భారీ చమురు బావి

Mon,November 11, 2019 03:39 AM

- కనుగొన్న ఇరాన్‌
టెహ్రాన్‌, నవంబర్‌ 10: ఇరాన్‌.. ఓ భారీ కొత్త చమురు క్షేత్రాన్ని కనుగొన్నది. ఇప్పటికే ఉన్న అపార చమురు నిల్వలకు ఇది తోడైందని ఆ దేశాధ్యక్షుడు హసన్‌ రౌహాని ఆదివారం అన్నారు. ముఖ్యంగా ఇరాన్‌ చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు విధించిన వేళ ఈ చమురు క్షేత్రం చేతికందడంపట్ల ఆనందం వెలిబుచ్చారు. ప్రభుత్వ టెలివిజన్‌లో రౌహని మాట్లాడుతూ తమ సీనియర్‌ నేతలు, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న చర్యల మధ్య కూడా దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని అన్నారు. ఖుజెస్తాన్‌ నైరుతి ప్రావిన్స్‌లో వెలుగుచూసిన ఈ చమురు క్షేత్రంలో విస్తారంగా చమురు నిల్వలున్నాయని చెప్పారు. ఇరాక్‌తో ఉన్న ఖుజెస్తాన్‌ సరిహద్దు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల మేర ఈ చమురు క్షేత్రం వ్యాపించి ఉందని, 80 మీటర్ల లోతులో రిజర్వాయర్‌ ఉన్నదని ప్రకటించారు.


మాది ధనిక దేశమే: రౌహాని

‘మాది కూడా ధనిక దేశమేనని, నేడు అమెరికాకు మేము చెబుతున్నాం. మీతో వైరం ఉన్నా.. మాపై మీరు దారుణమైన ఆంక్షలు విధిస్తున్నా.. మా చమురు పరిశ్రమ కార్మికులు, ఇంజినీర్లు ఓ భారీ చమురు క్షేత్రాన్ని కనుగొన్నారు’ అని రౌహాని ఈ సందర్భంగా అన్నారు. ఈ బావితో ఒపెక్‌ సభ్య దేశాల చమురు నిల్వల పరిమాణం దాదాపు 34 శాతం పెరుగుతుందని తెలియజేశారు. బ్రిటీష్‌ పెట్రోలియం అంచనా ప్రకారం ఒపెక్‌ సభ్య దేశాల చమురు నిల్వలు ప్రస్తుతం 155.6 బిలియన్‌ బ్యరెల్స్‌గా ఉన్నాయి.

661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles