ఇరాన్‌కు అమెరికా సెగ

Sun,February 17, 2019 01:58 AM

Iran shocks in the embargo

ఆంక్షలతో జనవరిలో భారీగా తగ్గిన భారత క్రూడ్ దిగుమతులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఇరాన్ నుంచి భారత ముడి చమురు దిగుమతులు క్రమేణా తగ్గిపోతున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో గత నెలలో ఏకంగా 45 శాతం పడిపోవడం గమనార్హం. జనవరిలో దేశంలోకి వచ్చిన రోజువారి ఇరాన్ క్రూడాయిల్ 2,70,500ల బ్యారెల్స్‌గా ఉన్నది. ముందుగా అంచనా వేసిన 3 లక్షల పీపాల కంటే ఇది తక్కువే. కొన్ని నౌకల రాక ఆలస్యమైనట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడ్డ ఇరాన్‌ను దారిలోకి తెచ్చేందుకు గతేడాది నవంబర్‌లో అగ్రరాజ్యం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇరాన్ అణు కార్యకలాపాల నియంత్రణలో భాగంగా, అలాగే సిరియా, యెమన్, లెబనాన్, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాల్లో ఉగ్రవాదులకు ఇరాన్ ఇస్తున్న మద్దుతును ఆపేందుకు ఆ దేశం నుంచి ముడి చమురును కొనరాదని ప్రపంచ దేశాలకు అమెరికా స్పష్టం చేసింది. అయితే భారత్‌సహా ఎనిమిది దేశాలకు ఆరు నెలల మినహాయింపునిచ్చింది.



డిసెంబర్ నుంచే క్షీణత

దేశ చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నెమ్మదిగా అమెరికా ఆంక్షల అమలు దిశగా భారత్ అడుగులేస్తున్నది. రోజుకు 3 లక్షల బ్యారెళ్ల చొప్పున నెలకు 1.25 మిలియన్ టన్నులను మించి ఇరాన్ నుంచి ముడి చము రు కొనుగోళ్లు జరుపరాదని భారత్‌పై అమెరికా నిబంధనలు విధించింది. దీంతో డిసెంబర్‌లోనే ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించడం ఆరంభించిన భారత్.. జనవరిలో అదనంగా మరో 10.4 శాతం దిగుమతుల్ని తగ్గించుకున్నది. ఈ క్రమంలో భారత్‌కు ముడి చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో డిసెంబర్‌లో ఆరో స్థానంలో ఉన్న ఇరాన్.. జనవరిలో ఏడో స్థానానికి దిగజారింది. నిరుడు జనవరి భారతీయ ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 10 శాతంగా ఉన్న ఇరాన్ క్రూడ్ వాటా.. ఈ ఏడాది జనవరిలో సుమారు 6 శాతానికి క్షీణించింది. భారత్‌కు ముడి చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఒకప్పుడు ఇరాన్ మూడో స్థానంలో ఉన్నది తెలిసిందే.


ఆకర్షించేందుకు రాయితీలు

అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు దిగుమతిదారులను ఆకట్టుకునేందుకు ఇరాన్ రాయితీలనూ ప్రకటించింది. ఇరాన్‌పై ఆంక్షల సంకేతాలు ముందు నుంచే ఉన్న నేపథ్యంలో గతంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) తొలి పది నెలల్లో భారత్ ముడి చమురు దిగుమతులు బాగానే పెరిగాయి. ఏప్రిల్ నుంచి జనవరిదాకా జరిగిన దిగుమతుల్లో 14.5 శాతం పెరుగుదల కనిపించింది. సగటున రోజుకు 5,07,000 బ్యారెళ్ల ముడి చమురు ఇరాన్ నుంచి భారత్‌కు చేరింది. అమ్మకాలను పెంచుకునేందుకు దాదాపు ఉచిత రవాణా, రుణ పరిమితి పొడిగింపు తదితర ఆఫర్లను ఇచ్చింది. దీంతో రిఫైనర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు.



భారీగా ఆర్డర్లు

ఈ నెలలో ఇరాన్ ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి భారతీయ ప్రభుత్వ రిఫైనరీలు పెద్ద ఎత్తునే ఆర్డర్లిచ్చాయి. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 5 మిలియన్ల బ్యారెళ్లు, మంగళూరు రిఫైనరీ పెట్రోలియం కార్ప్ 2 మిలియన్ బ్యారెళ్లు, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ఒక్కో మిలియన్ బ్యారెళ్ల చొప్పున కొనాల్సి ఉన్నది. దీనిపై ఆయా సంస్థలు స్పందించకుండా ఉండగా, ప్రభుత్వ వర్గాలు మాత్రం గత ఆర్థిక సంవత్సరం (2017-18) కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులు పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు. రోజుకు 4,52,000 బ్యారెళ్లు లేదా మొత్తం 22.6 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతులు జరుగవచ్చని చెబుతున్నారు. ఒక్క జనవరిలోనే ఆయా దేశాల నుంచి మొత్తం భారత చమురు దిగుమతులు రోజుకు 4.6 మిలియన్ బ్యారెళ్లుగా నమోదయ్యాయి. అయినప్పటికీ ఇది గతంతో పోల్చితే దాదాపు 10.4 శాతం తక్కువ కావడం గమనార్హం.

2249
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles