విచారణ మొదలైంది

Wed,October 23, 2019 05:17 AM

-ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని ప్రకటన
-సీఈవో, సీఎఫ్‌వో అనైతిక చర్యలపై సమగ్ర దర్యాప్తు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్‌లపై వచ్చిన అనైతిక చర్యలపై విచారణ చేస్తున్నామని దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని మంగళవారం తెలిపారు. అక్రమ విధానాలతో సంస్థ ఆదాయం, లాభాలను పెంచే ప్రయత్నం చేశారని కంపెనీ విజిల్‌బ్లోవర్లు ఇన్ఫీ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిలేకని ప్రకటించారు. గత నెల 20న నీతిగల ఉద్యోగులు పేరిట ఈ లేఖను ఇన్ఫీ బోర్డుకు విజిల్‌బ్లోవర్లు పంపారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 10న సదరు లేఖను ఆడిట్ కమిటీ ముందు పెట్టామని, మరుసటి రోజు బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఎదుటకు తీసుకెళ్లామని నిలేకని తెలియజేశారు. అక్టోబర్ 11న జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఈ వ్యవహారంపై స్వతంత్ర అంతర్గత ఆడిటర్లతో ఆడిట్ కమిటీ సంప్రదింపులను ప్రారంభించింది. స్వతంత్ర దర్యాప్తు కోసం శార్దుల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో న్యాయ సంస్థనూ నియమించింది అని స్పష్టం చేశారు. కాగా, బోర్డు సభ్యుల్లో ఒకరికి గత నెల 20న, 30న రెండు ఫిర్యాదులు అందాయని చెప్పారు.

ఇన్ఫీపై అమెరికా న్యాయ సంస్థ దావా

ఇన్ఫోసిస్‌పై అమెరికా న్యాయ సంస్థ దావా వేసేందుకు సిద్ధమవుతున్నది. సీఈవో, సీఎఫ్‌వోల అనైతిక చర్యలపై ఇన్ఫోసిస్ బోర్డుతోపాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు విజిల్‌బ్లోవర్లు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా న్యాయ సంస్థలు ఇన్ఫీపై చర్యలపట్ల దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే సెక్యూరిటీస్ సంబంధిత చర్యల్లో విశేష గుర్తింపున్న రోజెన్ న్యాయ సంస్థ.. వాటాదారుల తరఫున అన్నిరకాల లోపాలపై దర్యాప్తును కొనసాగించాలని ఇన్ఫోసిస్‌కు సూచిస్తున్నది. ఇన్ఫోసిస్ మదుపరుల నష్టాలను భర్తీ చేసేందుకు ఓ క్లాస్ యాక్షన్ లాసూట్‌ను రోజెన్ లా సంస్థ సిద్ధం చేస్తున్నది. అవకతవకల ఆరోపణలు వచ్చినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న షేర్ల కంపెనీలకు ఈ తరహా నోటీసులు సాధారణంగానే వస్తూంటాయి.
nandan-nilekani-file

మద్రాసీలు అంటూ చులకన

ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులనుద్దేశించి సీఈవో సలీల్ పరేఖ్ చాలా చులకనగా మాట్లాడేవారని, జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని విజిల్‌బ్లోవర్లు తమ లేఖలో పేర్కొన్నారు. భారీ ఒప్పందాల గురించి వారికి చెప్పినా అర్థం కాదని, వారికి షేర్ విలువ పెరిగితే చాలంటూ బోర్డులోని డీఎన్ ప్రహ్లాద్, డీ సుందరం, కిరణ్ మజుందార్ షాలను పరేఖ్ తేలిగ్గా తీసిపారేశారని చెప్పారు. ప్రహ్లాద్, సుందరంలు మద్రాసీలు. ఇక మజుందార్ షా దివా. వెర్రి ప్రశ్నలు వేస్తారు. వారిని మీరు పట్టించుకోనక్కర్లేదు. వదిలేయండి అని పరేఖ్ అన్నట్లు లేఖలో ఉద్యోగుల బృందం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిషా, లక్షద్వీప్ వాసులకు ప్రతిభ ఉండదన్నట్లు వ్యవహరించేవారని చెప్పారు. కాగా, ప్రహ్లాద్.. సూర్య సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక సీఈవోగా ఉండగా, సుందరం.. టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్నారు. కిరణ్ మజుందార్ షా.. బయోకాన్ సీఎండీగా ఉన్న సంగతి విదితమే.

షేర్లు ఢమాల్.. 53 వేల కోట్లు ఆవిరి!

ఇన్ఫోసిస్‌లో వచ్చిన అనైతిక చర్యల ఆరోపణలు ఆ సంస్థ షేర్ విలువను భారీగా నష్టపరిచాయి. మంగళవారం ఒక్కరోజే ఇన్ఫీ షేర్ విలువ దాదాపు 17 శాతం పడిపోయింది. తీవ్ర ఆందోళనకు గురైన మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు తెర తీశారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)లో 16.21 శాతం క్షీణించి రూ.643.30 వద్ద స్థిరపడిన ఇన్ఫీ షేర్.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో 16.86 శాతం పతనమై రూ.638.30 వద్ద నిలిచింది. గడిచిన ఆరేండ్లకుపైగా కాలంలో ఇన్ఫోసిస్ షేర్ విలువ ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. 2013 ఏప్రిల్ నాటి కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో రూ.640 స్థాయికి చేరడం గమనార్హం. మరోవైపు మదపరుల సంపద రూ.53, 450.92 కోట్లు హరించుకుపోయింది. బీఎస్‌ఈలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.2,76,300.08 కోట్లుగా ఉన్నది.

648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles