బడ్జెట్ అంతా బోగస్?

Wed,January 23, 2019 12:03 AM

-గణాంకాలన్నీ మోసపూరితం
-అడ్డగోలు నిర్ణయాలతో ప్రజాధనం వృథా
-కేంద్రం తీరును కడిగిపారేసిన కాగ్
-ఖజానాను నింపేందుకు తప్పుడు నిర్ణయాలు
-బలవంతపు విలీనాలు, వాటాల అమ్మకం అంటూ ఆగ్రహం

న్యూఢిల్లీ, జనవరి 22: వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈసారి బడ్జెట్.. మధ్యంతర లేదా ఓట్-ఆన్-ఎకౌంట్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి పద్దుపై తుది నిర్ణయం ఎన్నికల అనంతరం కొలువుదీరే కొత్త ప్రభుత్వానిదే. అయినప్పటికీ మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తమ సర్కారు లక్ష్యాలను ప్రతిబింబించేలా భారీ బడ్జెట్‌నే ప్రకటించవచ్చు. అయితే సమస్యల్లా ఈ బడ్జెట్ గణాంకాలు చాలా మోసపూరితంగా ఉండే అవకాశాలుండటమే. ఎందుకంటే ఇది కోరుకున్న బడ్జెట్ కాదు. సంప్రదాయం ప్రకారం తీసుకువస్తున్నది. అసలు బడ్జెట్ ముఖచిత్రం, దాని అమలు అన్నది.. ఎన్నికల్లో గెలిచిన పార్టీ చేతుల్లో ఉంటుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూలేని ఓ ఆరు మార్గాల్లో తమ వ్యయాన్ని దాచిపెడుతున్నట్లు తెలుస్తున్నది.

ఈ నెలారంభంలో పార్లమెంట్‌కు సమర్పించిన ఓ నివేదికలో చాలా ప్రభుత్వ రాయితీల ఖర్చుపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో చాలాచాలా తక్కువచేసి చెబుతున్నట్లు పేర్కొన్నది. దేశ జీడీపీలో ద్రవ్యలోటును గత ఆర్థిక సంవత్సరం (2017-18) 3.5 శాతానికి అదుపు చేసిన మోదీ సర్కారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) 3.3 శాతానికే కట్టడి చేయాలని నిర్దేశించుకున్న సంగతి విదితమే. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నది ప్రభుత్వం. దీంతో తొలి ఎనిమిది నెలల్లోనే లక్ష్యాన్ని దాటి ద్రవ్యలోటు నమోదవగా, నిధుల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. కాగ్ నివేదిక దీన్నే ప్రతిబింబించగా, ప్రభుత్వ అపరిమిత వ్యయంపట్ల హెచ్చరికలు చేస్తున్నది. రైతులకు ఎరువుల సబ్సిడీ, విద్యుత్, రైల్వేల్లో పెట్టుబడులు తదితర అంశాలు పారదర్శకంగా ఉండట్లేదని సూచిస్తున్నది. బడ్జెట్‌లో చెబుతున్నదానికి, చేస్తున్నదానికి సంబంధం లేదంటున్నది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో మరిన్ని గారడీ అంకెలు ఉండనున్నాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అనాలోచిత నిర్ణయాలు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా ద్రవ్యలోటు లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయంటూ కాగ్ మండిపడింది. ప్రధానంగా చిన్న మొత్తాల పొదుపు పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నది. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు పోగేసుకుంటున్న కష్టార్జితాన్ని.. బాధ్యతాయుతమైన పెట్టుబడులతో పదింతలు చేయాల్సిందిపోయి దివాలా అంచున ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను రక్షించడానికి వెచ్చిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ఆర్థిక సాయం చేస్తున్నదని, దీనివల్ల ఏం లాభమని నిలదీయడం గమనార్హం. అంతేగాక ఆర్థికంగా పరిపుష్ఠంగా ఉన్న సంస్థలను.. నష్టాల్లో ఉన్న సంస్థలతో విలీనం చేస్తున్నదంటూ పవర్ ఫైనాన్స్ కార్ప్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌ల కలయిక వ్యవహారాన్ని ఉదహరించింది. ఖజానాను నింపేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో అనవసరపు పెట్టుబడుల ఉపసంహరణలు చేస్తున్నారంటూ విమర్శించింది.

మరికొన్ని సంస్థలూ ఆందోళన

కాగ్‌తోపాటు మరికొన్ని ఆర్థిక సంస్థలూ ప్రభుత్వ వ్యయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్‌ఎస్‌బీసీ, బ్లూంబర్గ్ ఎల్‌పీ వంటి అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషణాత్మక దిగ్గజాలు వీటిలో ఉండటం విశేషం. 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2017-18లో ప్రభుత్వ అప్పులు పెరిగినట్లు తెలుస్తున్నదని, ఖర్చులు కూడా విపరీతంగా అవుతున్నాయని వివరించాయి. ఆదాయం తక్కువగా ఉన్న వేళ వ్యయం పెరిగితే ఆర్థిక క్రమశిక్షణకు భంగం వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు. ఈసారి ద్రవ్యలోటు లక్ష్యాలు దెబ్బతినడం ఖాయమన్న అభిప్రాయాలు వారి నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ అవసరాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి, మరికొన్ని ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మధ్యంతర డివిడెండ్లను మోదీ సర్కారు కోరుతున్న విషయం తెలిసిందే. పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి నిర్ణయాలూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టగా, జీఎస్టీ పన్నుల తగ్గింపూ నెలసరి వసూళ్లను బక్కచిక్కేలా చేస్తున్నది.

1932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles