ఈసారి 4.1 శాతమే

Mon,July 22, 2019 03:06 AM

Inflation in India to fall with stronger rupee, lower GDP forecast says ADB

2019-20కిగాను దేశ ద్రవ్యోల్బణం అంచనాను తగ్గించిన ఏడీబీ
న్యూఢిల్లీ, జూలై 21: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను దేశ ద్రవ్యోల్బణం అంచనాను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడుతుండటం, జీడీపీ అంచనాల్లో కోతల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండొచ్చని చెప్పింది. ఇంతకుముందు ఇది 4.3 శాతంగా ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో ద్రవ్యోల్బణం తగ్గేందుకు భారత్ ప్రధాన చోదక శక్తి కాగలదన్న ఏడీబీ.. ఈ ఏడాది దక్షిణాసియా దేశాల ద్రవ్యోల్బణం అంచనానూ 4.7 శాతం నుంచి 4.5 శాతానికి దించింది. ఆసియా అభివృద్ధి ముఖచిత్రం (ఏడీవో) 2019కు తాజా అనుబంధంలో ఏడీబీ ఈ అంచనాల్ని వెలిబుచ్చింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ద్రవ్యోల్బణం అంచనాను 4.4 శాతంగా పేర్కొన్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం 2019-20 ప్రథమార్ధానికి (ఏప్రిల్-సెప్టెంబర్) రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 3.4-3.7 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 3.5-3.8 శాతంగా ఉండేది. ఆర్బీఐ వచ్చే నెల ఆరంభంలో ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షను చేపట్టనున్నది. ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగానే కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ సవరిస్తున్న సంగతి విదితమే. దీంతో ద్రవ్యోల్బణం మరింత అదుపులోకి వస్తే రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను తగ్గించేందుకు అవకాశముంటుంది. కాగా, ఈ ఏడీవోలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను దేశ జీడీపీ అంచనాను 7 శాతంగా ఏడీబీ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ అనుబంధంలో 7.2 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు 0.2 శాతం మేర తగ్గించింది.

235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles