మరోసారి ఇన్ఫీ బైబ్యాక్!

Wed,January 9, 2019 12:22 AM

Infosys to consider share buyback special dividend

- ఈ నెల 11న ప్రకటించే అవకాశం
న్యూఢిల్లీ, జనవరి 8: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్ మరోమారు బైబ్యాక్ ప్రకటించేయోచనలో ఉన్నది. దీంతోపాటు ప్రత్యేక డివిడెండ్, వ్యాపార విస్తరణకు భారీ స్థాయిలో నిధుల కేటాయింపుపై ఈ నెల 11న(శుక్రవారం) జరుగనున్న బోర్డు సమావేశంలో చర్చించనున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అదేరోజు కంపెనీ మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నది. సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలను బీఎస్‌ఈకి అందించనున్నది. కంపెనీ వద్ద మిగులు నిధులు అధికంగా ఉండటంతో గతేడాది ఏప్రిల్‌లోనే రూ.13 వేల కోట్ల వరకు వాటాదారులకు పంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదేక్రమంలో జూన్ 2018 త్రైమాసిక ఫలితాలను విడుదల చేసినప్పుడు ప్రకటించిన రూ.10 ప్రత్యేక డివిడెండ్ కోసం రూ.2,600 కోట్ల నిధులను వెచ్చించింది. మిగతా రూ.10,400 కోట్లను ఏ రూపంలో పంచేదానిపై సమాలోచనలు చేసి చివరకు డివిడెండ్‌కు మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

గ్లోబల్ హెడ్ సుదీప్ సింగ్ రాజీనామా

ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థను వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులు సంస్థకు గుడ్‌బై పలుకగా..తాజాగా మరో ఉన్నతాధికారి రాజీనామా చేశారు. సంస్థలో రెండు దశాబ్దాలుగా వివిధ హోదాలో పనిచేసిన ఎనర్జీ, యుటిలిటీ, రిసోర్స్, సర్వీసెస్ యూనిట్ అంతర్జాతీయ హెడ్ సుదీప్ సింగ్ రాజీనామా చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయన రాజీనామాకు గల కారణాలను సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ యూనిట్ 1.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 100 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విభాగం ఆయన సారథ్యంలో 750 మిలియన్ డాలర్లకు చేరుకున్నది. గతేడాది అక్టోబర్‌లో గ్లోబల్ హెడ్ కెన్ థంబ్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎండీ రంగనాథ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

348
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles