూడా ఉన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడిగా, పలు భారతీయ ప్రీమియర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సంఘాల జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీల్లోనూ కీలకపాత్ర పోషించారు. అంతేగాక కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ట్రేడ్ బోర్డులో, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లలో సభ్యుడిగానూ పనిచేశారు. దేశీయ పరిశ్రమ ముద్దుగా వైసీడీ అని పిలుచుకునే దేవేశ్వర్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయన్ను 2011లో దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించింది.

పరిశ్రమకు తీరని లోటు

దేవేశ్వర్ మృతిపట్ల వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ రంగాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. భారత వ్యాపార, పారిశ్రామిక రంగానికి దేవేశ్వర్ చేసిన సేవలు మరువలేనివని, ఐటీసీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేవేశ్వర్ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఓ కార్పొరేట్‌గా, ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఐటీసీని ఆయన అత్యున్నత శిఖరాలకు చేర్చారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కొనియాడారు. దేవేశ్వర్ ఓ కార్పొరేట్ దిగ్గజమని, ఆయన మరణం దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు తీరని లోటుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. భారత పరిశ్రమకు దేవేశ్వర్ మృతి తీరని లోటని, దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఆయన ఓ దిక్సూచి అని. గొప్ప విలువలున్న కార్పొరేటని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు దేవేశ్వర్ గొప్ప సేవలను అందించారని, ఆయన మరణం అటు సంస్థకు, ఇటు దేశానికి తీరని లోటని అసోచామ్ అధ్యక్షుడు బీకే గోయెంకా అన్నారు. దేవేశ్వర్ ఇక లేరన్నది నమ్మలేకపోతున్నానని, ఐటీసీ విస్తరణలో ఆయనది చెరుగని ముద్రని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని బయోకాన్ సీఎండి కిరణ్ మజుందార్ షా వెలిబుచ్చారు.

రాష్ట్రంతో విడదీయరాని అనుబంధం

ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్‌తో రాష్ట్రానికి వీడదీయరా ని అనుబంధం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టీఎస్‌ఐపాస్ ఆవిష్కరణలో రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంతో దేవేశ్వర్ పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా పలుమార్లు రాష్ట్రానికి వచ్చారాయన. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను ప్రశంసించిన విషయం తెలిసిందే. కాగా, 2015 జూన్ 12న టీఎస్‌ఐపాస్ సభలో దేవేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానం అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నన్ను ఆహ్వానించకపోతే నా జీవితంలోనే అత్యుత్తమ కార్యక్రమాన్ని నేను కోల్పోయి ఉండేవాడిని అనడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన నూతన పారిశ్రామిక విధానాన్ని స్వాగతిస్తున్నాను. ఏ విధానమైనా అమలు కావాలంటే పటిష్టమైన నాయకత్వం అవసరం. అటువంటి నాయకత్వాన్ని అందించగల సమర్థవంతమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఖాయిలాపడ్డ బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సహకరిస్తామని, ఇందుకు ఉన్న అవకాశాలను తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చిన దేవేశ్వర్.. కేటీఆర్ ఓ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలు కురిపించారు.
YC-Deveshwar1

గొప్ప కార్పొరేట్ సీఎం కేసీఆర్ నివాళి

ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గతంలో టీఎస్‌ఐపాస్ ప్రారంభ సభలో దేవేశ్వర్ పాల్గొని చేసిన ప్రసంగాన్ని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా సీఎం తన సంతాప సందేశంలో గుర్తు చేసుకున్నారు.
YC-Deveshwar2

ట్విట్టర్‌లో కేటీఆర్ సంతాపం

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా దేవేశ్వర్ మృతిపట్ల సంతాపం తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనను కలిసినప్పుడు ఎంతో ఉత్తేజాన్ని పొందానని ట్వీట్ చేశారు. భారతీయ బ్రాండ్‌లకు ప్రపంచ దేశాల్లో గుర్తింపు రావడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు.

1295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles