ఇన్ఫీ లాభం తగ్గింది

Sat,January 12, 2019 12:23 AM

Infosys Q3 result out profit falls 29.6 Percentage

- అమ్మకాల్లో ప్రత్యేక డివిడెండ్

బెంగళూరు, జనవరి 11: మరో ప్రధాన ఐటీ కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరాశపరిచే విధంగా ఉన్నాయి. మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన ఇన్ఫోసిస్ ఫలితాలు అన్ని రకాలుగానూ నిరాశజనకంగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికరలాభం 30 శాతం మేర క్షీణించి రూ. 3,610 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలానికి రూ. 5,129 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కానీ, ఆదాయం 20.3 శాతం పెరిగి రూ. 17,794 కోట్ల నుంచి రూ. 21,400 కోట్లకు చేరుకుంది. నికరలాభం, స్థూల లాభం, నిర్వహణ మార్జిన్ల విషయంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. నికరలాభం ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోల్చినా సరే 12 శాతం తక్కువగా ఉంది. మార్కెట్ వర్గాలు రూ. 4,115 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశాయి. గత త్రైమాసికంలో రూ. 4,110 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. రూపాయిల్లో ఆదాయం 3.8 శాతం పెరిగి రూ. 21,400 కోట్లకు చేరుకుంది.

కాగా, డాలర్లలో ఆదాయం 2.3 శాతం పెరిగి 2,987 మిలియన్ డాలర్లకు చేరుకుంది. రెవెన్యూ విషయంలో మార్కెట్ అంచనాలను అందుకోగలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ 8.5 శాతం నుంచి 9 శాతం మేర పెరుగుతుందనీ, అలాగే నిర్వహణ మార్జిన్ 22-24 శాతం మేర ఉంటుందని ఇన్ఫోసిస్ గైడెన్స్‌ను జారీ చేసింది. నిర్వహణ లాభ మార్జిన్లు 1.1 శాతం తగ్గి 22.6 శాతంగా నమోదైంది. 23.6 శాతంగా ఉండవచ్చునని మార్కెట్ వర్గాలు, వివిధ బ్రోకరేజీలు సగటున అంచనా వేశాయి. ఈ త్రైమాసికంలో రూ. 4,830 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. ఇది కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఇదిలాఉండగా, ప్రతిషేరుకు నాలుగు రూపాయల ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 25వ తేదీని రికార్డ్ తేదిగా నిర్ణయించారు.

ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కిరణ్ మజుందార్ షా

ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కిరణ్ మజుందార్ షాను తిరిగి నియమించుకున్నది సంస్థ. ఈ పదవిలో ఆమె మార్చి 22, 2022 వరకు కొనసాగుతారు. కంపెనీ స్థిరపడేందుకు, వృద్ధి బాటలో పయనించేందుకు గత 18 నెలలుగా ఆమె అందించిన సేవలు విలువైనవని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. ఆమె అనుభవం కంపెనీకి అవసరమని అన్నారు. ఇదిలావుండగా, పనయాతో పాటు మరో రెండు అనుబంధ సంస్థలు స్కావ, కల్లిడస్‌లను అమ్మేయాలన్న ప్రతిపాదనలను విరమించుకున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కొనుగోలుదారులు దొరకనందునే ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిపారు.

రూ.8,2600 కోట్ల షేర్ల బైబ్యాక్

రూ. 8,260 కోట్ల విలువైన షేర్లను బైబ్యాంక్ చేయనున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. మొత్తం 10,32,50,00 షేర్లను, అంటే ఈక్విటీలో 2.36 శాతానికి సమానమైన షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయను న్నారు. ప్రతి షేరు దాదాపు రూ. 800 చొప్పున వెచ్చించనున్నది సంస్థ. అమెరికన్ డిపాజటరీ షేర్లను (ఎడీఎస్)ఈక్విటీ షేర్లుగా మార్చుకుని ఆ తర్వాత వాటిని అమ్ముకునేందుకు వీలు కల్పించారు. గత ఏడాది దాదాపు రూ 13,000 కోట్లతో ప్రతిషేరుకు రూ. 1,150 చొప్పున 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసిన విషయం తెలిసిందే. బైబ్యాక్ కోసం కమిటీ నియమించినట్టు తెలిపింది. ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్ ప్రతిపాదనకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదం పొందనున్నట్టు తెలిపింది.

625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles