ఇండస్‌ఇండ్ లాభంలో భారీ వృద్ధి


Fri,January 12, 2018 12:42 AM

indus-ind
ముంబై, జనవరి 11: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.936.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు హిందుజా గ్రూపునకు చెందిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. కీలక ఆదాయం భారీగా పుంజుకోవడం ఇందుకు కలిసొచ్చిందని బ్యాంక్ వర్గాలు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.756.24 కోట్లతో పోలిస్తే 24.72 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఆదాయం విషయానికి వస్తే రూ.4,716.13 కోట్ల స్థాయి నుంచి రూ.5,473.54 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. గడిచిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.1,894.81 కోట్లకు చేరుకోగా, అడ్వాన్స్‌ల్లో 25 శాతం, డిపాజిట్లలో 23 శాతం మేర పెరిగినట్లు బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమేష్ సోబ్టి తెలిపారు. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.16 శాతంగా నమోదైందన్నారు. సూక్ష్మ రుణాలు అందించే భారత్ ఫైనాన్షియల్స్ సంస్థ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపిందని, అలాగే సెబీ, ఎన్‌సీఎల్‌టీ అనుమతికోసం వేచి చూస్తున్నట్లు ఆయన చెప్పారు. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు ధర 2.08 శాతం తగ్గి రూ.1,698.80 వద్ద ముగిసింది.

243

More News

VIRAL NEWS