3,500 కోట్ల బినామీ ఆస్తుల జప్తు


Fri,January 12, 2018 01:01 AM

వివరాలను వెల్లడించిన ఐటీ శాఖ
benami-property-act
న్యూఢిల్లీ, జనవరి 11: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ రూ.3,500 కోట్ల విలువైన బినామీ ఆస్తులను జప్తు చేసింది. ఫ్లాట్లు, షాపులు, ఆభరణాలు, వాహనాలుసహా 900లకుపైగా బినామీ స్థిరచరాస్తులను స్వాధీ నం చేసుకున్నట్లు గురువారం ఓ ప్రకటనలో ఐటీ శాఖ వెల్లడించింది. వీటిలో వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లతోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయని తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.3,500 కోట్లపైనేనని, స్థిరాస్తుల విలువే సుమారు రూ.3,000 కోట్లని పేర్కొన్నది. ఐదు కేసుల్లో పట్టుబడిన ఆస్తుల విలువ రూ. 150 కోట్లపైనేనని ఐటీ శాఖ వివరించింది. ఓ కేసులో కొందరు వ్యక్తుల పేరిట దాదాపు 50 ఎకరాల భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కలిగి ఉందని, దీని విలువ రూ.110 కోట్లకుపైగా ఉందని చెప్పిన ఐటీ శాఖ.. మరో కేసులో పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇద్దరు వ్యక్తులు తమ వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఖాతాల్లో దాదాపు రూ.39 కోట్ల వరకు రద్దయిన నోట్లను డిపాజిట్ చేశారన్నది.

ఇంకో కేసులో రూ.1.11 కోట్లు వాహనంలో పట్టుబడ్డాయని, ఈ నగదు తమదంటూ ఎవరూ ముందుకురాలేదన్నది. కాగా, బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధిత చట్టం కింద తీసుకున్న చర్యల్లో భాగంగా వీటన్నిటినీ జప్తు చేసినట్లు పేర్కొన్నది. 2016 నవంబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం బినామీ స్థిరచరాస్తులను స్వాధీనం చేసుకోవడమేగాక, ప్రయోజనం పొందిన యజమానిని విచారణ కూడా చేయవచ్చు. బినామీదారు నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేండ్ల వరకు కఠిన జైలుశిక్ష, పట్టుబడిన ఆస్తుల మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బినామీ ఆస్తులపట్ల కఠిన వైఖరిని అవలంభించడంలో భాగంగా గతేడాది మే నెలలో తమ దర్యాప్తు విభాగాల పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా 24 అంకితభావం కలిగిన బినామీ నిర్మూలన యూనిట్ల (బీపీయూ)ను కూడా ఐటీ శాఖ ఏర్పాటుచేసింది.

-బినామీ అంటే పేరు లేనిది. న్యాయ/చట్టబద్ధమైన యజమాని లేని ఆస్తి లేదా కల్పిత యజమాని ఆస్తి
-ఎవరివద్దనైతే ఓ ఆస్తి ఉందో, ఎవరికైతే బదిలీ అయ్యిందో ఆ ఆస్తి లావాదేవీలకు సంబం చి వేరొకరు చెల్లింపులు జరుపడాన్ని బినామీ లావాదేవీగా బినామీ చట్టం చెబుతున్నది
-నల్లధనం నిర్మూలనలో భాగంగా తొలిసారి 1988లో పరిచయమైన బినామీ చట్టం
-బినామీ లావాదేవీల నిషేధం, ఆస్తుల జప్తు కోసం 2016లో సవరణలు
-ఆస్తులను దాచి పెట్టడం లేదా ఓ ఆస్తి తనదేనని ప్రకటించకపోవడం, ఇతరుల పేరిట లావాదేవీలను నిర్వహించడం వంటి వాటిని బినామీ చట్టం-2016లో చేర్చారు

530

More News

VIRAL NEWS